Monday 15 March 2021

కాకరకాయకూర

 

నా వంటకం "కాకరకాయ కూర"

(ప్రజ-పద్యం వారి ప్రోత్సాహంతో) 

కాకరకాయకూర

 

కం.

శ్రీకంఠున కభిషేకము

లీ కార్తికమందు జేసి యిక నిచ్చోటన్

జేకొన వనభోజన మిపు

డాకట నే జేరినాడ నందరి మధ్యన్.                                                           1.

ఉ.

"కాకరకాయ"కూర యిది కమ్మగ వండి కవీంద్రకోటికిన్

జేకొన జేయ దెచ్చితిని, స్వీకరణంబున జాగదేల? యీ

శాకములోని పాకమును జక్కగ దెల్పెద నాలకించి మీ

రో కవివర్యులార! యిట నొప్పుగ నెంచరె యారగించగన్.                           2.

ఉ.

ఆపణమందునున్న బహుళాయత యోగ్యసుశాకరాశిపై

చూపును నిల్పి యేరితిని సుందరమైనవి, తెల్లకాయలై

దీపిలువాని, యోగ్యముల దెచ్చితి శుభ్రము చేసి నీటితో

నాపయి వండ బూనితిని యచ్చపు శ్రద్ధను బూని యింటిలోన్.                    3.

ఉ.

శ్రీమతి యూరి కేగుటను జేరితి నేనిక వంటయింటిలో

క్షేమము గూర్చి స్వాస్థ్యమును జేకుర జేసెడి "కారవేల్లమున్"

ధీమతులార! వండుటకు జేతను బట్టితి, కత్తిపీటతో

కామిత హర్షదాయినిని ఖండన చేసితి గుండ్రమౌ గతిన్.                     4.

ఉ.

ప్పున బిండి యందు రస మొల్లక తీయుచు వేరు చేసి నే

ప్పుడు నూనె వేసి మనమంతయు నువ్విళులూరుచుండగా

ప్పున బూర్లెమూకుటను జక్కగ వేగగ జేసి దానిపై

నొప్పెడిరీతి కారమును నుంచితి కొంచెము రుచ్యమౌగతిన్.                        5. 

ఉ.

నిమ్మరసంబు నాపయిని నిస్తులమై చవులూరునట్లుగా

కమ్మదనంపు సౌరులును గల్గగజేయ దలంచి యందులో

జిమ్మితి జేకొనుండు మది జేయక మీరిక నన్యభావనల్  

రమ్మని జీరుచుంటి మిము రమ్యగుణాఢ్యుల నాప్తమిత్రులన్.            6.

ఉ.

ప్రాకటమైన కార్తికము పావనతం గొనుచుండు"కా"దిచే 

"కాకర""కారవేల్లము"లు "కా"దిని గల్గిన యట్టి శబ్దముల్

"కాకర"కీవిధిన్ బహుముఖంబగు యోగ్యత యిందు నందుటన్

మీకిట దీని శాకమును మేలని బంచగ దెచ్చినా నిటుల్                                 7.

తే.గీ.

"బాదరాయణ సంబంధ" ఫణితి యిందు 

గానవచ్చును "కాకర"కార్తికముల"

"కాది"నందుట నందుచే "కాకర"నిట

తెచ్చినాడను మీరలు మెచ్చునటుల.                                                       8.

ఉ.

కూర యొకండె చేసెనని కోపము చూపక యందగా దగున్

మీరలు శుద్ధమానసులు మిక్కుటమౌగతి నెన్నియో యిటన్

కోరిక దీర్చు శాకములు, కూరిమి నింపెడి పిండివంటలున్

తీరగు భోజ్యవస్తువులు దెచ్చిరి యీవన భోజనంబునన్                             9.  

కం.

నమగు నంతర్జాలపు

వనమందున నిట్లు కవనవనభోజనమున్

దనియంగ జేయు కవితా

ధనవంతులు మీర లివియె దండంబు లిటన్.                                              10.

No comments:

Post a Comment