Monday 15 March 2021

చలి

 

చలి

చం.

చలి పులియంచుఁ బల్కెదరు సర్వహితంకర భవ్యభావనా

కలిత మహత్వదీక్షగొని కాలగతిన్ వసుధాస్థలంబునం

దలఘుతరప్రభావమున హర్షముఁ బంచగ నేగుదెంచుచుం

గలుగగఁ జేయు సత్వమునుఁ గార్యములందున నొప్పుమీరగన్.                  1.

మ.

కలుగం జేయును వస్త్రధారణముపై కాంక్షన్, నరవ్రాతమున్

మెలగం జేయును సూర్యరశ్మి గొనుటల్ మేలన్న భావంబునన్,

దొలగం జేయును చిత్తసీమలపయిన్ దోరంపుటున్మాదముల్,

నిలువం జేయును శీత మెల్లగతులన్ నిత్యానురాగ మ్మిలన్.                         2.

ఉ.

పిల్లలనైన, సంమునఁ బెద్దలనైనను, విత్తదీప్తితో

నెల్లవిధాల సత్వమున కేమె మహాత్ముల మంచు భీతిసం

ధిల్లగ జేయువారలను, దీనజనాలనుఁ జిత్తమందునన్

జిల్లనఁ జేయుచున్ వణక జేయును శీతము సర్వరీతులన్.                           3.

చం.

వలువలఁ బెట్టెలందునను వాడక యుంచినవాని నన్నిటిన్

నిలువగఁ బూని దార్ఢ్యతను నింపగ దేహమునందు మానవుల్  

చలిఁ గని తీసి కాయమున సత్కృతులన్ సమకూర్చి  వాని కీ

యిలపయి ధన్యతన్ గరప నిచ్ఛనుఁ జూపెద రెల్ల రీతులన్.                         4.

ఉ.

కాముని బాణదీప్తి కిది కానగు కాలము సర్వజీవముల్

భూమినిఁ బ్రేమపూర్ణులయి ఫుల్లమనంబులతోడ జీవిత

స్వామికిఁ బ్రాణతుల్యయగు స్వామినికిన్ ముదమందజేయు యో

గ్యామిత శక్తిఁ బంచెడి మహత్సమయం బిది శీత మన్నచో                          5.

No comments:

Post a Comment