Friday 22 June 2012

పద్యరచన - 28, 29, 31 & 34




ది. 21.06.2012 వ తేదీ "శంకరాభరణం" బ్లాగులో 
"పద్యరచన" శీర్షికన ఇవ్వబడిన చిత్రానికి 
పద్యవ్యాఖ్య.

ఉ.
ఓ కలహంసమా! వినుమ, ఒప్పుగ నేడు మహోపకారమున్
నాకు నొనర్చితీవుగద, నన్ను సఖీమణిగా మనంబునన్
జేకొని, నాదు సమ్మతిని చేర్చు నరేంద్రుని కిప్పుడే తగన్
నీకొనరింతు వందనము నీవికఁ జూపుము మాకు సంగతిన్.
ఉ.
ఆ రమణీయరూపసుగుణాన్వితు నా యసమానవిక్రమున్
గోరితి నాథుగా నికను కోరిక దీర్చుము, రాజశేఖరున్
చేరగ బంపు మిచ్చటకు శీఘ్రమె, నాకు స్వయంవరంబు తాఁ
గూరిమి నిండ తండ్రియిదె గూర్చును, రాదగు దానికాతడున్. 
 ***

ది. 22.06.2012 వ తేదీ "శంకరాభరణం" బ్లాగులో 
"పద్యరచన" శీర్షికన ఇవ్వబడిన చిత్రానికి 
పద్యవ్యాఖ్య.




 

సీ.
ఆయుధంబును బూన నర్జున! నేనంచు
          పల్కి యుండియు నాదు భాగ్యమేమొ,
నన్నుఁ జంపగఁ బూని నవనవోత్సాహియై
          యీరీతి భగవాను డేగుదెంచె
విశ్వభారకుడౌచు వెలుగొందు చుండెడి
          దేవాధిదేవుడీ దివ్యమూర్తి
నీలమేఘాభుడై నిఖిలావనుండౌచు
          చక్రంబు చేపట్టి విక్రమించి
తే.గీ.
వేగ మిదెవచ్చెనంచును భీష్ముడపుడు
తన్మయత్వాన కృష్ణునిఁ దలచుచుండి
ఆయుధంబులు త్యజియించి యవనతుడయి
ప్రణతులర్పించి నిలిచెను భక్తితోడ.
కం.
ఒకభక్తునిఁ గాచుటకై
యొకభక్తుని మీదకురికె నుత్సాహముతో
సకలము తానగు దేవుం
డకటా! యని చూచి రమరు లాదృశ్యంబున్. 



ది. 24.06.2012 వ తేదీ "శంకరాభరణం" బ్లాగులో 
"పద్యరచన" శీర్షికన ఇవ్వబడిన చిత్రానికి 
పద్యవ్యాఖ్య.

ఉదయభానుని ఫలమని మదిదలంచి
చేరి దానిని భక్షింప గోరి యపుడు
వాయు వేగాన నేగెడు బాలుడైన
అంజనాసుతు నెల్లప్పు డంజలింతు.

శ్రీ వాయుపుత్రా! ప్రభూ! ఆంజనేయా! మహద్దివ్యచారిత్ర! వీరాధివీరా! శుభాకార! శ్రీరామభక్తాగ్రగణ్యా! దశగ్రీవవంశాంతకా!లోక పూజ్యా! మహాత్మా! పరాకేలనయ్యా! మొరాలించవయ్యా! సమస్తాఘసంఘంబులంద్రుంచి శీఘ్రంబె కావంగ రావయ్య! నీయద్భుతంబైన చారిత్రమున్ భక్తితో బాడగా సర్వసౌభాగ్యముల్ గల్గు సందేహ మొక్కింత లేదయ్య! నిన్భక్తితో గొల్చు భాగ్యంబు గల్గించి రక్షించుచుం, దల్లివై ప్రేమనందించుచుం, దండ్రివై గాచుచున్, మిత్రరూపంబునం జేరి సన్మార్గముం జూపుచున్, భ్రాతవై ధైర్యముం బెంచి కాపాడవయ్యా! సదా నిన్ను ధ్యానింతు, పూజింతునయ్యా! కథాలాపముల్ జేతునయ్యా! మదీయాంతరంగంబు నందున్న దుర్బుద్ధులన్ ద్రుంచి, సద్భావసంపత్తులం జేర్చుమా, సాధుసంగంబులం గూర్చుమా, సర్వదా నీపదాబ్జాతముం దాకి యర్చించు సౌఖ్యంబు గల్పించి, నీయందు సద్భక్తి గల్గించవయ్యా! సదా సర్వదు:ఖాపహారీ! మహాకాయ! శ్రీరామభక్తాంజనేయా! నమస్తే నమస్తే నమస్తే నమ:| 


ది. 27.06.2012 వ తేదీ "శంకరాభరణం" బ్లాగులో 
"పద్యరచన" శీర్షికన ఇవ్వబడిన చిత్రానికి 
పద్యవ్యాఖ్య.
 


అద్భుతంబుగ పురివిప్పి యాడబూని
వనమయూరంబు భాసిల్లు వైభవముగ
భావములు పొంగు మదినుండి భవ్యమైన
కవిత లేర్పడు దానిని గాంతు మేని.

పింఛమునఁ జూడ కన్నులు విస్తృతముగ
నమర నందంబు లొలుకుచు నా మయూర
మెదురుగా నున్న సకియతో నీ విధముగ
ముచ్చటించుచు నుండె ప్రమోదమునను.

హృదయ మలరెను, యొడలెల్ల ముదముతోడ
పులకరించెను, జలదంబు పలుకరించె
మందమారుత మదివీచె సుందరముగ
రమ్ము విహరింతు మోసఖి! రమ్యభూమి.  


ది. 07.07.2012 వ తేదీ "శంకరాభరణం" బ్లాగులో 
"పద్యరచన" శీర్షికన ఇవ్వబడిన చిత్రానికి 
పద్యవ్యాఖ్య.
 

ముసిముసి నగవులతో నీ
పసిబిడ్డ వెలుంగు చుండె భాగ్యాంబుధియై
వసుధన్ యశముల నందుచు
వసియించి సుఖించు గాత! వత్సరశతముల్. 





భక్తితో జేరి నినుగొల్చువారి కెపుడు
భద్రములు గూర్చి కోరిన వరములిచ్చి
కాచుచుందువు జగదంబ! కరుణతోడ
ప్రణతులొనరింతు గొనుమమ్మ భద్రకాళి!


No comments:

Post a Comment