Wednesday 20 June 2012

సమస్యాపూరణం - 2

"శంకరాభరణం" బ్లాగులో 
ప్రతిరోజు ఇవ్వబడే సమస్యలకు చేసిన  
పూరణలు.
తినుచో తియ్యని వేపగింజ మదిలో దీపించు సద్యోగముల్.
అనుచో రాగము మాథురీభరితమై హాయింబ్రసాదించెడున్
వినుచో నిర్మలభావముంచి కథలన్ విందెందునందించెడున్
కనుచో సత్యము సంతసంబులు సదా  కల్గించెడున్, నిత్యమున్
దినుచో తియ్యని వేపగింజ మదిలో దీపించు సద్యోగముల్.  101.

కనుడీ వృక్షము లోకరక్షణమహాకార్యంబు చేబూనుచున్
ఘనతం బొందెను వేపనామకముతో గాఢంపు సత్సౌఖ్యముల్
మనకుం గూర్చుచు, రోగనాశనమగున్ మన్నించి యీపత్రముల్
తినుచో తియ్యని వేపగింజ మదిలో దీపించు సద్యోగముల్.  102.

అఱవమునందు వేమన మహాకవి భాగవతమ్ము జెప్పెగా
కరము శుభావహంబులగు కమ్మని పద్యశతంబు బల్కి యీ
ధరకు హితంబు గూర్చిన బుధాగ్రణి చూడగ కావ్యకర్తగా
దఱవమునందు వేమన మహాకవి,  భాగవతమ్ము జెప్పెగా
వరమగు భక్తితత్పరత భాగ్యవశంబున పోతరాజికన్.  103.

ఫాలలోచనుండు పాపిసుమ్ము
వైభవంబు లొసగి భక్తశేఖరుఁ జేసె
ఫాలలోచనుండు, పాపి సుమ్ము
రావణాసురుండు రాముని పత్నిని
సీతనపహరించి చేటు నందె.   104.

డండడ డడ డండ డండ డండడ డండమ్
దండంబులు నమ్రతతో
జెండాకొనరించ వలయు చేరుడు ఛాత్రుల్
మెండుగ డోలది మ్రోగెడు
డండడ డడ డండ డండ డండడ డండమ్  105.

నరులే కారణము లంక నాశనమునకున్
నిరతము నామస్మరణము
జరుపుచు తన్మతయనంది సమరమునందున్
స్థిరులై నిలిచిన యా వా
నరులే కారణము లంక నాశనమునకున్  106.

స్థిరవిక్రములున్ భ్రాతలు
ధరణీపతి పంక్తిరథుని తనయులు వారల్
వరగుణులున్ రాఘవు లా
నరులే కారణము లంక నాశనమునకున్  107.

రాలను రువ్వు జనులకు వరాల నొసంగున్
శ్రీలక్ష్మీధవుడాహరి/శ్రీలలితా జగదంబిక
వాలిన విశ్వాసముంచి భక్త్యర్ణవముం
దేలుచు తనపై మందా
రాలను రువ్వు జనులకు వరాల నొసంగున్  108.

తనయను సేవింప నొదవుఁ దద్దయు సుఖముల్
అనయము "మాతా" యంచును
మనమున సద్భక్తిఁ బూని మహిమాన్వితయున్
ఘనదురితాపహ నా గిరి
తనయను సేవింప నొదవుఁ దద్దయు సుఖముల్  109.

వార్థిలో మున్గె భానుడు పగటివేళ.
రామచంద్రుండు సద్ధర్మరక్షకుండు
దుష్టు రావణు  వధియించి దురితమడచు
టంత వినువీధి వీక్షించి యపుడు మోద
వార్థిలో మున్గె భానుడు పగటివేళ.  110.

అమృతమందదు తమకని యచట రాహు
వమరపంక్తిని చేరగ హరియది విని
శిరము ఖండించుటను గాంచి కరము మోద
వార్థిలో మున్గె భానుడు పగటివేళ.  111.

వికలాంగుడు రథము నడిపె వినువీధి పయిన్.
ఒక"పర్యాయము" పంగువు"
నకు జెప్పుడు, కృష్ణుడేమి నడిపెను? తారా
దిక మెచ్చటనో? యనగా
వికలాంగుడు, రథము నడిపె, వినువీధి పయిన్.  112.

భోగరక్తుడగు ముముక్షు వెపుడు.
జ్ఞానశూన్యుడైన మానవు డెల్లెడ
భోగరక్తుడగు, ముముక్షువెపుడు
సంగయుక్తుడయ్యు సర్వకాలములందు
చిత్త మెల్ల జేర్చు శివునియందు.    113.

