Saturday 24 December 2016

సమస్యాపూరణం-6 December, 2016

కరుణయు, ధర్మచింతనము, కమ్మని మాటలు, వర్తనంబునన్
సరసత లేని రాక్షసుల శాసనమందున వ్యంగ్యరీతిలో
నరయుడు కొందరిట్లనెద రానరనాథుని జేరి మ్రొక్కి భూ
వర! సురలోకమేగుదురు వారక చేసిన బాపకృత్యముల్. 1

పరమ పావనమైనట్టి సురనది గని
“గంగ! గంగా యటంచును ఘనతబొగిడి
స్నానమును జేయ వింటిరె దాని మహిమ
స్వర్గలోక మేగెదరట పాపులెల్ల. 2

నిరతము దైవచింతనయు, నిష్ఠను బూనిన వర్తనంబుతో
సరసవచస్సుధావిభవశక్తిని బూనుచు సత్త్వయుక్తవై
స్థిరగుణవౌచు సంఘమున శ్రేయము గల్గెడు రీతినిత్యమున్
వరసురలోకమే గుదురు వారక చేసిన బాప! కృత్యముల్. 3

రమ్ము బాలక గణితంపు క్రమము దెలియ
పదికి పదిజేర్చి యటమీద ముదముతోడ
నొకటి రెండుల నద్దాని కొప్పగూడి
మూడు నాలుగు గలిపిన ముప్పది కద. 4

చూడిది బాలకా! గణిత సూత్రము చక్కగ నేర్వుమోయి నీ
వాడుచు పాడుచున్ పదికి హర్షముతో బదిజేర్చి మీదటన్
కూడగ వచ్చుమొత్తమున కూర్మిగ నొక్కటి రెండుసంఖ్యలున్
మూడును నాలుగున్ గలియ ముప్పదియౌ గద లెక్కజూచినన్. 5



శిక్షితు లైనవారలు, విశిష్టులు ధార్మిక వర్తనంబునన్,
రక్షణ గూర్చబూనుచు ధరాస్థలి నధ్వరకర్మలన్ సదా
దీక్షగ జేయువిప్రు లిక ధర్మము త్రెంచెడివారి కెల్లెడన్
రాక్షసు లెల్లరన్ సతము రక్షణసేయు సహస్రనేత్రుడే. 6

దీక్షితుల, విప్రవరులను
రక్షణకై యుచితమైన క్రతువులు చేయన్
దక్షుల, దుష్టుల యెడలను
రాక్షసుల సహస్రదృక్కు రక్షించు సదా! 7



ఎప్పటి కేది కావలయు నియ్యతి దుస్తర జీవనాబ్ధిలో
చెప్పగ వచ్ఛునే భువిని శ్రేయము సౌఖ్యము లందగోరుచున్
దప్పులు సేయు మానవుఁడె, ధర్మవిదుం డన నొప్పు నెల్లెడన్
దప్పని వాడె సత్యమును తన్మయతన్ బహుకష్టమంది యున్.8

వర గుణాఢ్యు నొకని జెరపంగ బూనుట
తప్పు, సేయువాఁడె ధర్మవిదుఁడు
విమల భావమూని వినయాన్వితుం డౌచు
శిష్టు డగుట తని చెలిమి సతము.9

ఊహాతీతముగాగ నాంధ్రమున దాముత్సాహపూర్ణాత్ములై
యాహా సౌఖ్యద మిద్దియన్ దలపుతో నాంగ్లాది శబ్దంబులన్
స్నేహంబొప్పగ గూర్చి చేతురు కృతుల్ నిష్ఠం బ్రదర్శించుచున్
సాహిత్యాధ్వము దుమ్మురేగినది దుష్కాలమ్ము ప్రారంభమై. 10
ఊహాతీతంబగువిధి
యాహా! యన్యములజేర్చి యాంధ్రమునందున్
శ్రీహరి! కైతలు పలుకుట
సాహిత్యాధ్వమున దుమ్ము సమధిక మయ్యెన్. 11

లలితాకార ధరాత్మజన్ బ్రియసఖిన్ లాలింపగా బూని య
య్యలినీలాలక పల్కబోననుటచే నత్యంత హాస్యంబులౌ
పలుకుల్ పల్కుచు సైగ సేయుచు మనోభారంబు దీర్పంగ నో
బల! రాముం డవనీతనూజ గని దుర్వారంబుగా నవ్వెరా. 12

