Saturday 24 December 2016

సమస్యాపూరణం-5

వీరుండై సుమహత్ప్రభావయుతుడై విస్తారసద్భక్తితో
ధీరత్వంబున మాతృభూమికొరకై ధీశక్తితో బోరగా
జేరంబోయెడి దేశభక్తుని మదిన్ క్షేమంబులే గల్గు నా
కారాగారము నందు లభ్యమగు సౌఖ్యంబుల్ ముదం బొప్పగన్. 1.
వీరునకు దేశభక్తున
కౌరా! సద్భావదీప్తి నన్నిట శుభముల్
కోరుచు నుండెడి వానికి
కారాగారమున ఘన సుఖంబులు దక్కున్.2.

వినుడొక నాటకంబునను విజ్ఞత మీరగ పాత్రధారులై
జనకుడు దత్సుతుండు కడు సంతస మందుచు చేరి యుండ నా
ఘనతర మైన కార్యమున గాంచగ నా సమయాన దండ్రికిన్
తనయుఁడు తమ్ముఁ డయ్యె నది తప్పగునో మఱి యొప్పునో సఖీ. 3

కనుడొక నాటక మందున
ఘనతరముగ నటన చేయ కడగిరి వారల్
జనకుడు సుతు డవ్వేళను
తనయుడు తన తమ్ముడయ్యె తప్పో యొప్పో. 4

భావనలోన యత్నమున బల్కులయందున నొక్కరీతి సం
భావన జేసి దీనులకు భాగ్యవిహీనుల కెల్లవేళలన్
సేవలు చేయుచుండినను క్షేమము లందగ జేయనట్టిడౌ
దేవుడు లేనె లేడని మదిన్ నెరనమ్ముచు గొల్తు భక్తితోన్. 5.

శ్రీవిభుని కంటె మిన్నగ
ధీవైభవ మొసగి యెపుడు దీనుల యెడలన్
సేవాభావము గూర్చెడు
దేవుడు లేడనుచు నమ్మి తిరముగ గొల్తున్. 6.




కారణ మేమిటో పలురకంబుల వాహనసంఘ మిచ్చటన్
బారులు దీరి నిల్చుటకు బాట నటంచును క్రింది కేగి తా
నారయ బూనినంతట మహాఘనమై దిశ లంటియుండె నీ
హారము గొల్చి చూడ బది యామడ లున్నది కంటివే సఖీ! 7
కోరిన యట్టుల గమ్యము
చేరంగను నడ్డగించి శీతమయంబై
ధారుణి నలమిన యా నీ
హారము గొలిచిన నది పది యామడ లుండెన్. 8



రండీ వార్తను మిత్రులార! వినగా రాజయ్య యారోజునన్
దండించంగను బిల్చి తుంటరి సఖుం దా జూపె భక్షించగా
బండున్వీడిక నేడటంచు నిజ మా స్వప్నంబు నంజూచితిన్
బోండా లర్వదియైన నేమి నమిలెన్ భూమయ్య పేలాల్వలెన్.  9.

దండిగ భక్షణ జేసెడు
భండాసురనామకుండు బహు హర్షితుడై
పండుగ నాడది యగుటను
బోండా లరవై నమిలెను బొరుగుల వలెనే.  10.



వేషము మార్చనేల, కడువేదన జెందుటదేల నిత్యమున్
భూషణమౌనె సంపదయె, పొందునె సత్సుఖమెందు, లేమిచే
దోషము లెంచ రెవ్వరును, దుష్టుని చెంతను విత్తమున్నచో
భూషితుడై వెలుంగునె, యపూర్వపు గౌరవ మందగల్గునే?  11

సాధుజనులందు సన్మార్గ చరులయందు
దోషము లరుదు ధనమున్న, దుష్టునందు
మిక్కుటం బవి లెక్కకు మించియుండు
నలఘు మదజాత కలుష సంకలితుడగుట.  12

భూనుత! గౌరవాన్వితకు బూజ్యకు నాఖ్య యదేమి యొప్పు నె
ద్దాన బురందరుండపుడు తాను వహించెను శాపభారమున్
స్త్రీనిల నక్షరజ్ఞనుగ జేయ లభించినదేమి యన్నచో
మానిని,మానముంజెరచి,మన్ననలన్ మగవాడుపొందెరా. 13