జపము తపములంచు జగతిలో నిత్యంబు
దీప్తు లందు చుండు  దీక్షితుండు
మోక్షమందలేడు మునివరుండైనను
భోగరక్తుడగు ముముక్షు వెపుడు.   114.

గడ్డము గీచుకొమ్మనుచు కాంతుడు భార్యకుఁ జెప్పెఁ బ్రీతితోన్.
అడ్డము, నిల్వుగీతలవి యందముగా రచియించి యాటలన్
దొడ్డగు "దాడి" యాటనిదె తొయ్యలి! యాడెద మింక రమ్ము నే
నొడ్డిగ కొన్నిరేఖలనిటుంచితి, వాటిని యంది నీవు సా
గడ్డము గీచుకొమ్మనుచు కాంతుడు భార్యకుఁ జెప్పెఁ బ్రీతితోన్.  115.
(వాటిని యంది నీవు సాగు, అడ్డము గీచుకొమ్ము- అని అన్వయం)

 భార్య గర్భవతిగా ఉన్నప్పుడు క్షురకర్మను మాని గడ్డం పెంచుకోవడం సంప్రదాయంగా చూస్తుంటాం. అలా గడ్డం పెంచుకున్న భర్త మరియు అతని భార్య ల మధ్య ప్రసవానంతరం జరిగిన సంభాషణ ఇలా ఉంది.
 
బిడ్డనుఁ జూపి పల్కె సతి "విజ్ఞుడ! నీవిటు గర్భరక్షకై

గడ్డము పెంచినావు, సుతు గాంచుము, దీక్షను మానుమింక నీ
గడ్డము గీచుకొమ్మనుచు", కాంతుడు భార్యకుఁ జెప్పెఁ బ్రీతితో
"నడ్డము చెప్పబోను సఖి! యట్టులె చేతు" నటంచు వేగమున్.   116. 

రక్షణమ్ము నొసగు రాక్షసుండు
ఎల్లవేళలందు నింద్రాది దిక్పాలు
రిలకు శుభము(సుఖము)గూర్తు రింపుగాను
నమ్మి గొల్తుమేని నైరృతి కధిపతి
రక్షణమ్ము నొసగు రాక్షసుండు.    117.
(రాక్షసుడు = నైరృతి దిక్పాలకుడు)

పాలిమ్మని సుతుని భర్త పాలికి బంపెన్.
ఆ లలనామణి యాలం
బేలా పసివాని కిప్పుడింపుగను గుణిం
తాలన్ దిద్దించగ బల
పాలిమ్మని సుతుని భర్త పాలికి బంపెన్.   118.

బాణు రాజ్య మొసగు పరమ సుఖము 
శోణపురము నందు శోభిల్లె నెవ్వాని
రాజ్య? మింక దాని రక్షసేయు
శివుని భక్తితోడ సేవింప నేమిచ్చు?
బాణు రాజ్య, మొసగు పరమసుఖము.    119.

తమ్ము గొలిచిన యెడల స్వాంతమ్ము లలరు.
సకలలోకైక మాతయై సర్వజనుల
కమిత వాత్సల్యపూర్ణయై యనవరతము
వరములొసగెడి గౌరిని భక్తితో స
తమ్ము గొలిచిన యెడల స్వాంతమ్ము లలరు.  120.

జాలమే యవరోధమ్ము సాధకులకు.
మౌనధారణ జేయుచు మానితముగ
ముక్తి గోరెడు జనులకు, మునులకైన
నవని నైహికసుఖముల యందు మోహ
 జాలమే యవరోధమ్ము సాధకులకు.  121.

ఇంపుమీరగ సుఖముల నిచ్చునట్టి
భార్య, మురిపించు సంతతి, బంధుజనులు,
క్షణిక మోదము నందించు సకలవస్తు
జాలమే యవరోధమ్ము సాధకులకు.  122.

బిడ్డడా వాడు? రణరంగ భీకరుండు.
దీప్తు లొలుకంగ స్వారాజ్యదీక్షఁ బూని
బాల్యదశయందె ఘనుడు శివాజి యవుర!
చీల్చి చెండాడె మ్లేచ్ఛుల సేన నపుడు
బిడ్డడా వాడు? రణరంగభీకరుండు.   123.

మిస్సనార్యులు గురువులు మేలనంగ(మెచ్చునట్లు)
"బిడ్డడా వాడు రణరంగ భీకరుండ"
నెడు సమస్యకు నిష్ఠతో నేడికెన్నొ
పూరణంబులు పల్కిరి పూజ్యులగుచు.  124. 



