Wednesday 1 March 2017

కవిబ్రహ్మ తిక్కన

కవిబ్రహ్మ తిక్కన
ఉ.     చక్కని శైలితో బహురసంబుల మేలగు మేళవింపుతో
చిక్కని నాటకీయతను చేర్చి మహాద్భుతమైన రీతిలో
మక్కువతోడ భారతము మైమరపించెడు నట్లు వ్రాయు నా
తిక్కన సోమయాజి కవిదిగ్గజమున్ స్మరియింతు నెప్పుడున్.

ఉ.     నన్నయ స్వీకరించి కరుణామయు జేరుట చేత నాదిలో
నున్నటువంటి దాని సకలోర్వికి ధర్మము బంచు దానినిన్
మన్నికతోడ జేకొని సమర్పితభావము నిండ బ్రహ్మగా
నున్నతి గాంచి భారతము నొప్పుగ వ్రాసె నిరంతరంబుగన్.

చం.  హరిహరనాథునిం దలచి హర్షముతో పులకించి మ్రొక్కి త
త్కరుణను బొంది దేశమున ఖండితమైన సమైక్యభావమున్
స్థిరముగ నిల్పి సత్కృతికి శ్రీయని బల్కె వినిర్మలాత్ము డా
వరగుణుడైవెలుంగు కవివర్యుడు తిక్కన సోమయాజియై.

చం.  అతడు విరాటపర్వమును నాదిగ నెంపిక చేసి దక్షతన్
చతురవచ:ప్రపూర్ణుడయి చక్కని శైలికి నాటకీయతన్
నుతగుణు లెల్ల మెచ్చువిధి నూతనమై వెలుగొందు నట్లుగా
నతులిత వాక్పటుత్వమున నద్భుతరీతి రచించె సర్వమున్.

మ.   ఉభయానందము గూర్చు నట్లు సుకవిత్వోద్యాన మందంతటన్
విభవంబుల్ గలిగించు దైవతముగా విఖ్యాతితో నొప్పు నా
శుభదాతన్ శివకేశవాత్ము నిలిపెన్ శోభాయమానంబుగా
సభలో ద్వైతము గూల్చునట్టి పగిదిన్ సద్భావసంపూర్ణుడై.

మ.   వచనం బింతయు వాడకుండ నపుడున్ పద్యాత్మకంబౌవిధిన్
వచియించెంగద రామసత్కథను సర్వాభీష్టదంబై మహిన్
ప్రచురం బందెడు నట్టు లద్భుతముగా బ్రహ్మాఖ్యనుంగాంచు త
ద్రచనాకారుని తిక్కయజ్వను మదిన్ ప్రార్థింతు నెల్లప్పుడున్.
        
శా.    నెల్లూర్సీమకు పాలకుండు నుడున్ నిత్యప్రసన్నుండు, మే
నెల్లన్ శౌర్యము నిండినట్టి సదయుం డెంతేని ప్రేమంబు భా
సిల్లం జేరుచు మామయంచు బిలువన్ శ్రీ మన్మసిద్ధి ప్రభున్
సల్లాపంబుల నిల్పి తిక్కనకవీ! సత్కావ్య మర్పింపవే. 

శా.    సందేహింపగనేల మ్రొక్కవలయున్ సద్వాక్యసంపూర్ణునిన్
వందేహం కవిశేఖరం నుతగుణం భవ్యార్థదమ్మంచు నా
నందం బందుచు తిక్కనాయుని సతం బత్యాదరోపేతులై

యందం బైన కవిత్వసృష్టి కొరకై యాంధ్రంబునం దెప్పుడున్. 

No comments:

Post a Comment