Tuesday 21 March 2017

చరవాణి



చరవాణి

కం.    శ్రీపతియు చంద్రశేఖరు
డా పరమేష్ఠియును గూడి యతి వత్సలురై
యీ పృథ్వికి నిను బంపిరి
చూపగ నీశక్తియు సొగసులు చరవాణీ!                                 ౧.

కం.    పిన్నలు పెద్దలు చదువరు
లెన్నంగా పామరాళి యెల్ల జగానన్
నిన్నే దలచుచు నుందురు
మున్నెన్నడు లేని చందమున చరవాణీ!                      ౨.

కం.    ఇందు గల వందు లేవను
సందేహము గూర్చబోక సర్వత్ర భువిన్
సౌందర్యంబును చాటుచు
నుందువు నత్యాప్త వౌచు నో చరవాణీ!                                  ౩.

కం.    నీవుండినచో నుండును
భావములో హర్షదీప్తి బహుభంగులుగా
నీవే సర్వాధారవు
జీవనమున నేడు జూడ చినచరవాణీ!                                    ౪.

కం.    పలుకులకే పరిమిత వయి
యిలలో యశమంది యుంటి వెంతేనియు నీ
వలనాడు నేడు చూడగ
తలపుల కనురూప వందు తగ చరవాణీ!                     ౫.
కం.    పిట్టగ కొంచెం బైనను
బిట్టగు నద్దాని కూత విను డనురీతిన్
పట్టెదవు చేతి లోపల
నెట్టన నతులితము శక్తి యిక చరవాణీ!                                 ౬.

కం.    నీయందు విశ్వ మంతయు
స్వీయాకృతి చేర్చియుండు స్థిరముగ నెపుడున్
శ్రేయంబులు సమకూర్చుట
కో యన మము జేరియుందు వో చరవాణీ!                            ౭.

కం.    ఛాయాచిత్రము లందుట
యీ యవనిని గష్టకార్య మింతకు పూర్వం
బీయుగమున నీ యునికిని
స్వీయములే సాధ్య మయ్యె విను చరవాణీ!                           ౮.

కం.    హస్తంబున నీవుండిన
పుస్తకముల నందబోరు పుడమిని ఛాత్రుల్
వాస్తవ మిది యిలపైగల
వస్తువు లన్నింట బ్రియవు భళి! చరవాణీ!                             ౯.

కం.    నీరాహారము లెవ్వరు
కోరరు నిన్నందిరేని కువలయమందున్
చీరెదరు నిన్నె సఖునిగ
నౌరా! నీమహిమము కననగు చరవాణీ!                      ౧౦.

కం.    తననోరు దెరిచి తల్లికి
నమగు బ్రహ్మాండ మపుడు కాంచు మటంచున్
మును జూపిన కృష్ణుని వలె
తనియగ విశ్వమును జూపెదవు చరవాణీ!                             11

కం.    ఒకపరి మాటాడించుచు
ఒకపరి గీతాదులందు నుత్సవమిడి యిం
కొకపరి సకలము దెల్పుదు
వకటా! సర్వజ్ఞ వీవె యన చరవాణీ!                                      ౧2

కం.    ఈ కాలపు పిల్లలలో
చీకాకును జూడగలము చేతను నీవున్
లేకున్న వేళలందున
నేకాలము సత్యమందు నిది చరవాణీ!                                  ౧3

కం.    మోదం బొకయిం తొదవదు
గాదా నిను జూడకున్న కాంతలలోనన్
లేదట పతి కొక్కింతయు
సాదం బాయింట యనుట సరి చరవాణీ!                               ౧4

కం.    నీలోని యాటపాటలు
నీలో కనిపించునట్టి నిరుపమ చిత్రా
లాలోకించుటె  పనియౌ
బాలలు వృద్ధుల కునెందు బళి చరవాణీ!                    ౧5

కం.    నిను జూడక మేల్కొనరట
జనులెవ్వరు నిద్రనుండి సర్వజగానన్
నిను గాంచక నిద్రించుట
యనునది లేదను టసత్య మగు చరవాణీ!                    ౧6

కం.    నీవే గురుతుల్యవుగద
నీవే సర్వార్థదాయి నిఖిల జగానన్
నీవే నెచ్చెలి వందరి
కీవే సర్వస్వమందు రిట చరవాణీ!                                        ౧7.

కం.    పలుమాటలు పలుకంగా
వలయునె నిను బొందలేని వారలకిలలో
తలచగ గౌరవ మింతయు
కలుగదు విను మన్న నిజము గద చరవాణీ!.                         ౧౮.

  
కం.    నీవుండిన కరమందున
నేవిధి సుముహూర్తమందు నేవధు వైనన్
పావన మంగళ సూత్రమె
జీవన మని దాల్చగలదు చిరు చరవాణీ!                      ౧౯.

కం.    చిత్రమున గాంచు మాతం
డాత్రంబుగ జూచుచుండె నాయమ మెడలో
సూత్రంబు గట్ట గోరుచు

చిత్రము! వధువు నిచట దలచిన చరవాణీ!                            ౨౦..


No comments:

Post a Comment