మద్యనిషేధచట్టమును మానినులెల్లఁ, తిరస్కరించిరే

సద్యశమందజేయునిక సౌఖ్యములిచ్చును స్వాగతించరే
మద్యనిషేధచట్టమును మానినులెల్లఁ, తిరస్కరించిరే(తిరస్కరించిరి+ఏ)
మద్యము సర్వశక్తులను మంటలగాల్చు, ధనంబు, కీర్తులన్
విద్యను, బంధుభావముల, వేగము గూల్చునొ దాని నెల్లెడన్.   125.



దశరథుడే, వనులకేగెఁ దపసులు మెచ్చన్

వశుడై యుండెను కైకకు
దశరథుడే, వనులకేగెఁ దపసులు మెచ్చన్
భృశమానందము చెందుచు
దశకంఠుని గూల్చువాడు దాశరథియికన్.  126.



ఆలిని త్యజియించెడి పతి హాయిగ నుండున్.
చాలించక పతిదూషణ
మాలించక వృద్ధసేవ లతినిష్ఠురయై(చోరిణియై)
మేలని జగడములాడెడి
యాలిని త్యజియించెడి పతి హాయిగ నుండున్.  127.


కల్ల లాడు వారు కవులు సుమ్ము.

కవియొకండు "నాదు కాంతమోమున కెందు
సాటి గాదు పూర్ణచంద్రు" డనగ
నతివ పల్కె నాథ! యవసరార్థం బెన్నొ
కల్ల లాడు వారు కవులు సుమ్ము.  128.


కవుల కాటరాదు కనుడను వాక్యాలు
కల్ల లాడువారు కవులు సుమ్ము
శబ్దచిత్రణాది సాహిత్యక్రీడల
నద్భుతంబు గొల్ప ననవరతము.  129.

వినుమసత్యములను వేరేమి యనవచ్చు?
అతివలనుటకేమి యాంధ్రమందు?
కావ్యరచన చేయు ఘనుల నేమందురు?  
కల్లలాడువారు (కల్లలు + ఆడువారు) కవులు సుమ్ము.  130.


కడు దరిద్రుడు రాజయోగమ్మునందె. 

జగతిఁ బ్రత్యక్షదైవంబు లగుచు నొప్పు
జన్మదాతల కత్యంత శ్రద్ధతోడ
సేవఁ జేయుచు నంకితభావమునను
కడు దరిద్రుడు రాజయోగమ్మునందె.   
131.

యముఁ గని ముచ్చటంబడి మహాకవి మెచ్చెను గూర్చె సత్కృతిన్

సమరమునందు తానచట శస్త్రముఁ బట్టనటంచుఁ దెల్పి న్యా
యమునిక ధర్మమున్ నిలుప నర్జునసారథియౌచు నెల్లెడన్
భ్రమలను ద్రుంచి కృష్ణుడు శుభంబులు గూర్చగ గోరి చేయు సా
యముఁ గని ముచ్చటంబడి మహాకవి మెచ్చెను గూర్చె సత్కృతిన్  132.


రణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్.   

గణుతిని బెంచు సంఘమున, కావ్యములన్ రచియించు శక్తి, స
ద్గుణముల రాశులిచ్చు, కవికోవిద నామము దెచ్చిపెట్టు స
న్మణినిభమైన పద్యకుసుమాలకు నిష్ఠను బూని చేయు పూ
రణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్.
                                                                                          133.

క్షణికములైన భోగములు కాంతలు, పుత్రులు గాన ముక్తికై
గణపతిఁ గన్నతల్లి పదకంజయుగంబున కెల్లవేళలన్
ప్రణతులు చేసి యంబికను భక్తిఁ స్మరించగ జేయునట్టి ప్రే
రణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్.
                                                                                          134.

కనులు లేనివాడు కన్ను గొట్టె. ( 29.06.2012)

తిరుమలేశుమహిమ లరయుడో జనులార!
మూక మాటలాడె ముదముతోడ
పంగు వద్భుతముగ పరుగులు దీసెను
కనులు లేనివాడు కన్ను గొట్టె.    135.


తులను పట్టునెడల గలుగు సుఖము. (30.06.2012)

నిర్మలాత్ములౌచు నిత్యము జగదంబ
నఖిలభక్తకోటి ననవరతము
కాచు తల్లి నిలను గాంచి మంగళహార
తులను పట్టునెడల గలుగు సుఖము.   136.