అలినీలాలక దనసతి
కలనా డావనములోన నతులితరీతిన్
దలపై దృణములు చేరగ
బల! రాముడు సీతజూచి ఫక్కున నగియెన్. 13

అల పీయూషము బంచువేళ తమలో నద్దానవుండుండుటన్
దెలుపన్ శ్రీహరి వానికుత్తుకను వే ద్రెంపంగ నద్దాన నా
ఖలుడూనెం గద దీర్ఘకాలమకటా! కక్షన్ గనుండందుచే
బలవన్మృత్యువు ప్రాప్తమయ్యె రవికిన్ బ్రారబ్ధకర్మంబునన్. 14

ఖలుడగు దైత్యుని యునికిని
తెలుపుటచే హరికి యతడు ద్రెంచుట వానిన్
దెలియమె మనమద్దానన్
బలవంతపు చావు వచ్చె భాస్కరునకటన్. 15

కవికి సభలోన బంగారు కడియ మొకటి
బహుకరించగ నప్పుడే ప్రకటితమగు
వార్తలను గాంచి జనకుండు పలికెనిట్లు
శంకరా! భరణంబు సమస్యలకు నెలవు.16

దినము మారిన జాలును ఘనతరమగు
పద్యపాదంబు లొసగుచు హృద్యముగను
పూరణంబులు జేయించు నౌర! సతము
శంకరాభరణంబు సమస్యలకు నెలవు.17

సురుచిర పద్యపాదముల జూపుచు నుండును బూరణార్థమై
నిరుపమమన్నరీతి యనునిత్యము శంకర రక్షణంబులో
కరమరుదౌచు మాదృశుల గాంక్షలు దీర్చెడి కావ్యమందు నే
నరయగ శంకరాభరణమందు సమస్యల వెల్లువే కదా! 18

తిండి బట్టయు సంతాన మండ దండ
బంధుజనములు ప్రేమయు భవ్య యశము
ధనము లేకుండ సర్వేశ! మనుట కంటె
తండ్రి! మరణమ్ము సంతోషదాయకమ్ము.19

బహుళ దారిద్ర్యమున జిక్కి యహరహమ్ము
పరితపించుచు జీవచ్చవంబు వోలె
బ్రతికి యుండుట కంటె నీక్షితిని దేవ!
తండ్రి! మరణమ్ము సంతోషదాయకమ్ము.20

తన ప్రభవంపు కారకుడు, ధర్మపథంబును జూపునట్టి యే
జనకుని చావు పుత్రునకు సంతసముం గలిగించు? సత్యమౌ 
ననయము మార్గదర్శనము నందగ జేయుచు రక్షకుండు గా
మనుటయె హర్షదాయకము మానవకోటికి నెందు జూచినన్.21

దుష్ట సహవాసమున జేరి దుర్మతి యయి
వ్యసనముల బారి బడియుండి భ్రష్టు డగుచు
దిరుగు వానికి గుపితుడై తిట్టునట్టి
తండ్రి మరణమ్ము సంతోష దాయకమ్ము.22

అనయము దుర్మదాంధులకు నాప్తుడుగా వెలుగొందుచుండి త
జ్జనములతోడ దుర్వ్యసనజంబగు విస్తృతవిత్తకాంక్షచే
తనపర భేదముల్ మరచి తండ్రిధనంబును మ్రింగగోర న
జ్జనకుని చావు పుత్రునకు సంతసముం గలిగించు సత్యమౌ 23



చేతను డనియెడి ఛాత్రుడు
భీతిల్లుచు బలికె గురుడు బెత్తము జూపన్
కాతరుడయి తడబడుచును
గీతను బోధించె నరుడు గీష్పతి వినగన్. 24

ఆతడు మద్యపానమున నాతురుడై వచియించె నిట్టు లా
పోతన వ్రాసె భారతము పూర్వము సత్యము నన్నయార్యుడే
చేతము లుల్లసిల్ల గను చేసెను భాగవతాఖ్య సత్కృతిన్ 
గీతను జెప్పె నర్జునుడు గీష్పతియే వినగన్ రణంబునన్.25 

