Monday 15 March 2021

దోసిలి

 

దోసిలి

చం.

వినయముతోడ "దోసిలిని" విజ్ఞత జూపుచు బట్టుచుండి యే

మనుజుడు జ్ఞానదీప్తికయి మాన్యగురూత్తమకోటి ముందు దా

ననయము జేరియుండగల డాతని కీధరపైన నిచ్చలున్

నమగు సద్యశంబమరు, గాంక్షలు దీరును విద్యగూడగన్.                 1.

చం.

గురువరులందు, జ్యేష్ఠులను గోరిక దీరగ "దోయిలించుచున్"

నిరతము భక్తిభావమున నిష్ఠను జూపుచు నమ్రతాస్థితిన్

వరగుణులై జరించినను భాగ్యము లబ్బును, నిత్యసౌఖ్యముల్

ధరపయి గూర్చు "దోసిలియె" తథ్యము సందియమేల నమ్మగన్.                2.

మ.

భగవంతున్ గని భక్తుడన్ నిలుపుమా భవ్యంబులౌ సంపదల్,

జగతిన్ నిత్యసుఖంబు, లెల్లగతులన్ సర్వాగ్రగత్వంబు నా

వగలం గూల్చు మటంచు "దోసిలి"నటన్ బట్టంగ సత్కాంక్షలన్

దగు మార్గంబున దీర్చు "దోయిలియె" బాధల్ ద్రుంచు లోకమ్మునన్. 3.

ఉ.

"దోసిలి"పట్టుచుండుటయె దుఃఖనివారక మార్గ మన్నిటన్,

భాసురచిత్తవైభవశుభప్రదజీవనయానసూత్రమై

గాసిని బెట్టు రుగ్మతల ఖండన జేసెడి యౌషధంబుగా

భాసిలు గాన "దోయిలి"యవారిత మేయెడ మానవాళికిన్.                   4.

శా.

ఆపద్బాంధవతుల్య మౌచు మదికిన్ హర్షంబు చేకూర్చుచున్

దీపిల్లందగు జీవనంబు ప్రజకున్ ధీరత్వసంప్రాప్తి దా

జూపన్నేర్చిన "దోసిలిన్" వరముగా శోధించి విజ్ఞాళి తా

రా పాండిత్యధురీణు లీజగతిలో నందించి రార్యుల్ నుల్.                         5.

No comments:

Post a Comment