Friday 24 February 2017

మాతృభాష


                మాతృభాష

శ్రీలను గురిపించి మేలుగల్గెడి రీతి

        మంచి నేర్పెడి భాష మాతృభాష

సాటివారలపట్ల సద్భావ దీప్తమౌ

       మమత జూపెడి భాష మాతృభాష

మర్యాదతోనుండు మాటలు బలికించి

        మనసు దోచెడి భాష మాతృభాష

హృద్యమై వెలుగొందు సద్యశోవిభవంబు

       మహిని గూర్చెడి భాష మాతృభాష

సరళమై సుఖదమై సురుచిరంబైనట్టి

      మధువు లొల్కెడి భాష మాతృభాష

మమతానురాగాలు, సమత, సద్భావాలు

       మనకు దెల్పెడి భాష మాతృభాష

పుట్టినదాదిగా పూర్ణజీవనమందు

        మరువ గూడని భాష మాతృభాష

సదమలమై యొప్పి సాధుత్వ భరితమై

        మదుల వెల్గెడి భాష మాతృభాష

సర్వభూతములందు సమతానుభావంబు

        మరువ వద్దను భాష మాతృభాష


అన్యభాషాజ్ఞాన మందగోరెడివారి

        కూతంబు భువిలోన మాతృభాష

విస్తృతం బైనట్టి విజ్ఞాన దీప్తికై

        మహదుపకరణంబు మాతృభాష

అంతరంగములోని ఆంతర్యమును దెల్ప

        మనిషి కాధారంబు మాతృభాష

సుందరంబైనట్టి సూక్తులు బలికించి

       మహిత తేజము గూర్చు మాతృభాష

సంసేవను భువిన్ సర్వకాలములందు

       మరువనీయని భాష మాతృభాష

మనిషికి మనిషిగా మానవత్వంబున

       మనుట నేర్పెడి భాష మాతృభాష

కష్టసుఖములందు కడుప్రేమ జూపించి

       మనను వీడని భాష మాతృభాష

తల్లి గర్భమందె యెల్ల కాయంబున

నిండి జననమంద నిష్ఠబూని

రక్షణంబు చేయు రమ్యాతి రమ్యమౌ

భాష మాతృభాష వసుధపైన.

No comments:

Post a Comment