Sunday 25 March 2018

శ్రీ శివ


శ్రీ శివాయ నమః
శా.
శ్రీకంఠా! గిరిజాపతీ! శుభకరా! చిద్రూప! సర్వాత్మకా!
హేకారుణ్యపయోనిధీ! నుతగుణా! హేసాధుసంరక్షకా!
హేకల్యాణగుణాకరా! సురనుతా! హేచంద్రమౌళీ! భవా!
నీకర్పించెద బిల్వపత్రతతులన్ నిత్యంబు విశ్వేశ్వరా!                            1.
శా.
నీకై తెచ్చితి నిమ్నగాజలములన్ నిష్ఠాయుతిన్ ధూర్జటీ!
లోకాధీశ! మహోగ్రదుఃఖహర! నాలోనున్న దుర్భావమున్
మూకల్గట్టిన దుర్గుణావళుల నున్మూలించి రక్షించుచున్
నాకందించుము సన్మతిన్ భవహరా! నాదస్వరూపా! హరా!                     2.
శా.
సర్వేశా! సకలానాశక! శివా! సర్వార్థదా! శంకరా!
నిర్వాణప్రద! నిత్యహర్షద! మృడా! నిర్వేదసంధాయకా!
సర్వైశ్వర్యవిభూషితా! స్మరరిపూ! సత్యస్థితా! శాశ్వతా
శర్వా! నీపదసేవ చేయు సుమహత్ సామర్ధ్య మందించుమా.                    3.
శా.
నిన్నుం దల్చుచు, నీకటాక్షమునకై  నిత్యంబు నిన్జేరుచున్
మన్నింపందగు స్తోత్రపాఠములతో మమ్మేలుమా యంచు నీ
కన్నింటన్ బరమేశ్వరత్వమిడి నిన్నర్చించు దీనాత్ములన్
మున్నా మౌనికుమారు బ్రోచు పగిదిన్ మోక్షప్రదా! కావవే.                      4.
శా.
భక్తిం జేసెడి పూజలోన నభవా! వైదుష్యసంపూర్ణ
ద్యుక్తిం గాంచకుమయ్య! పామరుడ నో రుద్రా! భవత్సేవ కా
సక్తిం జూపెడి చిత్తమిచ్చితివి సత్సాహిత్య మంత్రాదులున్
వ్యక్తి ప్రాపక భాషణం బెరుగ నో భర్గా! కృపం జూడుమా.                         ౫.

2 comments: