Sunday 25 March 2018

శ్రీ మాత్రే నమః.

శ్రీ మాత్రే నమః.
శా.   శ్రీమాతా! సకలస్తుతా! గిరిసుతా! శ్రీమత్కృపాపూరితా!
        క్షేమానీకవిధాయినీ! గుణమణీ! శ్రీచక్రసంచారిణీ!
        నామౌన్నత్యవతీ! గిరీశసుదతీ! నాన్యాస్థదేహద్యుతీ!
        నీమం బొప్పగ నిన్ను గొల్తు శుభ మీ నేలన్ సదా చూపగన్.

శా.   కామాక్షీ! కరుణాలయా! ఘనతరా! కైవల్యసంధాయినీ!
        వామాంగీ! వసుదా! భవాని! వరదా! వందారుహర్షప్రదా!
        శ్యామా! శాంకరి!శైలజా! జయకరీ! శర్వార్థదేహస్థితా!
        నీమాహాత్మ్యము నెంచు శక్తి నిడుమా నిత్యంబు నీసేవలోన్.

శా.    తల్లీ! నీదయ గల్గెనేని జగతిన్ ధైర్యాది సౌభాగ్యముల్
         సల్లాపంబున సద్వివేకఫణుతుల్ సర్వార్థసంపత్తులున్
         ఫుల్లాత్యాయతసద్యశఃప్రకరముల్ పూజ్యత్వ మన్నింటిలో
         కల్లోలంబులు లేని జీవనగతుల్ గాంచంగనౌ నిచ్చలున్.

శా.     ఎన్నో రూపములన్ ధరించి జననీ! యీ మేదినీస్థానమం
          దన్నింటన్ శుభసంతతుల్ నిలుపగా నత్యంతవాత్సల్య మీ
          వెన్నం జూపుచు నుందువమ్మ సతతం బేరీతి నీసేవలన్
          మన్నింపం దగునట్లు చేయగలనో మందుండ కావం దగున్.

శా.     అమ్మా! యెవ్వరు లేరు నీ సము లిలన్ హర్షాతిరేకంబుతో
          మమ్ముం గాచెడి దేవతానికరముల్ మాతల్లి! దుర్గమ్మ! నే
          నెమ్మెల్ సెప్పుట లేదు వత్సలవునై యేవేళ నీదాసులన్
          నమ్మం బల్కుచు రక్ష సేయదగు సన్మానంబు చూపించుచున్

No comments:

Post a Comment