Tuesday 10 April 2018

మిత్రమా

మిత్రమా

ఉ.
శ్రీలు లభించు మార్గములు చెప్పుచునుందువు మోదకారివై
మేలొనరించు పద్ధతులు మిక్కిలి కూర్మిని నేర్పుచుందు వా
శాలత చేయు దౌష్ట్యమును చక్కగ తెల్లము చేయుచుందు వే
కాలము సౌఖ్య మందదగు కర్మలు చూపెదవోయి మిత్రమా!             1.
ఉ.
ధీరత గోలుపోయి పరిదేవన మందెడివేళ చెంతకున్
చేరి సుధామయోక్తులు వచింతువు నిర్మలభావదీప్తితో
తారకమంత్రముం దెలిపి ధైర్యము నింపుచు జీవనంబునన్
కోరిక కల్గజేసెద వకుంఠిత దీక్షను బూని మిత్రమా!                          2.
ఉ.
యుక్త మయుక్తముల్ గరపి యున్నతధార్మికయోగ్యభావనా
సక్తిని నంతరంగమున సన్నుతరీతిని నింపుచుండి ధీ
శక్తిని వృద్ధిచేసి యరుసంబును బంచుచు బూజ్యులందు స
ద్భక్తిని నేర్పుచుండెదవు భాగ్యవిధాతవు నీవు మిత్రమా!               3.
ఉ.
మానవసేవయే భువిని మాధవసేవ యటంచు బల్కి నా
మానసమందు నిండిన యమానుషశక్తిని, స్వార్థభావమున్
ధీనిధివై సమూలముగ ద్రెంచుటకై నను జేరి సర్వదా
జ్ఞానము పంచుచుండెదవు సద్గుణరాశివి నీవు మిత్రమా!           4.
ఉ.
తల్లివి తండ్రి వీవగుచు ధైర్యము బంచుచు సోదరుండవై
చల్లని దృక్ప్రసారముల సద్ధిత మెంచుచు బాంధవుండవై
యెల్ల జయంబు లందగల యిచ్ఛయు సత్త్వము నందజేతు వో
సల్లలితాంతరంగ! సుయశంబును గూర్చెదవోయి మిత్రమా!          5.
ఉ.
దైవము వోలె చేరెదవు దైన్య మణంచ స్మరించినంత నా
సేవల కాశచెంది గుణశీలములన్ నుతియించు మంచు న
న్నేవిధి గోరబోవు మది కింపగునట్లుగ బల్కరించుచున్
దావకసభ్యతన్ బహువిధంబుల చాటెదవోయి మిత్రమా!         6.
ఉ.
నేను చరించు మార్గమును నిత్యము గాంచుచు గాడి దప్పినన్
ధ్యానముతోడ సత్వరము తద్గతహానిని దెల్పుచుండి క
న్గానక సంచరింతు వని కానగురీతిని మందలించి స
న్మానము గూర్చ బూనెదవు నాకు నిరంతర మోయి మిత్రమా!         7.
ఉ.
నావిషయంబులన్ పరజనంబులు యత్నము చేసియైన సం
భావన చేయనేరనటు వత్సలతన్ గొని దాచిపెట్టి నా
జీవన లక్ష్యసాధనకు చేసెద వెంతటి సాయమైన నో
ధీవిభవాన్వితా! సఖ! విధేయుడ వాప్తులయందు మిత్రమా!          8.
ఉ.
ఈజగమందు నెల్లెడల నిట్టి మహత్త్వము కల్గినట్టివా
డేజనుడున్ గనంబడ డహీనగుణంబులవాడు కాగడా
తోజని చూచినన్ నిజము దుఃఖితజీవనమందు  నేస్తమన్
వ్యాజము జూపి యీశ్వరుడు హర్షము నింపుచునుండు మిత్రమా!           9.
ఉ.
నీవొనరించు సత్కృతికి నిర్మలమైన త్వదీయభావనా
 శ్రీ విభవైకసంజనిత సేవకు ప్రత్యుపకారకర్మకై
భావననైన చేయగలవాడను గానతిమందుడన్ సదా
పావనమూర్తి! నీకిడుదు వందనమందగదోయి మిత్రమా!                       10.
హ.వేం.స.నా.మూర్తి.
06.04.2018.

No comments:

Post a Comment