Sunday 10 June 2012

శివాజీ

ది. 10.06.2012 వ తేదీ 
"శంకరాభరణం" బ్లాగులో  
"పద్యరచన" శీర్షికన ఇవ్వబడిన చిత్రానికి 
వ్రాసిన పద్యవ్యాఖ్య.
సీ.
స్వారాజ్య నిర్మాణ భవ్యయజ్ఞమునందు
          కర్మఠుడైనట్టి ఘనుడతండు,
కొదమసింగమువోలె ఘోరాహవములందు
          క్రూరుల నణచిన వీరుడతడు,
భారతావని పట్ల భక్తిభావంబును
          తనువున నింపిన ధన్యుడతడు,
జగతికాధారమౌ మగువకు దైవత్వ
          మందజేసినయట్టి యనఘుడతడు
తే.గీ.
"భోన్సలేశుడు" "శివరాజు" పూజ్యుడతడు
"జైభవాని"యటంచును సర్వగతుల
దేశరక్షణ మొనరించి దీప్తిఁ బెంచ
బద్ధకంకణుడైనట్టి భాగ్యశాలి. 
కం.
ఒకనా డేకాంతంబున
సకలామరవంద్యయైన జగదంబిక తా
నకలంకచరితుడు శివా
జికి దర్శన మొసగి పల్కె చేతం బలరన్. 
కం.
వత్సా! విను మీఖడ్గము
నుత్సాహముతోడఁ బూను ముండెద నిందున్
మత్సన్నిధి నీకొసగును
సత్సౌఖ్యజయంబు లింక స్వారాజ్యంబున్.
కం.
పరమాదరమున శివరా
జరమర లేకుండ మ్రొక్కి యంబిక యెదుటన్
స్థిరమతియై దివ్యాసిని
ధరియించెను దీక్షబూని ధన్యుండగుచున్. 


No comments:

Post a Comment