Sunday 25 March 2018

కార్మిక సంక్షేమము


కార్మిక సంక్షేమము


శా.    శ్రీమంతం బిది నాధరిత్రి యనుచున్ క్షేమంబు లేకాల మీ
భూమిన్ జేరగ గోరుచుండు హితుడౌ పుణ్యాత్ము డీతండు తా
నేమాత్రంబును స్వార్థ మూనని నుం డేరీతిగా జూచినన్
ధీమంతుం డగు కార్మికుండు భువికిన్ దీప్తిప్రదుండెన్నడున్.                       .

.     తన ప్రాణంబును లెక్కచేయడు గదా! తాదాత్మ్యభావంబుతో
ననుమానం బొకయింతలేక సత మా యంత్రాల భూతాలతో
నమౌ మైత్రిని దాల్చుచుండి జనతా కల్యాణమే యెంచి యీ
మునితుల్యుం డసమాను డౌచు జగతిన్ మోదంబు చేకూర్చడే.                             .

కం.    భూతలమున సంతత మీ
జాతిని నిలబెట్టుచుండి చరితార్థుండౌ
నీతిని దప్పని వాడగు
నీతని జీవనము లోన నిడుములె చూడన్.                                                          .

సీ.      భార్య కాంక్షలు దీర్చ బంగారు వస్తువుల్
తెచ్చిపెట్టగ లేని తిరిపె మితడు
తనసంతు గోరంగ ననుగుణం బగువిద్య
నందించ లేనట్టి యల్పు డితడు
షడ్రసోపేతమై సత్త్వంబు కలిగించు
భోజనం బందంగ బో డితండు
వసతిసౌకర్యాల వైభవంబులు లేక
బ్రతుకీడ్చు చుండెడి బడు గితండు
.వె. కర్మఠుండు భువిని ధర్మంబు వీడని
వాని నితని గాచు వాడు కలడె
వీని కష్టఫలము లానందమున నందు
వారు దప్ప, హితము గోర రెవరు.                                                                    .


సీ.      తుష్టి కల్గెడి రీతి కష్టోచితంబైన
జీతంబు లేర్పాటు చేయుచుండి
వీని సంతానంబు వేడు సద్విద్యలన్
పొందు భాగ్యంబుల నందజేసి
మృత్యు వాతనుబడ్డ, నిత్య మాశ్రితులకు
వలయు నాధారంబు కలుగ జేసి
దేశాభివృద్ధికీ ధీశాలి యనిశంబు
చేయుచుండెడిశ్రమన్ స్వీకరించి
.వె. వీని నాదుకొనుట విజ్ఞయౌ ప్రభుతకు
ధర్మమందువలన తడయకుండ
హర్ష మొదవు నట్టు లన్నిరీతుల రక్ష
చేయవలయు నదియె ధ్యేయమనుచు.                                                              .


No comments:

Post a Comment