Sunday 25 March 2018

“ప్రజ-పద్యం” ఆత్మీయ కవిసమ్మేళనం


విశాఖ పట్టణంలో  ప్రజ-పద్యం ఆత్మీయ కవిసమ్మేళనం మరియు హరి-సిరి-నతి-నుతి శతకావిష్కరణ.

ఉ.
శ్రీకరమైన పద్యమును క్షిప్రగతిన్ జన మానసంబులన్
దాకెడు రీతి జేయుటకు తన్మయతన్ బహుమూల్య బాధ్యతన్
చేకొని యా విశాఖపురి చేరె గదా ప్రజ పద్యసంఘ మ
స్తోక సరిత్పతీతటికి సుందర భావములంది విందనన్.                   1.

మ.
అవురా యెంతటి కార్యదీక్ష గలదో యా మువ్వురం జూడగా
స్తవనీయుల్ గణపత్యనంత సుకవుల్ తథ్యంబు పట్వర్ధనుల్
జవసత్త్వంబులు జూపినార లచటన్ శ్రద్ధాఢ్యులై యన్నిటన్
కవితాపర్వమునన్ విశాఖ నగరిన్ కల్యాణ సంపత్స్థలిన్.                2.
శా.
వారల్మిక్కిలి దక్షులైన సుకవుల్ పద్యంబు లందంబుగా
మేరల్లేని మనోజ్ఞభావములతో మేధావి వర్గంబు ప
ల్మారుల్ మేలని మెచ్చురీతి రచన ల్గావించి యచ్చోటకున్
దారేతెంచిరి యెందరోబుధవరుల్ తత్సాహితీసీమకున్.                           ౩.


చం.
ఒకరిని మించి యొక్కరుగ నున్నతలీల స్వకీయ పద్యముల్
ప్రకటితమైన భావముల భవ్యగతిన్ వినిపించినార లా
యకలుష మూర్తులౌ సుకవు లచ్చటి శ్రోతలు సంతసంబునన్
సకల శుభ ప్రదంబులగు  సన్నుతులందగ జేయ ముగ్ధులై.             4.
కం.
హరిసిరి నతినుతి యనియెడి
వరమగు శతకం బొకండు వైభవయుతమై
నిరుపమ మగుగతి యావి
ష్కరణము చేయంగ బడియె ఘనముగ నచటన్.                                  5.
సీ.
సుమధుర భావాల శోభిల్లు సద్గ్రంథ
మౌచిత్య భరితంబు నద్భుతంబు
సవ్యంబులైనట్టి సద్విశేషాలతో
పదగుంభనంబుతో పరిఢవిల్లు
శతకరాజంబౌచు సర్వత్ర దీప్తులన్
వెదజల్ల గలుగుచు ముదము బంచు
భక్తిభావము గూర్చి పఠితల కన్నింట
సద్యోగ దాయిగా హృద్యగతిని
ఆ.వె.
రచన చేయబడిన రమ్యాతి రమ్యమౌ
పుస్తకంబటంబు ప్రస్తుతులను
నందు కొనియె నద్ది హరిసిరి నతినుతి
శతక మట్టి దాని సన్ను తింతు.                                                                   6.
సీ.
పాత్రుల హృదయంబు మైత్రికి నిలయంబు
మాట యద్భుతమైన మమత కిరవు
వర్తనం బదిజూడ బాంధవ్యభరితంబు
భావమందున నిండు  పరిమళంబు
ఆహ్వానములలోన నత్యంత వినయంబు
సన్మాన మొసగుటన్  సాధు ఫణితి
ఆతిథ్య మందించి యాదరించుటలోన
నాన్యత్ర గనగల్గు నవ్య దీప్తి
తే.గీ.
ఒక్క రననేల నవ్వార లక్కజముగ
యువకులేగాదు పెద్దలు నుత్సహించి
పాత్ర పరివారమంతయు బహుళ గతుల
ప్రేమబంచిరి యెంతేని విజ్ఞులగుట.                                                    7.

మాకెన వంశజ పాత్రుల
కేకాలము విభవమొసగి యిమ్మహిలోనన్
శ్రీకరులౌ దివిజావళి
ప్రాకటముగ బ్రోచు గాత బహువత్సలతన్.                                         8.

No comments:

Post a Comment