శ్రీరామ శ్రీగణేశాయ నమః శ్రీసరస్వత్యై నమః
ఓం నమశ్శివాయ
శ్రీగురుభ్యో నమః మాతాపితృభ్యో నమః
శ్రీ పార్వతీ పరమేశ్వర శతకము
(మత్తకోకిలలు, తరలములు)
శ్రీలొసంగగ పెద్దవేగిని చేరియుండిన
శంకరా!
జాలమేలయ భక్తకోటిని సాకుకార్యము
చేయగా
వేళకాదని చూచుచుంటివ విశ్వనాథుడ
వౌచు నో
ఫాలలోచన! సన్నుతించెద
పార్వతీపరమేశ్వరా! 1.
నీమ మించుక లేనివాడను నిర్మలత్వపు
ఛాయలన్
ప్రేమ జూపుట నేర్వకుంటిని
వెర్రివానిగ నీయెడన్
క్షేమదాయక! జ్ఞానశూన్యుడ చేర్చి
తండ్రిగ జూచుచున్
పామరున్ నను గావు మయ్యరొ పార్వతీ
పరమేశ్వరా! 2.
యోగ్యతావిధి నేర్వకుంటిని
యొప్పుతప్పులరీతి యా
రోగ్యదాయకకర్మ లేవియొ రుద్ర!
యెంచగలేమిచే
వాగ్యశంబును పొందకుంటిని
వత్సలత్వము జూపుచున్
భాగ్యదాత వనుగ్రహింపుము
పార్వతీపరమేశ్వరా! 3.
జీవితంబు నొసంగినాడవు శ్రీయుతంబుగ
దానిన్
భావిసౌఖ్యములందజేసి యపారమోదము
గూర్చుచున్
దేవ! నిల్పితి వీజగంబున దీని
కన్నిట సత్కృపన్
పావనత్వము కూర్చుమో శివ!
పార్వతీపరమేశ్వరా! 4.
నీవదాన్యత, నీప్రసన్నత, నీమహత్వము
దీప్తులున్
సేవకాళికి నీవు పంచెడి చిత్సుఖంబుల
నెల్లెడన్
దేవదేవ! యెరుంగ జేయగ దీక్షబూనితి
నాకిటన్
భావమందున శక్తి నీయుము
పార్వతీపరమేశ్వరా! 5.
కోపతాపము లెక్కువైనవి క్షుద్రభావన
లాత్మలో
జూపుచున్నవి స్వాధికారము శోకమున్
గలిగించున
ట్లేపనుల్ సమకూడకుండిన వీస్థితిన్ దరిచేరు నా
పాపముల్ తొలగించి కావుము
పార్వతీపరమేశ్వరా! 6.
చింతచేయుచు నెల్లవేళల శ్రీలు
గోరుచు చిత్తమం
దంత మందని కాంక్షతోడను హానులందున
మున్గితిన్
సంతసంబులు గూలి పోవగ
సర్వకార్యములందునన్
వంతలన్ సమకూర్చ బోకుము
పార్వతీపరమేశ్వరా! 7.
వారు వీరను భేదభావము స్వాంతమందున
నిల్పకే
చేరి కొల్చెడి వారియందున
శీఘ్రతోషుడ వౌచు మీ
కోరికల్ నెరవేర్తు నంచును కూర్మి
జూపెడి వాడవై
పారవశ్యము నందుచుందువు
పార్వతీపరమేశ్వరా! 8.
మానవత్వము సన్నగిల్లెను
మానవాళిమనంబులన్
దానవత్వపు ఛాయ లెల్లెడ దార్ఢ్యతన్
గొని యుండగా
దీనమానసు లైన వారల తేజమున్
హరియించు నీ
వైనమున్ గనుమయ్య! శంకర!
పార్వతీపరమేశ్వరా! 9.
శ్రీకరుండవు, ధీప్రదుండవు, చిన్మయుండవు
సర్వమున్
సాకువాడవు, ద్రుంచువాడవు, సవ్యరీతిని
జన్మముల్
చేకొనంగను జేయువాడవు స్వీకరింపుము
సన్నుతుల్
ప్రాకటోన్నతసత్కృపాస్థిర!
పార్వతీపరమేశ్వరా! 10.
నీది భారము చంద్రశేఖర!
నిర్మలత్వపుదీప్తులన్
మోదమందెడి రీతి నీయెడ మోక్షసాధకమౌ గతిన్
నాదసన్నుత! చూపగావలె నాగభూషణ!
మ్రొక్కెదన్
వైదికోన్నతి నిల్పు దైవమ!
పార్వతీపరమేశ్వరా! 11.
పార్థసారథి గొల్చుచుండెడి వామదేవ!
నమస్కృతుల్
సార్థకత్వము నాభవంబున సంఘటించగ
జేయుమా,
వ్యర్థమై భువి రాలకుండెడి వైనముం
దయ జూపుమా,
స్వార్థభావము గూల్చివేయుము
పార్వతీపరమేశ్వరా! 12.
ఆస్తిపాస్తుల మాయలో బడి
యార్యసన్నుత! ద్వేషముల్
విస్తృతంబుగ దాల్చుచుండెను
విజ్ఞతల్ విడనాడుచున్
సుస్తిలో బడిపోవుచుండెను చూడ మానవు
డీయెడన్
వాస్తవంబును దెల్పి ప్రోవుము
పార్వతీపరమేశ్వరా! 13.
సచ్చరిత్రులు భక్తకోటులు
సాధుపుంగవు లెందరో
నిచ్చలున్ భవదీయనామము నిష్ఠగా
జపియించు వా
రచ్చపున్ మనమున్నవారిదె యార్య!
