Sunday 25 March 2018

ధనుంజయీయం


ధనుంజయీయం

చం.             
కడుకొని యంతరిక్షమున గర్వితుడై పయనించు వ్యక్తి యే
యెడలను కష్టమించుకయు నెంచని వా డొకనాడు ఖిన్నుడై
యడలుచు క్షుత్తుచే పడిన యాకు భుజించెడి వాని రీతి దా
వడలి ధనుంజయుండు పొగబండిని జేరెను దప్పకుండుటన్.         1.

తే.గీ.            
కాలు పెట్టంగ సందులే దేలనైన
లోని కేగుద మన నది కానిపించె
భారతాహవ మందలి వార లపుడు
యుక్తితో పన్ను పద్మంపు వ్యూహ మట్లు.                                            2.

సీ.               
కష్టమైనను నోర్చి యిష్టంబు లేకున్న
నెట్టులో లోపలి కేగినంత
నాధూమ శకటాన నా పెట్టెలో జూడ
నిటునటు మసలంగ నించు కైన
నవకాశ మేలేక యచటి దుర్గంధాల
కావంత తాళలే కప్పు డతడు
తోపులాటల లోన తోరంపు శక్తితో
చోటు సాధించె నచ్చోట సుంత
ఆ.వె.  
గాలి యాడ కుండె మేలైన ఖాద్యముల్
రాకపోయె తినుట కాకలి గొని
తలచు చుండె నిట్లు తనయవస్థకు దాను
హర్ష శూన్యుడై హతాశు డగుచు.                                                        3.

కం.    
యమభటులు లేని నరకము
క్రమముగ నీ పెట్టె లోన ప్రత్యక్ష మిటన్
తమమే నిండిన డంతట
నమరదు సౌఖ్యంబు నూపి రాడదు చూడన్.                                         4.

మ.    
అని చింతించెడి వేళ బండి కదలన్ హాయిన్ ప్రసాదించు నా
యనిలం బించుక వీచె నాపయిని తామందున్న వారీతనిన్
మనవా డన్న విధాన ప్రేమయుతులై మాట్లాడు చుండంగ ఛీ
యనుకొన్నట్టి స్థలంబె తోచె దివమై హర్షప్రదంబై యటన్.                         5.

No comments:

Post a Comment