Friday 14 March 2014

చిన్ని కృష్ణ


అన్నివేళలందు నత్యంత వాత్సల్య
పూర్ణ మానసమున పుడమి జనుల
గాచునట్టి దేవ! కంసారి! కేశవా!
నిద్రనున్న కృష్ణ! నిన్ను గొలుతు.               1
.

పొట్టలోన సకల భువనంబులం దాచి
చిన్నవాడ వౌచు నెన్నదగిన
మహిమలెన్నొ చూపి మముగావగా బూను
చిన్ని కృష్ణ! నీకు చేతునతులు.                   2.


క్రోధమేల మీకు? బాధచెందగనేల?
శాంతమూని మనుడు జనులటంచు
తెలుపగోరి యిట్లు స్థిరమానసంబుతో
నిద్రబోవు కృష్ణ! నిన్ను గొలుతు.                   3.


జగతి నేలునట్టి సర్వేశ్వరుండవై
బాలుపగిది మారి లీలజూపి
యోగనిద్రబోవు యోగేశ్వరా! కృష్ణ!
వెన్నదొంగ! నిన్ను సన్నుతింతు.                  4.


స్తుతుల కందబోవు, మతులతో యోచింప
చిక్కబోవు నిన్ను చేరుటెట్లు?
శుద్ధమానసమున జోడింతు కరములు
వాసుదేవ! కొనుము వందనంబు.                   5.

No comments:

Post a Comment