Sunday 25 March 2018

పెండ్లి చూపులలో ఆధునికత - తెలుగుపై మమకారం


పెండ్లి చూపులలో ఆధునికత
తెలుగుపై మమకారం
కం.
మీ కొమరునితో నించుక
యేకాంతమునందు మాట లిపు డాడవలెన్
నాకిడు డవకాశం బని
ప్రాకటముగ విద్య పలికె బహు చతుర యనన్                   1.
కం.
అచ్చెరు వందియు పెద్దలు
ముచ్చటపడి వల్లె యనగ ముదమంది పయిన్
విచ్చిన ముఖపద్మంబుల
నచ్చోటును వీడి ప్రక్క కరిగిరి వారల్                                       2.
ఉ.
పేదకు కష్టకాలమున పెన్నిధి యందిన రీతి వారికిన్
మోదము గల్గె వంశగత ముఖ్యులు వీరల భావనావళిన్
కాదనకుండ యౌననగ కాగల చర్చకు సంతసించుచున్
మాదిరి ప్రశ్న లెంచుచును మాటున కేగిరి మాటలాడగన్.      3.
కం.
వైవాహిక బంధంబును
భావించుటకంటె ముందు భావము లందున్
గావలె సామ్యము విధిగా
గావున తద్విధము లెరుగ గడగిరి వారల్.                                   4.
సీ.
విద్య యిట్లనె నాకు విస్తృతం బైనట్టి
ప్రేమంబు మనతెల్గు వెలుగులందు,
హర్షితుండును నాకు నట్టులే తెనుగుపై
యమితాదరం బంచు నాడె తాను
దేశభాషలలోన తెలుగు లెస్స యటన్న
సూక్తి సత్యంబనెన్ జూడ విద్య
అమృతధారలు సత్య మాంధ్ర సాహిత్యోక్తు
లంచు తానాడె నా హర్షితుండు
తే.గీ.
మనము లందలి భావంబు లనుపమముగ
నీకు నాకును నొకటయ్యె నిజముగాను
మనము గూడిన సుఖదమౌ ననుదినంబు.
జీవనం బనిరా చిరంజీవు లపుడు.                                   5.
సీ.
మనమానసము లిట్లు ఘనతరం బైనట్టి
భావైక్యతను బొంది పరిఢవిల్ల
నాదిదంపతు లట్టు లనురాగ భాగ్యంబు
నంది సంతోషంబు లందవచ్చు
నొకరికి నొకరౌచు నొకరిలో నొకరౌచు
నిరత సౌఖ్యంబుల నరయవచ్చు
మన మాతృభాషలో మహిత దీప్తిని జిందు
బహుకావ్యఫలములన్ బడయవచ్చు
తే.గీ.
ననుచు నొండొరు లత్యంత హర్ష మొదవ
విద్యయును హర్షితుండును విమల భావ
యుక్తు లౌచును పరిణయాసక్తు లౌచు
చేరి నిల్చిరి వృద్ధుల చెంత నచట.                                  6.


No comments:

Post a Comment