ఘనతరమైన చీకటులు క్రమ్మెడు వేళ సరిత్తటంబునన్
వనగత జంతుజాలము సభన్ నడిపించుచు నుండ చిత్ర మా
యినశశిబింబయుగ్మ ముదయించె దినాంతమునందు దద్దిశన్
కనబడె నాకు స్వప్నమున గాంచితి నంచనె మిత్రు డొక్కడున్. 26

కనినాడను స్వప్నంబున
ఘనతరముగ నిరులు జగతి గ్రమ్మిన వేళన్
వినుడని పలికెను మిత్రుం
డినహిమకరబింబము లుదయించె నొక మొగిన్. 27

తెనుగుకవీంద్రులందు రవితేజుడునా కవి సార్వభౌముడున్
ఘనుడగు పోతనార్యుడొక కాలమునన్ మడి కేగుచుండ నా
వనమున నున్నవారు కవివర్యుల గాంచి దలంచి రిట్టు లౌ
నినశశిబింబ యుగ్మ ముదయించె దినాంతమునందు దద్దిశన్. 28

ఘనుడగు శ్రీనాథుం డా
యనఘుడు పోతన్న తోడ నటు నడువంగా
కనువార లిట్టు లాడిరి
యినహిమకరబింబము లుదయించె నొక మొగిన్. 29

వాసిగ బెండ్లికోసమని వారలు తియ్యని సున్ని లడ్డులన్
జేసి యొకింత గాలికయి చేర్చగ వాటిని గుడ్డమీద నా
వాసన బీల్చి వృక్షమున బారుచు దూకుచు నుండి యాగలే
కా సుల జూచి వచ్చినవి గంతులు వేయుచు కోతులన్నియున్. 30

సురుచిర సౌఖ్యసంపదలు శుద్ధమనంబున తన్ను బిల్వగా
నరుదగు సద్యశంబిడును హర్షము నింపును జీవనంబునం
దిరుమల వేంకటేశ్వరుడు దేవుడు, గాడని చెప్పిరెల్లరున్
వరమగు భక్తి గొల్చినను పల్కనివాడిల నీయుగంబునన్. 31

ఉర్విజనుల గావ నుండ నీయుగమందు
తిరుమలేశు, డెట్లు దేవు డగును
ధరణిపైన నన్యు డరయంగ నారీతి
పలుక కుండు వాడు దలచి యున్న. 32

కాళియ నామకుండొకడు కాంతయు దానును పట్నమేగి య
వ్వేళగృహంబుజేరి గడి వెంబడి శబ్ద మదేమిటో గదా
తాళుము చూతమంచు పరదా దొలగించినమీద తీయగా
తాళము, లోని కప్ప కడు దల్లడమందె భయార్త చిత్తయై. 33

కాళియుడు ధర్మపత్నియు
కాళిని బూజింప గుడికి క్రమమొప్పగన
వ్వేళకును జేరి తీయగ
తాళము, లోనుండు కప్ప దడదడ లాడెన్.34

వశ్యుడు దుర్గుణంబులకు, వాక్యవిధానము గాంచకుండ నీ 
కాశ్యపి బైనద్రిమ్మరుచు కాలము బుచ్చెడి వాడు, మత్తుడై
దేశ్యను భారతాంబనని దెల్పగ బోవుచు బల్కె నీగతిన్ 
వేశ్యను జూచి మ్రొక్కిరట వేదవిదుల్ గడుభక్తి నెల్లరున్.35

కాశ్యపిపై యశమందిన
దేశ్యను భరతాంబనంచు దెల్పచు సురకున్
వశ్యుడు పలికె నొకండిటు
వేశ్యను వీక్షించి వేదవిదు లిడిరి నతుల్. 36

భావనల వాక్కులందున
గావించెడి పనులలోన గడు వత్సలతన్
భావింప నిలిచియుండెడి
దైవమ్మును నమ్మకుండఁ దరమే యుండన్.37

భవము నొసఁగుచు విస్తృత భువనమందు
ఖ్యాతి గూర్చుచు సత్కృతుల్ కరము చేయు
శక్తి నిచ్చుచు నద్దాన ముక్తి నిడెడు
దైవమును నమ్మ కుండగఁ దరమె యుండ.38

