Monday 15 March 2021

 

రైతు

ఉ.

శ్రీకరమైన భావమున క్షేత్రమునందు దదేకదీక్షనున్

జేకొని విశ్వదీప్తికయి చిన్మయుడౌచు నిరంతరమ్ముగా

జీకటి వెల్తురంచు మది జేయక యోచన సస్యవృద్ధికై

యాకలి దప్పులం చనక యందె వసించును హాలికుం డిలన్                 1.

ఉ.

అతుల దయామయుం డగుచు నందరి కార్తిని బాప బూనుచున్

సతతము కష్ట సంమును సంతస మందుచు స్వీకరించు, నీ

క్షితిపయి స్వీయసౌఖ్యమును, గీర్తిని గోరని యన్నదాత స

న్మతి యితడంచు చెప్పెదను మాన్యశుభాశయునిన్ కృషీవలున్            2.

శా.

నాయిల్లాలును నాకుటుంబ మనుచున్ నానాప్రకారంబుగా

చేయం బోవడు స్వార్థభావనము, మస్తిష్కంబునం దంతటన్

ధ్యేయం బౌగతి దాల్చు లోకమునకున్  దివ్యానురాగమ్ముతో

సాయం బందగ జేయుచుండుట మహచ్ఛక్తిన్ బ్రదర్శించుచున్            3.

చం.

జగతిని గాచు హాలికుని సర్వవిధంబుల సాకుచుండి, యా

యగణిత సద్గుణాఢ్యునకు నందగ జేయుచు సాయ మెల్లెడన్

దగువిధి మోదముం నిలుప ధన్యత చేకురు గాన పాలకుల్

ఖగపతివాహతుల్యుడగు కర్షకు నన్నిట గావగా వలెన్                           4.

ఉ.

ఆగ్రహమే యెరుంగని మహాత్ముడు హాలికు డాగ్రహించినన్,

నిగ్రహమున్ ద్యజించినను నిస్తులఘోర విపత్పరంపరల్

ప్రగ్రహ హీనమై యురుకు వారువ మట్లిట విస్తరించు న

త్యుగ్రమునైన క్షుత్తునకు నుర్విసమస్తము జిక్కు నెంచినన్.                  5.

No comments:

Post a Comment