Monday 24 March 2014

మతసహనం

బంగార మేరీతి సింగార మొలికించు
          నగల యాకృతి నందు జగతిలోన,

క్షీరమేరీతిగా ధారుణీతలమందు
          బహురూపముల దృప్తి పరచుచుండు,

మృత్తు తానేరీతి మేదినీస్థలిలోన
          వివిధాకృతులలోన విశదమగును,

శిలయు నేరీతిగా పలురూపములు పొంది
          పూజింపబడుచుండు పుడమిలోన

నట్లె విశ్వంబు సృజియించి, యవనివారి
కఖిల సౌఖ్యంబు లందించి యనవరతము
రక్ష చేసెడి భగవాను డీక్షితిపయి
యెన్ని రూపంబు లందునో యెరుగ దరమె.           1.


రాముడై యొకసారి కామితంబుల దీర్చు,
          కృష్ణుడై ధరవారి తృష్ణ లణచు,

హనుమ తానేయౌచు నద్భుతం బొనరించు
          వేంకటేశ్వరుడౌచు సంకటములు

హరియించి భక్తాళి కరుసమందించును,
          లింగరూపంబులో సంగతముగ

శంకరుండై వెల్గు సజ్జనావనుడౌచు
          నాల్గుమోములు దాల్చి నలువయౌను,

శక్తిరూపంబులో నుండు, భక్తులైన
సాధుజనముల పాలిటి సర్వగతుల
నండయై నిల్చి ధైర్యంబు నందజేసి
ధర్మ రక్షణ చేసి యీ ధరణి గాచు.                     2.


కరుణామయుండౌచు నిరతసౌఖ్యంబు లీ
          జగతికందించును, సత్త్వమూని

శిలువనైననుగాని చెదరకుండగ మోయు
          క్రీస్తురూపంబుతో రేలుబవలు,

తానె యల్లాయౌచు తనను గొల్చెడివారి
          పాతకంబుల ద్రుంచి బహుళగతుల

బ్రోచువాడై సర్వభోగంబు లందించి
          దయజూచు సర్వదా ధరణి జనుల

మందిరంబులలోనుండు, మస్జిదులను,
చర్చి యనియెడి ప్రాంతాన సన్నుతిగన
వాసముండును భువిలోన వైభవముగ
నన్నిరూపంబులును దానె యగుచునుండి.          3.


హరియనుచును, హరయనుచును
సురుచిరముగ క్రీస్తటంచు సుందరఫణితిన్
నిరతం బల్లా యనుచును
స్మరియించెడివారి కొసగు సర్వార్ధంబుల్.             4.


భావానుగుణ్య రూపం
బేవేళను బొంది బ్రోచు నిలవారల నా
దేవాధిదేవు డెల్లెడ
జీవులలో జేరియుండి శ్రీప్రదుడగుచున్               5.


ఎవ్వార లెట్టిరూపము
నెవ్విధమున గొల్వ బలికి, యింపలరంగా
నవ్వారికి సుఖసంతతు
లివ్వంగా బూనుచుండు నీశ్వరుడు దయన్           6.


తనమతము గొప్పదంచును
ఘనతర దర్పంబుతోడ కలుషాత్ముండై
యనుచితముగ పరనిందలు
మనుజుం డొనరింపరాదు మదమత్తుండై              7.


పరమతనిందాసక్తుని
కరుణాత్ముండయ్యు ప్రభుడు కలుషోదధిలో
చిరకాలము పడద్రోయును
నరులీ సత్యంబు తెలిసి నడువగ వలయున్          8.


పరమత సహనము జూపెడి
నరు డిహమున వలసినట్టి నానార్థంబుల్
స్థిరయశము లంది మీదట
పరసుఖములు పడయగలడు పరమాత్ముకృపన్.  9.


ఔరా! ముస్లిము వనితలు
శ్రీరాముని గొల్వబూని చేరిరి యిచటన్
వీరల కారఘురాముడు
కారుణ్యము జూపి దీర్చు కామితము లికన్            10.


మహ్మదీయాంగనామణుల్ మహితగుణుని
రామచంద్రుని పూజించ నీమమొప్ప
చేరు తీరిది స్పష్టంబు చేయుచుండె
మానవులలో పరమతాభిమానదీప్తి.                    11.

No comments:

Post a Comment