ముమ్మాటికి నారంభను
కొమ్మా! తలదన్నగలవు కువలయమందున్
లెమ్మెవ్వరు నీసరి వెం
కమ్మా! రమ్మనుచు బిలిచె నాలిని మగడే. 39

నమ్మం జెల్లును సుందరీ! ప్రియసఖీ నాకస్థయౌ రంభయుం
గొమ్మా! నీసరికాదు సత్యమిదియే కోపించగా నేలనే
లెమ్మీరీతిగ నన్నుజూడ దగునే లేమా! కరంబంది వెం
కమ్మా! రమ్మని పిల్చె భార్యను మగం డయ్యర్థరాత్రంబునన్. 40

అతులితానంద కారణ మడుగ నపుడు
సతము దుర్మార్గ గామియై సాటివారి
కార్తి గలిగించు వాడాత డనుచు దెలుప
భర్త మరణవార్తను, విని భార్య మురిసె. 41

ధూర్తులు దుష్టభావులయి తోరపు గ్రూరత దూరవాణిలో
నార్తిని గూర్ప బూనుచు భయంకర మౌగతి దెల్పినప్పుడున్
భర్త పరేతుఁ డయ్యెనను వార్త, వినంగనె భార్య నవ్వెరా
నర్తన జేయుచుం గనుచు నాథుడు ప్రక్కనె చేరి యుండుటన్.42

అరులంచున్ మనమందు భావనములే కత్యంత ప్రేమంబుతో
ధరవారందరినిన్ సహోదరులుగా దానెంచి యవ్వారితో
వరసల్లాపము లాడుచుండుట లికన్ భవ్యంబులై వెల్గు నా
దరహాసమ్ములు సాలు వక్త్రమున శస్త్రశ్రేణులన్ మించగన్. 43

శాస్త్రోక్తము, వేదోక్తం
బస్త్రంబుల దాల్చకునికి యాహవమందున్
శాస్త్రులు మెచ్చెడి రీతిగ
శస్త్రశ్రేణులను మించు సరి చిరునవ్వే. 44

తనను దలచిన క్షేమంబు లనయ మొసగు
పాపనాశకు నేసును బహుళములగు
వరము లిచ్చుచు నుండెడు భక్తజనవ
శంకరుని గొల్చుచుంద్రు క్రైస్తవులు సతము 45

అంకిత భావులై సతత మాకరుణామయు నేసు నెల్లెడన్ 
శంక యొకింత బూనక లసద్గుణదాతను సర్వరక్షకుం 
గింకరులై చరింప ఘనకీర్తి నొసంగెడు ఘోరపాపనా
శంకరు నాశ్రయించిరట సైయని క్రైస్తవు లెల్ల భక్తితోన్. 46



అవధానం బొక ప్రజ్ఞయౌ నన నసత్యంబే కదా మిత్రమా
రవిరాజా! వినుమంచు నజ్ఞులగుచున్ రమ్యత్వమే లేక తా
మెవరీరీతి వచించువారలు కటా! యెప్పట్టునన్ జూచినన్
స్తవనీయం బయి వెల్గుచుండ భువిలో దైవప్రదత్తంబుగాన్. 47

స్తవనీయంబిది యెంచిచూడ నిలలో దైవానుకంపంబుచే
శ్రవణానందకరంబు సర్వగతులన్ సాహిత్య విజ్ఞానదం
బెవరేనిన్ మది స్వీయమైన కృషిగా నిద్దానినిన్ దల్చి యీ 
యవధానం బొక ప్రజ్ఞయౌనన నసత్యంబే కదా మిత్రమా!  48

భువిసత్కృషికిని భగవ
త్స్తవమది గూడంగ నబ్బు ధనమిది కనుకన్
గవి కాత్మీయంబగు, కేవల
మవధానము ప్రజ్ఞయనుట యనృతము సఖుడా! 49

నేరమును సమ్మతించుచు
గారుణ్యము జూపి నన్ను గావుమటంచున్
గోరిన శత్రువు నైనను
వీరుడు పోవిడుచు యుద్ధవిముఖుం డగుచున్. 50.

No comments:

Post a Comment