Friday 10 March 2017

మామిడి

మామిడి

ఉ.      పచ్చని రూపుతోడ రసవంతములైన ఫలంబు లుర్విలో
నిచ్చెడి కాంక్షతో కనుల కింపగు  పుష్పసమూహ మందరున్
మెచ్చెడి రీతి దాల్చితివి మించిన త్యాగము జూపు నీకు నే
మిచ్చిన యుక్తమౌను నతులియ్యవి యందుము నీవు మామిడీ!                  ౧.

ఉ.      దాతల కెల్ల దాతవయి ధాత్రిని బంచెద వన్నిచోటులన్
చేతము లుల్లసిల్లునటు స్వీయఫలంబులు మానవాళికిన్
మాతకు బోలె నందరి గుమారులరీతి దలంచి యక్కటా
రాతి ప్రహారముల్ గొనియు క్రౌర్యము దాల్చక నీవు మామిడీ!                    ౨.

ఉ.      వేసవిలోన నీఫలము విస్తృతరీతి ముదంబు గూర్చుచున్
భాసిలు పృథ్వివారల కవారితఖాద్యపదార్థరాజమై
ధ్యాస మరల్చలే రవుర తద్గతచిత్తముతోడ జూడ స
న్న్యాసులుసైత మన్నను రవంతయసత్యము కాదు మామిడీ!            ౩.

ఉ.      స్వాదుతరంబుగా ఫలరసంబుల వెల్గుచు నుండి నిచ్చలున్
స్వేదము బట్టునట్లు తమ క్షేత్రములన్ శ్రమియించు వారికిన్
భేదము భావమం దిడని పిన్నలకాదట పెద్దవారికిన్
మేదిని నీఫలామృతము మిక్కిలి హాయిని బంచు మామిడీ!                         ౪.

ఉ.      కాయలు చూడగా రకరకంబుల పచ్చడి వ్యంజనంబు లా
ప్యాయత నిండియుండినవి హర్షము నింపెడి భోజ్యవస్తువుల్
శ్రేయములందజేసి సుఖసిద్ధిని చూపును నీదు పత్రముల్
శ్రీయుతముల్ త్వదీయ పరిశిష్టము లంగము లన్నిమామిడీ!           ౫.
         
ఉ.      ఎండలలోన నిల్చి సుఖమింతయు కోరక నిత్యమిమ్మహిన్
మెండుగ నీడనిచ్చెదవు మేటివి నీవు హితైషులందునన్
కొండొక భావమేల యిదె గూర్చెద నిప్పుడు సన్నుతాంజలుల్
నిండుమనంబుతోడ విను నిర్మలవన్నిట నీవు మామిడీ!                     ౬.

ఉ.      దేవతలెల్ల కాంక్షలను దీర్చగ శ్రీఘ్రము ప్రేమపూర్ణులై
భావన చేయుచుండెదరు త్వత్ఫలరాజిని గాంచినంతనే
యీవిధి మాధురీమహిమ నెట్టుల గాంచితి వేభవంబునం
దో విభవాన్వితా! వ్రతము లొప్పుగ చేసితి వీవు మామిడీ!        ౭.

ఉ.      చక్కని రూప మందుటయు, సర్వజనాళికి మేలు చేయగా
మిక్కిలి ప్రేమభావమును మిన్నగ దాల్చుట, యెల్లవేళలన్
మిక్కుటమైన హర్షమును మేదిని బంచుట లెట్లు పొందినా
వక్కట! పూర్వపుణ్యఫల మందువ? స్ఫూర్తిద వీవు మామిడీ! ౮.


ఉ.      చీకును చింతలే దెపుడు శ్రీలను పొందెడి కాంక్షలేదికన్
లోకహితంబు కోసమయి లోభులనైన సహింతు వెప్పు డే
నాకలి దప్పులంచు పలుకాడవు పాదపవై జలంబులన్
చేకొని సంతసించెదవు చిన్మయ రూపిణివౌచు మామిడీ!                           ౯.

ఉ.      నీకిల సాటి లేరొకరు నిన్గనుచుండెడి దాతలెల్లరున్
నీకరుణామయత్వమును నిర్మల విస్తృతదానశీలతన్
చేకొని లజ్జచేత తమ శీర్షమువంచి చరించుచుందు రో
నాకతరూపమా! విపుల నైష్ఠిక!  సన్నుతులందు మామిడీ!                           ౧౦.


౧౦.౦౩.౨౦౧౭



                                                                        




No comments:

Post a Comment