Sunday 25 March 2018

గాంధీ మహాత్ముడు


గాంధీ మహాత్ముడు
శా.     స్వాతంత్ర్యోద్యమ సారథిన్ గుణనిధిన్ శాంతిప్రియున్  ధీయుతున్
          నేతృత్వోన్నతు స్వార్థదూరుని  ఘనున్ నిష్ఠాగరిష్ఠాత్మునిన్
          చేతం బందున భారతీయగరిమన్ శ్రీమంతమౌ స్వేచ్ఛనున్
          జాతిశ్రేయము నెంచు గాంధి దలతున్ సన్మౌని నిప్పట్టునన్.       1.

శా.      ఏమౌనీంద్రుడు శాంత్యహింస లను దివ్యేషుద్వయం బందుచున్
           ధీమంతుండయి శ్వేతజాతుల పయిన్ తేజంబు వెల్గొందగా
           క్షేమం బెంచి స్వతంత్ర మందుటకునై సన్నద్ధుడై దూకె నా
           శ్రీమన్మోహనదాసగాంధి కిపుడున్ జేతున్ వినమ్రాంజలుల్.       2.

శా.       దేశం బంతయు నాడు నేఘనుని యస్తిత్వంబుచే దార్ఢ్యతన్
            నాశం బందిన ధైర్యసాహసములన్ నైజప్రభావంబులన్
            ధీశక్తిన్ వడి యందగల్గి రతనిన్ దేజోమయున్ ధీరతా
            వైశిష్ట్యప్రదు గాంధి నిందు దలతున్ భవ్యాత్ము నివ్వేళలోన్.      3.

శా.       సర్వస్వంబు స్వతంత్రతా సమరమన్ జన్నమ్మునం బంచుచున్
           గర్వం బించుక లేని రీతి విలసత్ కారుణ్య సంపూర్ణుడై
           సర్వాధిక్యత భారతీయుల కగున్ స్వాతంత్ర్య సందీప్తిచే
           నుర్విన్ రండని బిల్చు గాంధిని మహద్యుక్తున్ బ్రశంసించెదన్.  4.

శా.      శ్రీమన్మోహనదాసగాంధి వినుమా శీతాంశు డర్కాదులున్
           సామీప్యస్థములైన తారలు నభస్స్థానంబునందుండగా
           భూమిన్ నీ శుభనామ ముండగల దో పూజ్యా మహన్మంత్రమై
           క్షేమం బీ భరతావనిన్ నిలుపుటన్ జేజేలు నీ కెల్లెడన్.           5.
                                    హ.వేం.స.నా.మూర్తి.

No comments:

Post a Comment