Thursday 11 March 2021

ఓం నమశ్శివాయ

 ఓం నమశ్శివాయ

(కందములు)

 *ఓం* .

ఓంకారాత్మకు డగుచును 

సంకటముల నణచివేసి సర్వవిధాలన్

గింకరులను రక్షించెడి 

శంకరునకు వందనములు సర్వేశునకున్. 1.

 *న* .

నమ్మినవారికి క్షేమం 

బిమ్మహిని నిరంతరముగ నింపగురీతిన్

గొమ్మని యొసగెడి యా భూ

తమ్ముల పతికొసగుచుంటి దండములవిరుల్.  2. 

 *మ* .

మనుజుడు జలములు నాకులు 

కొనుమని యొసగంగ మిగుల కూర్మిని వానిన్

ఘనములని స్వీకరించుచు 

ననుపమ  సంపదలొసంగు నభవునకు నతుల్.  3.

 *శి* 

శిరమున గంగను దాల్చితి

వరయగ దేహార్థమందు నంబను గళమం

దురుతరభీతావహమగు

గరళంబును నిల్పు రుద్ర! కైమోడ్పు లయా!  4.

 *వా* 

వాదేల నిన్ను మించిన

మోదప్రదు లొక్కరైన మును నిపుడైనన్

మేదినిపయి గనరా రిట

నీదయ చూపించుమయ్య నీకివె ప్రణతుల్. 5.

 *య* 

యజనముల గతుల నెరుగను

నిజమిది పూజాదికములు, నిష్ఠల విధముల్

స్వజనోద్ధారక! నేర్వను  

త్రిజగత్పతి! కావుమయ్య దేవా! మ్రొక్కుల్. 6.


హ.వేం.స.నా.మూర్తి.

11.03.2021.

No comments:

Post a Comment