Tuesday 28 February 2017

ఆదికవి నన్నయ

ఆదికవి నన్నయ
శా.    శ్రీమంతం బగు భారతంబు భువికిన్ శ్రేయంబు లందించగా
భూమీశుం డగు రాజరా జడుగగా పుణ్యాత్ము డవ్వేళలో
నీమం బొప్పగ దీక్ష బూనెను లస న్నిత్యాగ్నిహోత్రుండు తా
నా మాన్యుండగు నన్నయార్యుడు నుం డాంధ్రంబునం గూర్చగా.

శా.    ఆనారాయణ భట్టు సత్సఖుడు తా నందింతు నంచాడె స
న్మానం బంచు దలంచి తత్కృతికి ధీమంతుండు సాహాయ్యమున్
వానిన్ దోడుగ నెంచి సద్ధితుని సర్వామోద యోగ్యంబుగా
చేనందెం గద లేఖినిన్ శుభవచశ్శ్రీమంతుడై యంతటన్.

మ.   మును సంస్కారము శబ్దజాలమునకున్ ముఖ్యంబు గా నెంచి
తెనుగుం జూచి లిఖించె వ్యాకరణమున్ దీప్తిం బ్రసాదించ నా
పనిచే వాగను శాసనుం డనబడెన్ భాగ్యోద యంబయ్యె త
ద్ఘనకార్యంబున నాంధ్రభాష కిలలో దారుఢ్యముం గూడెగా.

మ.   అది శబ్దంబుల శాసనంబె పనిగా నత్యంత సామర్ధ్యతన్
ముదమారంగను నన్నపార్యకవిచే మున్నాంధ్ర భాషాబ్ధికై
సదయం గూర్చిన గ్రంథమై నిలిచె నా సత్శబ్దచింతామణీ
హృదయంబున్ గమనించు వారల కిలన్ హెచ్చౌ మహద్భావనల్.

ఉ.     వ్యాకరణంబు వ్రాసి యిక వ్యాసకృతంబగు భారతంబు తా
నాకవి శేఖరుండు కడు హర్షము నిండగ మానసంబునన్
చేకొని తెన్గుసేతకయి శీఘ్రము గా కడగెన్ మహాత్ముడై
శ్రీకరులైన దేవతల చిన్మయరూపుల సంస్తుతించుచున్.

ఉ.     మూలము నందు నున్నవగు ముఖ్యములైన కథావిధానముల్
మేలుగ స్వీకరించుచును మిక్కిలి దక్షతతోడ నంతటన్
చాల స్వతంత్రభావనలు చక్కగ జూపుచు స్వీయసృష్టియై
నేలను వెల్గుచుండునటు నిష్ఠ రచించె జగద్ధితంబుగన్.


చం.  అరయ బ్రసన్న భావముల నందిన సత్కథలన్ని చోటులన్
సురుచిరమైన సూక్తులకు సుందర వర్ణము లందునట్లుగా
నిరుపమమైన రీతి యనునిత్యము సత్కవి వర్యులన్యులున్
కరము స్తుతించు నట్లు తన కావ్యము నన్నయ గూర్చెనప్పుడున్.

చం.  కరములు మోడ్చి మ్రొక్కెదను కావ్యకళానిధి నాదిసత్కవిన్
వరగుణ భూషితున్ బహుళవైభవయుక్తుని నన్నపార్యునిన్
స్ఫురదురుకీర్తిసంపదల శోభితునిన్ కరుణార్ద్రచిత్తునిన్
నిరుపమ వాక్పటుత్వమును నింపుటకై వినయాన్వితుండనై.
బుధజన విధేయుడు
       హ.వేం.స.నా.మూర్తి.



No comments:

Post a Comment