Sunday 19 March 2017

రిక్షా బాలిక


రిక్షా బాలిక
శా.     ఏ జన్మంబున జేయు పాపమొ గదా! యీబాల యీతీరుగా
నీజన్మంబున బేదయై బ్రతుకుకై  యేమార్గముం గానమిన్
రోజీరీతిగ బండి లాగును భువిన్ రూపంబు క్షీణించు న
ట్లాజీవం బిటులే తపించ వలెనా? హర్షంబు చేకూరదా?             ౧.

సీ.      తనయీడు వారంద రనునిత్యమును విద్య
లందంగ బడికేగు చందము గను,
తల్లిదండ్రులు వారి కెల్లసౌకర్యంబు
లొనగూర్చు చుండ దా గనుచు నుండు,
చీకుచింతలు లేక యేకాలమును వారు
తిరుగుచుండుట నెప్పు డరయు చుండు,
కౌటుంబికములైన లోటుపాట్లన్నింట
దూరమై హర్షించు తీరు గాంచు
ఆ.వె. తనకు శాపమైన నతర దారిద్ర్య
మెట్టు లొదవె ననెడి గుట్టు తెలియ
కనుదినంబు తాను పనులిట్లు చేయుచు
వికల యౌచు తిరుగు నకట బాల.                                                  ౨.

సీ.      మదిలోన నున్నట్టి చదువు నేర్చుటయన్న
కోరిక సఫలమౌ తీరు లేక,
పెద్ద లందరి జేరి ముద్దు లందుట కోస
మిరవైన మార్గంబు నెరుగ లేక
తోటి వారలలోన మేటియై క్రీడించు
సమయ మొక్కింతైన  నమర కునికి
సమసమాజము నందు తమ కెవ్వరుంగాని
సాయ మించుకయైన చేయ కునికి,
తే.గీ.   బాల బ్రతుకగ బండిని బేల యగుచు
లాగు చుండిన దాకలి కాగలేక
ఆదుకొనియెడి దైవంబు లే దటంచు
మిగుల పేదరికంబున వగచుచుండి.                                               ౩.

కం.    ధరణిని జననం బందున
మరణించెడి వేళనైన మనుజులకు ధనం
బరయగ నంటదు కాదా
నిరుపేదలు ధనికు లేల? నిఖిల జగానన్.                                          ౪.

చం.    అబలను గాను నేననుచు నందరికిన్ విశదంబు చేయుచున్
సబలను గాంచు డీరలని చాటెడు రీతిగ విశ్వ మంతటన్
బ్రబలిన న్యూనతన్ దునిమి బండిని ద్రొక్కు సమర్థురాలుగా
సొబగులు చూపు నాయమకు చూడ నసాధ్యము లేదు పృథ్విలో.     ౫.

కం.    నీతో పోటీ పడగల
నీ తీరును జూడు మనుచు నింపలరంగా
చేతంబు దెలుపు రీతిగ
నాతని వెనుదిరిగి చూచు నాయమ కనగాన్.                                    ౬.

కం.    ఘోరం బగు దారిద్ర్యము
చేరిన యడలంగ వలదు శ్రీప్రద మనుచున్
ధీరత్వము గోల్పోవక
ధారుణి గష్టించ దీరు తథ్యము కాంక్షల్.                                         ౭.

ఆ.వె. అబల లైన నేమి యానందచిత్తులై
శ్రమకు జంక కుండ సడలకుండ
పేదవార మనుచు మోదంబు గోల్పోక
నిలుతురేని భువిని కలుగు సిరులు.                                                 ౮. 




No comments:

Post a Comment