అప్రతిమప్రభావమున నాత్మగృహంబున సేవకుండుగా
క్షిప్రగతిన్ స్వకర్మములు చేయుచు నుండెడి వాని సర్వదా
యప్రియ వాక్యదూరుడగు నాతని సంతత మాంసభక్షకున్
విప్రుఁడు మద్యమాంసముల విందనగాఁ దల యూపి వచ్చెనే.  14

ఆప్రియవాక్యభాషి యొక డందరి జేరుచు స్థైర్య శూన్యు డై
యప్రతిమాన గర్వమున నచ్చట దూషణ జేయ నాతనిన్
క్షిప్రగతిం బ్రశాంతునిగ చేయగ బూనుచు వానితోడ నా
విప్రుఁడు మద్యమాంసముల విందనగాఁ దల యూపి వచ్చెనే. 15

సుప్రతిభావిశేషమున శోభిలు నెల్లెడ సద్ద్విజుండు తా
నీ ప్రజ కన్నివేళలను నీశ్వర సత్కృప గల్గునట్లుగా
నప్రియ మంటకుండు నటు లంతట జూచెడు సద్వివేకి యే
విప్రుఁడు మద్యమాంసముల విందనగాఁ దల యూపి వచ్చెనే? 16

తాను చెప్పిన కార్యంబు తడయకుండ
చేసి యున్నట్టి వానిని జేర బిలిచి
పల్కు మొసగెద నీకేమి వలయు ననిన
ద్విజుడు; మద్య మాంసమ్ముల విందు గోరె 17

కల్లగ నెంచ వద్దు బహుకాలపుఁ గ్రిందటిదైన మాట వా
రెల్ల బిడాలదేశజను లింపుగ జీలిని జాతిచిహ్న మం
చుల్లము సంతసించ మనుచుండెద రచ్చటి సంఘమందునన్
పిల్లిని జంక బెట్టుకొని పెండ్లికి బోయిన మెత్తురెల్లరున్! 18.

కల్ల యటండ్రు దైవమును, కాదు ప్రపంచము వాని సృష్టి మీ 
రెల్లరు మూర్ఖులెంచ, విను డీయిలఫై శకునంబులేల యం
చల్లరి చేయుచుండు ఘను లారయ నాస్తికవర్యు లక్కటా
పిల్లిని చంక బెట్టుకొని పెండ్లికి బోయిన మెత్తురెల్లరున్! 19. 

పెండ్లి కేగుము, చంకలో పిల్లి తోడ 
వెళ్ళు టుచితంబు గాదెందు, కళ్లలోన
హర్ష మగుపించ బహుళంపు టాదరాన
నుచిత మైయొప్పు బహుమాన మొకటి గొనుచు 20.

పలికెను కృష్ణు డీ గతిని పార్థ! మనోవ్యధ చెందనేలనీ
యిలపయి కర్మలందు విను మెవ్వరి కైనను నాధిపత్య, మా
ఫలముల పైన గాదనుచు వాస్తవ మియ్యది స్వార్ధపూర్ణు లై
ఫలితము గోరి పాటుపడు వారికి దక్కునె లాభ మెయ్యెడన్ 21

పోటీపడి యుద్ధండుల
దీటై వెలుగొందలేక ధీశాలురకుం
జేటొనరించుట కొరకై
పాటు పడిన వారికెట్లు ఫలితము దక్కున్. 22

ఏ దినమందు తద్దినములే కరవౌనొ మదీయ తద్దినం
బా దినమౌను
సద్ధితుడ! హాస్య మబద్ధము గాదు ప్రస్తుతం
బేదియు దోచకున్నయది యీపరివారము నీదలేను సం
పాదన శూన్య మయ్యెనని భాగ్య విహీనుడు బ్రాహ్మణుండనెన్. 23

ముద్దారగ వంటకములు
వద్దన్నను భోక్త వనుచు వడ్డించి ననుం
బెద్దగ జూతురు శ్రద్ధ
న్దద్దినమే, లేనిరోజు నా తద్దినమే. 24

