Wednesday 1 March 2017

ప్రబంధపరమేశ్వరుడు “ఎఱ్ఱన”

ప్రబంధపరమేశ్వరుడు ఎఱ్ఱన
శా.    శ్రీమద్భారత మాదికావ్య మిచటన్ శ్రేయంబు లందించు నీ
భూమిన్ పంచమవేద మంచు నతన్ బొందెం గదా తెన్గునన్
తా మా నన్నయ తిక్కనల్ పలుకగా తత్రస్థ భాగంబు మున్
ప్రేమన్ గూర్చెను శిష్టమై యగుపడన్ విద్వాంసు డెఱ్ఱన్న యే.

శా.    ఆనందంబున నాంధ్రభారతమునం దారణ్యపర్వంబునం
దా నన్నయ్య గతించ శిష్టమగు నద్దానిన్ సమీక్షించి స
న్మానంబంచు దలంచి దక్షు డగుచున్ నైపుణ్యతం జూపుచున్
ధ్యానం బొప్ప రచించె తద్రచనయే నంచెంచున ట్లందరున్.

మ.   పరమేశుండు ప్రబంధ పద్యరచనన్ ప్రహ్లాద సద్భక్తునిన్
కరుణన్ బ్రోచిన నారసింహుని కథన్ కావ్యంబుగా వ్రాసి యి
ద్ధరణిన్ గీర్తిని గాంచు నెఱ్ఱనకవిన్ ధన్యాత్ము విద్వన్మణిన్
వరశబ్దంబుల నందగోరి దలతున్ బల్మారు నమ్రుండనై.

మ.   హరివంశం బనుపేర సత్కృతిని సర్వార్థప్రదంబౌ విధిన్
విరచించెన్ ధరవారి భాగ్యమునకై వేదజ్ఞు డెఱ్ఱన్న యా
సరసాత్మున్, ను, శంభుదాసుని మదిన్ శబ్దార్థసంపత్తికై
గురుభావంబున మ్రొక్కుచుం దలచెదన్ గూర్మిన్ బ్రబంధేశ్వరున్.

ఉ.     తిక్కన నాటకీయతను, తీర్చిన నన్నయ శబ్దసంపదన్
మక్కువ జూచి వర్ణనలు మాన్యత నందుచు జేసి యంతటన్
మిక్కిలి సద్యశంబు గను మేటి కవీంద్రుని నాంధ్రసాహితీ
దిక్కరి నెఱ్ఱనార్యు ను ధీమతి నెంతు కవిత్వ సిద్ధికై.

ఉ.     వారధి యైనవాడు, మును వాగనుశాసన తిక్కనోక్తమౌ
భారత సాగరంబునకు వైభవదీప్తి కలుంగునట్టు ల
వ్వారల గ్రంథరాజమను భవ్యపు తేరున కెల్లరీతులన్
సారథి యైనవాడనుచు సన్నుతి మాలిక లందజేసెదన్.

చం. అసదృశమైన వర్ణనల, నద్భుత శబ్దసమాగమంబుతో
కుసుమచయంబులో యనగ గూర్చిన పద్యము లెల్లచోటులన్
రసమయమైన కావ్యముల రాజిలునట్లుగ దీర్చి సంతసం
బొసగగ జేయు సత్కవిని నున్నతు నెఱ్ఱన బ్రస్తుతించెదన్.

చం. మొదటి కవిత్రయంబునను మూడవవానిగ సుప్రసిద్ధుడై
సదమల భక్తిభావమున శంభునిదాసుడునై పఠేచ్ఛులౌ
యెదల కిలన్ బ్రబంధపరమేశ్వరుడై వెలుగొందు నా జగ

ద్విదితుని నెఱ్ఱనార్యు, ను విజ్ఞు, వినీతుని సన్నుతించెదన్. 

No comments:

Post a Comment