శస్త్రసన్యాసమే మేలు క్షత్రియులకు. (01.07.2012)

సత్యధర్మాలు కాపాడి సత్వమొసగి
శాంతిసౌఖ్యాలు స్థాపించి జనులకెపుడు
హర్ష మందించలేకున్న నవనిలోన
శస్త్రసన్యాసమే మేలు క్షత్రియులకు.   137.


దూతను వధించు, టెంతయు నీతియగును(02.07.2012)

చేయ దగినట్టి పని కాదు మాయతోడ
దూతను వధించు, టెంతయు నీతియగును
స్వామికార్యార్థియై వచ్చి సంప్రదించు
వానిఁ జూచుట గౌరవభావమునను.    138.



గురుపత్నిని గోరువాడె గుణవంతు డగున్.(03.07.2012)
గురుసేవయె విద్యార్థికి
పరమార్థముగాన గురుని భావనలేవో
కరుణం దెల్పుడటంచును
గురుపత్నిని గోరువాడె గుణవంతు డగున్.   139.


పితరుని వధించి తినునట్టి సుతుడె హితుడు. (04.07.2012)
కన్నవారిని పనివారిగా దలంచి
దూషణంబులు చేయుచు దుష్టుడగుచు
బాధపెట్టుచు నుండెడివాని కన్న
పితరుని వధించి తినునట్టి సుతుడె హితుడు.   140.




సానిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్. (05.07.2012)

శ్రీనందనందనా! దయ
తో నన్నున్ గావు మనుచు తోరపు భక్తిన్
బూనుచు తిరుమలగిరివా
సా! నిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్.   141.


శ్రీనిధి, జగదంబిక నా
దీనజనావన నతీవదివ్యచరిత్రన్
మానినిఁ బరమేశ్వరు దొర
సానిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్.   142.


పట్టు నాజానుబాహువే ప్రభువు మాకు. (06.07.2012)

రామచంద్రుండు దశరథరాజసుతుడు,
భువనములనెల్ల దయతోడ బ్రోచుకొరకు
సర్వసన్నద్ధుడైయుండి సతతము కను
పట్టు నాజానుబాహువే ప్రభువు మాకు.   143.


శిష్ట రక్షణ కోసము చేతిలోన
ధనువు బాణంబులను దాల్చి, ధరణి కెపుడు
క్షతిని తలపెట్టు దుష్టరాక్షసుల సిగను
బట్టు నాజానుబాహువే ప్రభువు మాకు.   144. 

చిన్న సవరణ కలిగించె వన్నెలెన్నొ.(07.07.2012)
శ్రద్ధ బూనుచు విద్యార్థి సంరచించు
చిత్రమును జూచి కుంచెను చేతబూని
గురువు రంగును సరిచేసె నరయ నతని
చిన్న సవరణ కలిగించె వన్నెలెన్నొ.  145.



వంటఁ జేయలేనివాడు మగడ! (08.07.2012)

క్రొత్తవంటవాని గూర్చి యిట్లనె భార్య
పనికి రాడు వీడు పరమశుంఠ,
తరగలేడు కూర, తాలింపులా రావు,
వంటఁ జేయలేనివాడు మగడ!   146.



తల్లిబాసను రోసిరి పిల్లలెల్ల. (09.07.2012)

విత్తమును గోరి ధర్మంబు విడిచిపెట్టి
సంబరంబున దేశాంతరంబు జేరి
తల్లిదండ్రులె గృహమున దలవనపుడు
తల్లిబాసను రోసిరి పిల్లలెల్ల.   147.


తారతమ్యము లేదు సోదరులమనుచు
ప్రతిన బూనిరి పౌరులు బాల్యమందు
కులము పేరిట దేశాన గొడవలేల?
తల్లి! బాసను రోసిరి పిల్లలెల్ల.    148.


మాట తప్పువాడు మంచివాడు.  (10.07.2012)

స్వార్థపరుడె భువిని పాలకాగ్రణి నేడు
కోట్లు మ్రింగువాడు గొప్పవాడు
బాస చేసినట్టి పనులను చేయక
మాట తప్పువాడు మంచివాడు.  149. 



తండ్రి! నేర్పు విద్య తప్పుగాదె?(11.07.2012)
విశ్వమయుడు సర్వవిద్యాస్వరూపుండు
విష్ణువొకడె, యన్యవిద్యలేల?
దైత్యరాజ! దేవదేవునిఁ గాదని
తండ్రి! నేర్పు విద్య తప్పుగాదె?   150.


శ్రీరాముడు తల్లి యంచు సీతను బిలిచెన్.(13.07.2012)
వారించుచు హనుమంతుడు
కారణజన్ముండు, ప్రభువు ఘనతరశక్తిన్
నీరేజాక్షుడు వచ్చును
శ్రీరాముడు తల్లి! యంచు సీతను బిలిచెన్.  151.


