Monday 15 March 2021

కరోనా

 

కరోనా 

ఉ.

శ్రీలును, శౌర్యధైర్యములు, సీమలు దాటిన జ్ఞాన సంపదల్,

నేలకు నింగికిన్ విధము నేర్పెడి సత్పరిశోధనావళుల్,

కాలగతిన్ సుఖంబులకు గానగు రీతిని మార్చు శక్తి  నీ

లీలకు విస్తుపోయినవిలే యిలలోన గరోన! చూడగన్.                               1.

ఉ.

భూతమవో? సమాజమును బొట్టన బెట్టుకొనంగ నిత్తరిన్

భూతలమందు జేరితివొ? పూర్ణతరంబుగ మానవాళికిన్

భీతిని గొల్పు రక్కసివొ?  వేరొక కర్కశదుష్టశక్తివో?

జాతికి నో"కరోన"!యిట సత్వ మణంగెను నీవు వచ్చుటన్.                         2.

శా.

గేహంబందున జేరియుంటి మిచటన్ గీడ్పాటు శంకించుచున్

దేహస్థాంగములన్ గరాగ్రములతో దెల్పంగ యత్నించుటన్

మోహం బింతయు జూపకుంటిమి గదా మోదంబు క్షీణించె నే

డాహా! యెంత ప్రమాద మేర్పడెను నీ వాడన్ "గరోనా!"యిటన్.                  3.

చం.

సుతులను దాకలేక, చెలి సోయగముల్  స్పృశియించలేక యీ

క్షితిపయి నున్న మానవులు చెంతను జేరక దూర ముండుచున్

వెతలను గాంచుచుండిరి నవీన యుగమ్మున నున్న దక్షతల్

చతురత లేనివయ్యె నిను జంప "గరోన" నిజమ్ము నేడిటన్.                         4.

మ.

అయినన్ నీదు భవంబుచే నిలపయిన్ హాస్యమ్ము కాదోయి! స

జ్జయముం గోరెడి మానవాళి యెదలన్ సంస్కారముల్  నిండె నీ

పయినన్ యుద్ధము జేయ నింటికడనే భవ్యంబులౌ చర్యలన్

నయమంచున్ గ్రహియించుచుంటిమి"కరోనా!"నిన్ను బోకార్చగన్.           5.

No comments:

Post a Comment