Friday 24 March 2017

ప్రయాణ ప్రాంగణము.

ప్రయాణ ప్రాంగణము.
శా.     యానప్రాంగణ మాస్థలంబు కనగా నత్యున్నతోత్సాహులై
వానం జూడక యెండలం చనక నవ్వారంద రచ్చోటునన్
వైనం బొప్పగ వస్తుసంతతు లటుల్ పల్రీతులం బట్టి య
య్యానం బచ్చట జేర నెక్కుటకునై యాత్రంబునుం జూపరే.  ౧.

సీ.      ఒకచేత సామగ్రు లొప్పిదంబుగ నంది
యొకచేత బాలల కూత మిచ్చి,
వరుసగా నున్నట్టి బండి పెట్టెలలోన
చో టెక్క డున్నదో చూచుచుండి,
స్వల్పకాలంబులో సరియగు స్థానంబు
వెతికి యెక్కెడి కాంక్ష వేగ బరుచ,
యిది దాటిపోవంగ నెంత సేపటికైన
బండి యన్యం బచ్చ టుండ కునికి
తే.గీ.   శీఘ్ర గతితోడ పరుగెత్తు జీవనంపు
యాత్ర నత్యంత దక్షులై యనుదినంబు
చేయు చుండెడి వారౌట చేరుచుండి
రదిగొ వీక్షించు డవ్వారు ముదముతోడ.                               ౨.

కం.    యాత్రికులారా! రండని
గాత్రంబున మధురిమంబు కనబడ నీష
ణ్మాత్రం బాగక శకటము
చిత్రంబుగ గూయుచుండె సేవాదృష్టిన్.                                ౩.

ఆ.వె. కూతబండి తాను కూర్మితో ధరలోన
పిన్న పెద్ద యనెడు భేదములకు
దూర ముండి వారు కోరిన చోటులన్

జేర్చు చుండు సతము శ్రేష్ఠ యగుచు.                                           ౪. 

No comments:

Post a Comment