వారించుచు హనుమంతుడు
భూరుహశాఖములనుండి భువనావనుడౌ
కారుణ్యాత్ముడు వచ్చును
శ్రీరాముడు, తల్లి! యంచు సీతను బిలిచెన్. 152.  


పెండ్లి కాని పిల్ల బిడ్డను గనె(13.07.2012)
అతివ యొకతె భువిని అరువదేండ్లకుగూడ
పెండ్లి కాని పిల్ల, బిడ్డను గనె
నరయ చెల్లెలేమొ పరిణయంబాడుచు
యుక్తవయసులోన యోగ్యయనగ.  153.


చెడువానిం గొలువ సిరులు చేకురు మనకున్.(14.07.2012)

ఉడుపతిని శిరముపైనిడి
బడుగుల కడగండ్లు దీర్చ పరమాత్ముండై
పుడమికి సత్వర మేతెం
చెడువానిం గొలువ సిరులు చేకురు మనకున్. 154.


వచ్చినపని సఫలమయ్యె, వైరము హెచ్చెన్. (18.07.2012)

"తెచ్చెను ముద్రిక పవనజు
డిచ్చెను జనకాత్మజాత కిక నాలంకన్
హెచ్చరికగ దహియించెను"
వచ్చినపని సఫలమయ్యె, వైరము హెచ్చెన్.
  155.

ఆంగ్లభాషయుండ, నాంధ్రమేల (21.07.2012)

తెలుగు దేశమందు దేదీప్యమానమై
యాంగ్లభాషయుండ, నాంధ్రమేల
దేశభాషలందు తిరముగా లెస్సయై
పూర్వవైభవంబు పొందగలుగు?                     156.


 కాకర! పూపూచి నిమ్మకాయలు కాచెన్. (26.07.2012)
మూకలుగా రోగంబులు
సోకిన జంబీరతరువు సుందరి! నీవున్
చేకొని సంరక్షించగ
కాకర! పూపూచి నిమ్మకాయలు కాచెన్.   
157.

 నారిని బెండ్లియాడి గహనంబులకేగెను, సీత ప్రేమతో(17.9.12)
వారిజనేత్రఁ గోమలిని వైభవమొప్పగ రామభూవిభుం
డా రమణీలలామ జనకాత్మజ నెంతయు సుందరాంగియౌ

నారిని బెండ్లియాడి గహనంబులకేగెను, సీత ప్రేమతో
నా రఘునాథువెంట సుఖమంచును కానలకేగె నక్కటా!   158


రమణీ! రమ్మనెను సీత రాముని గనుచున్.(05.10.12)
రమణీయగుణాభరణా!
కమలాయతనేత్ర! నాథ! ఘనతరకీర్తీ!
మమతాపూర్ణా! రఘువీ
రమణీ! రమ్మనెను సీత రాముని గనుచున్. 159


 వక్త్రంబుల్ పది గలిగిన వానికి జేజే.(06.10.12)
దిక్త్రాసము గలిగింతువ?
ధిక్, త్రుంచెద నిన్నటంచు దితిసుతునిమెడన్
యోక్త్రంబు వేసి లాగెడు

వక్త్రంబుల్ పది గలిగిన వానికి జేజే.  160.


కుంతికి నైదుగురు సతలు గుణసంపన్నుల్.  (09.10.2012)
పంతులు గారడుగంగా
సుంతైనను జంకులేక సునిలకుమారుం
డెంతయు తడబడ కిట్లనె

కుంతికి నైదుగురు సతలు గుణసంపన్నుల్.  161



పితృదేవుల పూజసేయ పెనుపడు, నిడుముల్(15-10-2012)
క్షితిలో సుఖసంపత్తులు
పితృదేవుల పూజసేయ పెనుపడు, నిడుముల్
గతిలేక పారిపోవును
సతతము సంతసము గలుగు సత్వము హెచ్చున్.  162.


పతిని బాధపెట్టు వనిత సాధ్వి (16-10-2012)
అతిథిసేవ చేయు డమితానురాగాన
దీనజనుల జేరదీయుచుండి
మంచి మనసుతోడ మాటలాడుడటంచు
పతిని బాధపెట్టు వనిత సాధ్వి  163.

  
వధానము చేయువార లల్పులుగాదే(20.10.2012)
స్తవనీయులు దీక్షితులై
యవధానము చేయువార లల్పులుగాదే
యవధానుల శ్రమ నెరుగక
కువిమర్శలు చేయువారు కుంభినిలోనన్  164.