కామించిన దవ్వానిని
భామగ నటియింప జూచి, పరిణయమాడెన్
ప్రేమాతిరేక పరవశ
భామా రమ్మనుచు ముదిత భర్తను బిలిచెన్. 25
పెద్దల యనుమతితోనొక
ముద్దియ బెండ్లాడి యిపుడు మురియక మోదీ
వద్దిక యీకాగితములు
రద్దన రాద్ధాంత మేల రాహుల్ గాంధీ. 26

పెద్దలు పిన్నల కందరి
కద్దిర! సుఖమందగలుగు నంచును మోదీ
ముద్దుగ బలుకుచు నోట్లను
రద్దన రాద్ధాంత మేల రాహుల్ గాంధీ. 27

నిగ్రహశక్తి యంతటను నిర్మలభావము సత్యసూక్తి య
త్యుగ్రపు బాపరాశికడ నుండక పోవుట, సంఘసేవ, స
ర్వాగ్రగ సత్త్వయుక్తియును,హర్షము, సజ్జనమైత్రి, వాసుదే
వాగ్రహ మున్నఁ జాలు సుజనావళి మెచ్చును స్తోత్రవాక్కులన్. 28

దేశ వికసనంబె స్థిరలక్ష్యమని చేయు
జగతి కుపకరించు చర్యవలన
విమతులైన వారి వివిధంపు మాటలు
పడ్డవాడు కాడు చెడ్డవాడు.29

తల్లిదండ్రి గొలిచి ధన్యత్వమును గాంచ
గోరుచుండ జూచి కుమతి జనము
లహరహమ్ము చేయు బహువిధ దూషణల్
పడ్డవాడు కాడు చెడ్డవాడు. 30

సంఘసేవ గోరి సతతంబు నిష్ఠతో
పుణ్యఫలమటంచు భువిని దిరుగు
చుండు కార్యమందు మెండైన కష్టాలు
పడ్డవాడు కాడు చెడ్డవాడు. 31

ధర్మరక్షణంబె తనభాగ్య మని యెంచి
సద్ధితంబు గూర్చు సత్కృతులిల
నాచరించు వేళ ననుపంబులౌ పాట్లు
పడ్డవాడు కాడు చెడ్డవాడు. 32

అన్నల్దమ్ములు సోదరీమణులుగా నత్యంతమోదంబుతో
నెన్నంగల్గుచు లోకమున్ సకలమం దింపార సర్వేశునిన్
గన్నుల్ విప్పి కనంగబూని శుచియై కామాది షడ్వర్గముం
దన్నం జూచిన భక్తి గల్గు మదికిన్ దత్త్వంబు సుగ్రాహ్యమౌ. 33

వెన్నుని మదిలో నిలుపుచు
సన్నుతులగు సాధుజనుల సంగతి గొనుచున్
మున్నా దుర్గుణరాశిని
దన్నం జూచిననె భక్తి తత్త్వము దెలియున్. 34

పుట్టిన నాటినుండియును బూజ్యులు పెద్దలు తల్లి,తండ్రి నీ
కిట్టివి కూడదంచు వినిపించిన సూక్తులు విస్మరించి చే
పట్టిన రౌరవాదులకు బాటలు వేసెడి కల్మషాల పెం
గట్టలు గల్గువారు పడు కష్టము నబ్జభవుండెరుంగునా. 35

పుట్టుక నొసగిన వారల
నిట్టట్టని బలుకనీక యిడుముల పాలం
బెట్టుచు బొందిన కలుషపు
కట్టలు గలవారి బాధ కంజు డెరుగునా. 36

భవదీయామృతగానం
బవనీతలమందు జాలు ననెనా విధి? యా
దివిజూడ దలచినావా?
భువి వీడితి వేల బాల మురళీకృష్ణా? 37

దివిషన్మునితో దలపడి
భవదీయ గళస్వరాలు పలికించంగా
స్తవనీయ! వాంఛ గలదా,
భువి వీడితి వేల బాల మురళీ కృష్ణా! 38

సతతానందభరాత్ముడై వెలుగుచున్ సన్మార్గసంచారియై
స్తుతి కర్హంబగు కర్మ చేయు ఘనునిన్ శుద్ధస్వభావాన్వితున్
క్షితి సర్వోత్తముగా గణించ వలయున్ క్షిప్రాగ్రహగ్రస్తు నా
మతిహీనాచలభావ పూరుషుని సన్మానింప సంభావ్యమే? 39

