Monday 15 March 2021

శ్రీ నరసింహ

 

శ్రీ నరసింహ

మ.

నరసింహా! కరుణామయా!కలుషహా! నానామహోగ్రారిసం

హరణా! వ్యాధివినాశనా! సురనుతా! హర్షప్రదా! క్షేమదా!

ధరపై నేడు స్వకీయదౌష్ట్యమును భూతంబౌచు చూపించుచున్

నరులన్ గూల్చు "కరోన"నున్ దునుమ నిన్బ్రార్థింతు భక్తావనా!

ఆ.వె.

భక్తవరద! నతులు పాలించవలె మమ్ము

నసురు గూల్చి నాడు హర్షమొసగి

భయవిహీను జేసి  ప్రహ్లాదు బ్రోచిన

ట్లిట గరోన ద్రుంచి యీక్షణాన.


శ్రీనరసింహ
కందములు.
శ్రీమంత! భక్తరక్షక!
స్వామీ! యవతారమూర్తి! స్తంభోద్భూతా!
ప్రేమస్వాంతా! సురవర!
క్షేమద!చేకొనుము నతులు శ్రీనరసింహా! 1.
దనుజున్ ద్రుంచగ భక్తుని
ననఘాత్ముని గావ జేరి యఖిలజగంబుల్
గన హర్షము సత్కార్యం
బొనరించిన నిన్ను గొల్తు నో నరసింహా! 2.
కరుణారూపుడ వీవని
నరులును సురకోటి మునులు నవవిధభక్తుల్
పరమానందము నందుచు
స్థిరమతి జూపుదురు నతులు శ్రీనరసింహా! 3.
సేవకుని గావ నేవిధి
కావరమున నున్న ఖలుని క్షణకాలమునన్
చేవయణంగగ జీల్చితి
వావిధి రుగ్మతలనణచుమయ నరసింహా! 4.

వందనము దైత్యనాశా!
వందనమో యుగ్రతేజ! వందనమీశా
సుందరభావావేశా!
వందనములు నీకు నమరవర నరసింహా!. 5.

No comments:

Post a Comment