దయ్యమె దైవమును, చంపి ధరపై వెలసెన్(21.10.2012)
అయ్యా! నిజముగ జూచిన
దయ్యమె దైవమును, చంపి ధరపై వెలసెన్
కయ్యాలమారి యసురుల,
నెయ్యంబును నింపి గూర్చ నిత్యసుఖంబుల్.  165.


కీచకుడు పెండ్లియాడె లంకిణిని మెచ్చి. (22-10-2012)
అజ్ఞాతవాసాన నలనాడు కృష్ణను
కాంక్షించె నెవ్వాడు కామమునను?
పరమభక్తుడు జాంబవంతుడర్పించిన
కన్యకామణినంది కమలనాభు
డేమి చేసెను? లంక కినుమడించిన శక్తి
నెవరిని తాటించి యేగె హనుమ?
దశకంఠు నెంతయో దయజూచి దీవెన
లిచ్చె నెందులకప్పు డీశ్వరుండు?

ఛాత్రగణములు మీరలాసక్తు లగుచు
చెప్పుడని యన్న క్రమముగా నొప్పుమీర
ఉత్తరంబులు కాగల వుత్తమముగ
కీచకుడు, పెండ్లియాడె, లంకిణిని, మెచ్చి. 166.


అష్టమి శ్రేష్ఠమ్ము, పనుల నారంింపన్(23.10.2012)
దుష్టాంతక నుమ గొలుచుట
కష్టమి శ్రేష్ఠమ్ము, పనుల నారంింపన్
శిష్టాదిసకలజనులకు
నిష్టం బా విజయదశమి యిలలో నెపుడున్.  167.


తల్లికిఁ దనయకును, ధవుఁ డొకండె(05.11.2012)
యాత్రయందు జూడ నలసట కలిగెను
తల్లికిఁ దనయకును, ధవుఁ డొకండె
ప్రతిదినంబు చేయు వ్యాయామశక్తిచే
విశ్రమింతు ననక వెళ్ళుచుండె   168.


 సిగరెట్టుల గాల్చదగును సేమము కొరకున్(09.11.2012)
పొగ త్రాగుట దుష్కృత్యం
బగణిత రుగ్మతల గూర్చు హానిద మటపై
వగ గలిగించును, ప్రోవిడి
సిగరెట్టుల గాల్చదగును సేమము కొరకున్ 169.


 తనయునకును దండ్రికొకతె దారగ నయ్యెన్.(10.11.2012)
ఘనముగ నాగార్జునునకు
సినిమాలో సుందరాంగి శ్రీదేవి యిటుల్
మునుపా నాగేశ్వరునకు
తనయునకును దండ్రికొకతె దారగ నయ్యెన్.  170.



కారాగారమ్ము లొసగు కైవల్యమ్మున్(11.11.2012)
శ్రీరమణుడు వేంకటపతి
ఘోరాఘము లణచివేసి కోరికలెల్లన్
తీరగ వరమిడు, ద్రుంచును
కారాగారమ్ము, లొసగు కైవల్యమ్మున్  171.


 మమ్మీ సంస్కృతి యోగసాధకులకున్ మార్గమ్ముజూపున్ గదా. (12.11.2012)
అమ్మా! కావు మటంచు శుద్ధమతులై యత్యంతనమ్రాంగులై
సమ్మోదంబున లోకపావని శివన్ సద్భక్తి బూజించుచున్
నమ్మంగా గరుణించు, గూర్చును మహానందంబు చూడంగ సే
మమ్మీ సంస్కృతి యోగసాధకులకున్ మార్గమ్ముజూపున్ గదా.  172.


తిమిరమును పాఱఁదోలదు దీపపంక్తి(13.11.2012)
తిమిరమును పాఱఁదోలదు దీపపంక్తి
 యనుట తగునేమి? యరయంగ ననవరతము
బ్రహ్మరూపాన హృదులలో వాసముండి
తమము హరియించు చుండంగ ధరణిలోన   173.  



ధనువే సాధ్వి కరంబునందలరె నత్యంతోగ్రసర్పాకృతిన్.  (14.11.2012)
మునుపా మాంత్రికు డొక్కరుండు సభలో మోదంబునుం గూర్చుచున్
తనశక్తిన్ బ్రకటించుచున్ క్రమముగా దండంబు సారించుచున్
వనితారత్నము చేతిలోని ధనువున్ బల్మారు మంత్రించగా
ధనువే సాధ్వి కరంబునందలరె నత్యంతోగ్రసర్పాకృతిన్.  174.


