Monday 6 March 2017

కైక వరాలు

కైక వరాలు
కానలకు రాము నంపుము
మానితముగ భరతు నిపుడు మహికధిపతిగా
భూనాథ!యుంచు మంచును
దా నుడివిన దపుడు కాంత దశరథున కటన్.                           ౧.
        

ఇది గాని దన్య మడుగుట
సుదతీ! యుచితంబు నీకు చూడుము నాకున్
ముదమిచ్చు ప్రాణ మాతడు
వదలుము హఠమంచు  రాజు పలుకగ సతియున్.                  ౨. 

వరమిచ్చి మాట దప్పుచు
నరపతి! పలుకంగ నిట్లు న్యాయం బగునా?
ధరణిని నిది గాకుండగ
నురుగుణ! యన్యంబు వలవ దున్నతచరితా!                       ౩.

అని పలికి రామచంద్రుని
తన వద్దకు పిలువ బంచి తన్వంగి కటా!
తనవాంఛ దశరథాధిపు
నతరమగు నాజ్ఞ గాగ క్రమత న్నుడువన్.                          ౪.

గుణధాముడు శ్రీరాముం
డణుమాత్రము బాధపడక యది తనవిధిగా
ప్రణతులనిడి సంతసమున
క్షణ మాగక విపినభూమి జనినాడు గదా!                                ౫.

భూతనయ లక్ష్మణుండును
నాతని కనుచారు లగుచు నటవికి జనినా
రీతీరు జూచి జనకుం
డాతత దు:ఖాబ్ధి మునిగి రందరు నకటా!                               ౬.

అధికార వాంఛ జనులను
బధిరాంధుల రీతి మార్చు, బుద్ధిని గూల్చున్
బుధజన హితవాక్యంబుల
విధమును గాంచంగ నడ్డు విజ్ఞత గాల్చున్.                            ౭.

జయమగు దరశరథ సుతునకు
జయమగు వినయాది సకల సద్గుణమణికిన్
జయమగు సీతాపతికిని
జయమగు సర్వత్ర రామచంద్రున కవనిన్.                            ౮.

No comments:

Post a Comment