Sunday 25 March 2018

మాదక ద్రవ్యాల మత్తులో యువత – నాశన మౌతున్న భవిత


మాదక ద్రవ్యాల మత్తులో యువత నాశన మౌతున్న భవిత

మ.     యువకుల్  నే డవివేకు లౌచు సతతం బున్మాదపూర్ణాత్ములై
స్తవనీయంబును, దుర్లభం బయి భువిన్ ధన్యత్వముం గూర్చు నీ
భవమున్ వ్యర్థ మొనర్చుచుండిరి గదా పాడైన ద్రవ్యంబులన్
జవసత్త్వంబులు గోలుపోవు పగిదిన్ సర్వత్ర సేవించుచున్.                         ౧.

శా.     మత్తెక్కించెడి ద్రవ్యరాశిని కటా! మన్నించి సంఘంబునన్
చిత్తై పోవుచునుండి రీ యువజనుల్ క్షేమంబు, సౌఖ్యంబులున్
విత్తంబున్, బహుమాన, మెల్లగతులన్ విజ్ఞత్వ, మారోగ్యముల్
మొత్తంబున్ నశియించ నేమి కతమో మోదంబు క్షీణించగన్.                        ౨.

మ.     క్షణికానందమె జూచుచున్ వికలురై  కైపున్ సదా గోరి తా
మణుమాత్రంబును భావి నెంచక విధీ! యామాదకద్రవ్యముల్
గణుతింపం దగు సేవ్యవస్తువులుగా  గైకొంచు జీవంబునన్
వణకున్ బొందెడివారి కీ యువత కెవ్వా రౌదురో రక్షకుల్!                          ౩.

సీ.      మాదక ద్రవ్యాల మత్తులో యువజనుల్
మునుగు చుండిరి జూడ ననుపమముగ
నాశనం బగుచుండె నవ్యమై వెలుగొంద
వలసి యున్నట్టి సద్వైభవంబు
దేశాభివృద్ధికై  లేశమంతయు కాంక్ష
చేయకుండగ భావి జీవనమున
తారస పడనున్న నీరసత్వం బన్న 
భయమింత దాల్చక  బహుళగతుల
ఆ.వె.  సంచరించు చుండి సవ్య మార్గంబుల
నెంచ కుండు వారి నెల్లగతుల
సాకి మనసు మార్చి సత్వంబు చేకూర్చి
యాదు కొనుట ముఖ్య మవని లోన.                                                       ౪.


కం.    మాదకము చెనటి ద్రవ్యము
మోదంబును గూల్చు, ద్రుంచు మునుపటి శక్తిన్
లేదిల దీనికి తుల్యము
రోదనమే మిగులు నంది రుచి చూచినచోన్.                                              ౫.

No comments:

Post a Comment