  హాయిగా గ్రోలరారె యాంధ్రామృతమ్ము.(16.11.2012
యతులు, ప్రాసలు, ఛందంబు లద్భుతమగు
గుణములను గూడి మథురమౌ ఫణుతులంది
చిత్తవికసన మొనరించు, సిరులు పంచు
హాయిగా గ్రోలరారె యాంధ్రామృతమ్ము.   175.

విశ్వజనులార! కవులార! విజ్ఞులార!
పరమహితులైన సాహితీ బంధులార!
జాగుసేయగ నికనేల? సత్వరముగ
హాయిగా గ్రోలరారె యాంధ్రామృతమ్ము. 176.

అన్యభాషలపై మోజు నధికముగను
దాల్చగానేల? సరళమై తథ్యముగను
"దేశభాషల లెస్స"యీ తెలుగు గాన
హాయిగా గ్రోలరారె యాంధ్రామృతమ్ము.   177.

కులము, మతములు, గోత్రాలు తలపకుండ
పిన్న పెద్దల భేదాల నెన్నకుండ
మంచి పలుకుల బ్రేమను బంచు చుండు
హాయిగా గ్రోలరారె యాంధ్రామృతమ్ము. 178.

జనుల నొకత్రాట నిలబెట్టి యనుపమగతి
నైకమత్యము బోధించు హర్షమునను
తెలుగునకు సాటి వేరొండు కలదె యెందు?
హాయిగా గ్రోలరారె యాంధ్రామృతమ్ము. 179.


ధునిఁ గొలిచినఁ దొలఁగు సకల దుఃఖచయంబుల్.(28.12.2012)
జనగణసకలాఘంబుల
ననయము హరియించుచుండి యచ్ఛజలాలన్
మనకందించెడి యాస్వ

ర్ధుని గొలిచిన దొలగు సకలదు:ఖచయంబుల్.  


తలబాష్పంబులు భీషణాస్త్రచయమై దండించు దుర్మార్గులన్.
(29.12.2012)  
కులకాంతన్, పరదార, నేకవసనన్ ఘోరాతిఘోరంబుగా
ఖలముం బూని పరాభవించ వలదో కౌరవ్య! యంచాడినన్
బలవంతంబుగ నీడ్చి గాదె యడగెన్ పాపాత్ముడానాడు, కాం
తలబాష్పంబులు భీషణాస్త్రచయమై దండించు దుర్మార్గులన్. 181.


 ఎవఁడో యెవ్వఁడొ యెవ్వఁడో యెవఁడొ తా నెవ్వాఁడొకో యెవ్వఁడో.(30.12.12)
భవబంధంబు విచిత్రమైన దకటా! భాగ్యంబులున్, పుత్రులున్,
నవలాసంగము, బంధుమోహము, సదా నాదన్నభావంబు లీ
భువిపై దేహికి ప్రాణముండువరకే పోకాడినన్నిల్పువా

డెవడో యెవ్వడొ యెవ్వడో యెవడొ తానెవ్వాడొకో యెవ్వడో  182.


 శివనామము "చేదు నరుల జిహ్వల కెపుడున్ (31-12-13)
భవసాగరతారకమగు
శివనామము "చేదు నరుల జిహ్వల కెపుడున్
శ్రవణకఠోరం" బనియెడు
ప్రవచనములు కల్లగాదె భావనకైనన్.                      183.



 హ్యాపీ న్యూయియరటన్న నాగ్రహ మొందెన్. (01-01-2013)
ఆపండితు డాంధ్రంబున
నే పలుకుడు ఛాత్రులార! యికపై ననగా
శ్రీపతి యనియెడి బాలుడు
హ్యాపీ న్యూయియరటన్న నాగ్రహ మొందెన్.             184.


ధర! నీపాదమె నౌక యంచు దలతున్ దండంబు నే బెట్టుదున్.
                                                                              (02-12-13) 
కరిచర్మాంబర! చంద్రశేఖర! హరా! కైవల్యసంధాయకా!
కరుణాసాగర! భక్తరక్షణపరా! గౌరీపతీ! సంసృతీ

తరణం బంద సహాయ మొక్కటె యగున్ ధాత్రిన్ త్రిశూలీ! జటా
ధర! నీపాదమె నౌక యంచు దలతున్ దండంబు నే బెట్టుదున్.185.  
  
కంటికింపు గొలుపు గానసుధలు. (03-12-13)
అఘము చీల్చు నట్టి యభిషేక మటపైన
బిల్వపత్రపూజ ప్రియము మరియు
భవ్యభక్తిభావ భరితంబులైన ము

క్కంటి కింపు గొలుపు గానసుధలు.  186.


