Monday 15 March 2021

నస్యము

 

నస్యము

మ.

భువి "నస్యం" బనుపేర బండితులకున్ బూర్ణానురాగమ్ముతో

స్తవనీయప్రతిభావిశేషవిలసత్సౌభాగ్యముం గూర్చగా

దివిజానీక నమస్కృతుండు విధి సందేహంబు లేదిందు దా

భవముం గూర్చె నటంచు బల్కెదరు దివ్యత్వంబు చేకూర్చుచున్.                      1.

చం.

చిటికెడు చూర్ణముం గొనుచు జేర్చుచు నాసికయందు బీల్చగన్

బటుతరమైన శ్లేష్మ మనివార్యవిధంబున సత్వరంబుగా

నిటులని చెప్పగా వశమె యెంతయు వేగము తోడ భూమికిన్

దటపటలాడకుండ బడు తథ్యము "నస్యము" నెంచ శక్యమే?                          2.

శా.

"నాసామండనచూర్ణ" మందురు బుధుల్ నానాప్రకారమ్ముగా

ధ్యాసన్ నిల్పెడి బల్మి తా నొసగుచున్ యత్నంబునన్ స్థైర్యమున్

వాసిం గాంచగలట్టి ధైర్య మిడి సర్వత్రాతిధీశక్తియున్

భాసిల్లంగను జేయు "నస్య" మని సంభావింతు రిద్దానినిన్.                            3.

మ.

చిరుడబ్బా నొకదాని జేకొనుచు నక్షీణాతివైదుష్య స

త్వరసద్య స్స్ఫురణప్రభావదముగా భావించి "నస్యమ్ము" నీ

ధరయం దెందరొ భూషణంబు పగిదిన్ దామంది యున్నార లీ

వరచూర్ణంబున కొండు తూగదనుచున్ భావింతు రవ్వా రిటన్.                       4.

మ.

ఇది "పొవ్వాకు"కు జూర్ణరూప మయి తా నెన్నేని కష్టమ్ములన్

ముద మందంగ గ్రహించ గూర్చు, సుఖముల్ పోకార్చు, వ్యాధిస్థితిన్

బొదలం జేయును గాన "నస్యము" గొనన్ బోరాదు క్షేమంబు తా

మెదలో గోరిన మానవాళి యను నిం దీనాటి విజ్ఞానముల్.                            5.

No comments:

Post a Comment