అతిదుర్నీతులు లోకమందలమగా నన్యాయకృత్యంబులీ
క్షితిపై నిత్యము విస్తృతంబులగుచున్ చేకూర్చగా క్రౌర్యతన్
వ్రతహీనాత్ములు నిండియున్న జగతిన్ వాదేల తథ్యంబుగా
మతిహీనాచలభావపూరుషుని సన్మానింప సంభావ్యమే. 40 

స్తుతమతులను గీర్తించిన
నతులితయశ మందుకొనెద రటుగాకుండన్ 
క్షితి నెట్లౌదురు దుష్టుని
మతిహీన పురుషు నుతింప మాన్యులు? సుమ్మీ! 41

ముదమును గూల్చి దుండగులు మూర్ఖత మీరగ దుర్మదాంధులై
హృదయముఁ జీల్ప, రత్నములు హేమములున్ గనవచ్చు నంతటన్
సదమలభావనాయుతుల సాధుజనావళి నీయుగంబునన్
సదయుల భారతావనిని శంక యొకింతయు లేదు నిత్యమున్. 42

ఆర్తి యడంగు, మిక్కిలిగ హర్షము గల్గును, సర్వమాన్యమౌ
కీర్తియు వచ్చి చేరునిక క్షిప్రమె సౌఖ్యము లందవచ్చు నీ
కార్తిక మాసమందు శితికంఠుని పూజలు సేయ, బాపమౌ
ధూర్తత ధిక్కరించినను దోషము లెంచిన సత్య మెల్లెడన్. 43

ఆర్తిహరంబగు సత్యము
కార్తికమున శివుని పూజ, గడు బాపమగున్
ధూర్తుండౌచును రుద్రుని
గీర్తించుచునుండువారి క్రియలం గూల్చన్.  44
భూతల భాగ్యశాలి యగు బోటిని నెంపికచేయు స్పర్థలో
భీతిలకుండ దోసలను విస్తృతరీతి భుజించి యెన్నియో
చేతను లెక్కపెట్టుమన క్షిప్రముగా నట నుంచినట్టి కీ
రా తిని, గూడినట్టి చెలి రాతిగ మారె నదేమి చోద్యమో! 45

అనుపమమైన రీతి కడు హర్షము గూర్చెడి కాంక్షతో భువిన్
ఘనతరమైన సద్ధితము కర్మలయందున చూపబూని తా
మనిశము బల్కుచుందు రిక నయ్యది చేకొనలేని దృష్టికిన్
వనితయు గావ్యమున్ జనుల వంతలబెట్టుట సత్యమే కదా 46.

ఘనతరముగ కర్మలలో
ననిశము సద్ధితము బల్కు నతివయు, కావ్యం
బనుచిత మెంచెడి దృష్టికి
వనితయు గవితయు జనులను వంతల బెట్టున్. 47.



వ్యాధింబొందుచు నాంగ్లనామకమహావ్యామోహభూతంబుచే
బాధింపంబడుచుండి తెన్గున సుతున్ భాషింపగా నడ్డుచున్
మేధ:పూర్ణుల మైతి మెల్లగతులన్ మేమన్న నవ్వారికిన్
మాధుర్యం బిసుమంత లేనిది గదా మా యాంధ్ర మీ భూమిపై. 48.

ఆధిగ నాంగ్లా కాంక్షయె
బాధించుచునుండ దీని బలుకుటనైనన్
వ్యాధిగ దలచెడి వారికి
మాధుర్యములేని భాష మన తెలుగు గదా. 49.

బోధించుం గద సద్వివేకపటిమన్ బూజ్యార్హతం గూర్చుచున్
సాధించెన్ గద సద్యశంబు, కనియెన్ సర్వత్ర సద్భావనా
మాధుర్యం, బిసుమంత లేనిది గదా మా యాంధ్ర మీ భూమిపై
బాధం గూర్చెడి తత్త్వ మెల్లగతులం బ్రహ్లాదియై యొప్పుచున్. 50.




No comments:

Post a Comment