మన్నించుము నా యజ్ఞత
నన్నింటను నీవె కలవు హరి! కావుమయా
నన్నంచు వేడుచుండిన

నున్నది కన్పట్టునొక్కొ యోగివరేణ్యా!(04.01.13)  187.


కాలుండై విల్లందుచు
నాలస్యము చేయకుండ నసురాంతకుడై
లీలన్ గిరిజాతనయుడు

బాలుడు భండనమునందు వైరుల గూల్చెన్.(05.01.13) 188.


స్వామికార్యార్థమై కొంతసమయ మపుడు
ప్రియుడు దేశాంతరంబేగు విధము తెలిసి
కలుగబోయెడి విరహంబు దలచు సతికి

నుంగరమ్మె యొడ్డాణమై యొప్పెనుగద.  (06.01.13)  189.



రంగా! కరుణాసాగర!
మంగేశ్వర! కావుమయ్య మమ్మెపుడని సా
ష్టాంగనతులతోడ పలుతె
రంగుల పూజింతు రెల్ల ప్రాంతము లందున్.(07.01.13) 190.


అది చిన్నారులు తెల్గువారలొకటై యాంధ్రోత్సవం బొక్కచో (08.1.13) ముదమారంగ నొనర్చునట్టి సభ, నమ్ముండా సభాధ్యక్షు డా
పద సృష్టించుచు నాంగ్లభాష గొని సంభాషించుచున్నాడు తా
నది విన్నన్ కనినంత మండు నొడలత్యంతాగ్రహోదగ్రతన్.  191.


వాడవాడల హర్షదీప్తియు, వైభవంబులు కూర్చుచున్   (12-01-2013)
 వాడు వీడను భేదముంచక భాగ్యరేఖలు పంచి కా
పాడు వాడయి వేంకటేశుడు వాసముండగ నెల్లెడన్
మూడుపూవులు నారుకాయలు ముప్పదారగు ముచ్చటల్.  192. 


మకరరాశికి సూర్యుండు మహిత తేజు   జనవరి 13, 2013 
డరుగుదెంచుచు నుండంగ నమితభక్తి
మెలగు చుందుము రమ్మింక తొలగద్రోచి
సంకటంబుల, సంక్రాంతి! స్వాగతంబు.
        193.

మెండుగ నూత్నవస్త్రములు, మిక్కిలి రుచ్యములైన వంటకా
ల్దండిగ నాటపాటలని తథ్యము పిల్లల కెల్లవేళలన్
పండువులన్న సంబరము, బామ్మకు తాతకె ముచ్చటల్ గదా
నిండుమనంబుతో "శుభము నీకగు" నంచు వచించుటెల్లెడన్.
194.

వినుడొక మరదలు "దోబూ
చ"నుచుం దాగుచు బిలుచుచు హాస్యంబుననీ
మనిషెవ్వరు చెప్పగవలె
కనుమ! యనుచు బావగారి కనులను మూసెన్.195.
 
చేరి యొక్కచోట స్నేహితులిద్దరు
బొంకుచుండి యొకడు పూజలన్న
మరణతుల్యమనగ మరియొక డిట్లనె
కనుమనాటి పూజ కాటి జేర్చె. 196.

నయము భయములేక నాస్తికు డొక్కండు
పలుకుచుండె నిట్లు పాపమొదవు
దైవపూజవలన తథ్యంబు ప్రజలార!  
కనుమనాటిపూజ కాటి జేర్చె  197.                    జనవరి 16, 2013  

 
స్నేహధర్మంబు పాటించి వ్యూహమూని
రమ్యగుణధామ! శ్రీరఘురామ! నీవు

వానరాధిపుడైనట్టి వాలి నఘస
హితమతిని గూల్చితే దేవ! శ్రితహితైషి 198.  జనవరి 22, 2013 

  ఐంద్రజాలికు డొక్కరు డద్భుతములు
చూపుచుండంగ నవ్వేళ చోద్యమేమొ
చిమ్మచీకట్లు దిశలందు కమ్ముకొనగ
నుత్తరమ్మున జరిగె సూర్యోదయమ్ము.
199. జనవరి 23, 2013 

మేలు మిఠాయీ లయ్యవి
బోలెడు రూపములనున్న భోజ్యములగుటన్
కేలం గైకొని యందొక
తేలును ముద్దాడి మగువ తియ్యగ నవ్వెన్.200.

200. జనవరి 24, 2013





 

No comments:

Post a Comment