నిన్నిట గొల్వగా
వచ్చి యుండిరి చూడు మోహర!
పార్వతీపరమేశ్వరా! 14.
సుందరాశయ! సర్పభూషణ! శ్రోత్రియామయనాశకా!
చందనాగరుపుష్పమాలలు సాంబ! నీకిపు
డిచ్చటన్
స్యందనమ్మును గూర్చకున్నను
శ్రద్ధతోఘటియించెదన్
వందనమ్మిది స్వీకరింపుము
పార్వతీపరమేశ్వరా! 15.
విస్తృతంబుగ ధాన్యరాశులు విత్తముల్
మణిభూషలున్
నిస్తులంబగు కీర్తు
లాయతనిత్యవైభవదీప్తులున్
వస్తుసంతతి యిమ్మనన్ సితికంఠ!
నిన్నిట గోరెదన్
వాస్తవంబగు హర్ష మిమ్మని
పార్వతీపరమేశ్వరా! 16.
నీలకంఠ! వరమ్ము లిమ్మని నిత్య
మాయతకాంక్షతో
గోలచేయుచు నున్నవాడను కోపగించక
ప్రేమతో
మేలు గూర్చెడి త్రోవజూపు
మమేయహర్షద! మ్రొక్కెదన్
బాలు డంచును బ్రోవు మోహర!
పార్వతీపరమేశ్వరా! 17.
జ్ఞానశూన్యుడ సభ్యతాస్థితి
సాధుభావపు లేమిచే
నేనఘంబుల తాడనంబున
నిత్యకష్టములందుచున్
గానకుంటిని హర్షదీప్తిని గాన
చెంతకు జేర్చి నీ
వాని నేగతి గావగాదగు
పార్వతీపరమేశ్వరా! 18.
విస్మయం బదిగల్గు నీవిట విస్తృతాఘము
చేసినన్
ఘస్మరుండయి సంచరించిన గాని నిన్ను
స్మరించగా
నస్మదీయు డటంచు బ్రోచెద వందజేయుచు
జ్ఞానమున్
భస్మలేపన! ఫాలలోచన!
పార్వతీపరమేశ్వరా! 19.
అండవై నిను గొల్చువారల నన్నివేళల
గాంచుచున్
మెండుగా సిరులిచ్చి సౌఖ్యము
మేదినీస్థలి గీర్తులన్
దండిగా సమకూర్తు వంచును దాము
జ్ఞానులు మౌనులున్
పండితుల్ వచియింతు రెల్లెడ
పార్వతీపరమేశ్వరా! 20.
నీసమక్షము నందు నిల్చుచు నీకు
సేవలు చేయుచున్
దోస మెంచని నీదు నామము తోడ జిహ్వకు
హర్షమున్
భాసిలంగను గల్గజేయుట వాస్తవంబగు
రీతిలో
వాసిగాంచుటగా దలంచెద
పార్వతీపరమేశ్వరా! 21.
సౌరు లొల్కెడి స్థాన మీభువి
సచ్చరిత్రుల ఠావుగా
తోరమౌ యశమంది యుండెను దుఃఖభాజన
యుక్తులన్
కోరి పన్నుచు నుండి రీయెడ కోప
మించుక తెల్పుచున్
భారతీయత నిల్పు మయ్యరొ
పార్వతీపరమేశ్వరా! 22.
ముక్తిదాతవు సౌఖ్యజాలపు మోహపాశము
ద్రుంచుచున్
శక్తి గూర్చుచు బ్రోచుచుండెడి
సార్వభౌడ వౌట నా
సక్తి ధర్మమునందు నిల్పుచు స్వామి!
నీపయి నెప్పుడున్
భక్తి యుండెడి రీతి జూడుము
పార్వతీపరమేశ్వరా! 23.
దీనపోషక! సాధురక్షక! దీప్తిదాయక!
పాలకా|
మానవాళికి జీవకోటికి మార్గదర్శన
చేయుచున్
జ్ఞానదీధితులందజేసెడి శంకరా! యివె
సన్నుతుల్
భానుకోటిరుచీ! మహేశ్వర!
పార్వతీపరమేశ్వరా! 24.
సద్యశస్సుఖదాయకా! శివ! సన్నుతించెద
పల్కవా!
విద్యలన్నియు నీమహత్వము విశ్వమంతయు
జాటు నో
ఆద్య! పావన! భస్మలేపన!
అంచితోన్నతభావనా!
పద్యమందు నమస్కరింతును
పార్వతీపరమేశ్వరా! 25
తీర్థయాత్రలు చేయకుంటిని దేవతాళిని
నన్యులన్
స్వార్థదీప్తిని గోరి పూజలు
సల్పకుంటిని మ్రొక్కుచున్
సార్థకాభిధ! శంకరా! నను సన్మతిన్
బొనరించగా
ప్రార్థనల్ గొను నీకు చేసెద
పార్వతీపరమేశ్వరా! 26.
నీరముల్ సమకూర్చి బిల్వపు
నిస్తులాచ్ఛదళంబులన్
కోరి నిత్యమొసంగుచున్ శివ!
కొమ్మటంచును ప్రార్థనల్
చేరి నీకడ చేయుచుంటిని చిన్మయా!
యని బల్కుచున్
పారవశ్యము పొంద జేయుము
పార్వతీపరమేశ్వరా! 27.
ఈభవంబు నొసంగినావిట నెల్లవేళల
తండ్రివై
ప్రాభవంబును జూపి కానగు భాగ్యముల్ సమకూర్చుచున్
శోభిలంగను జేసినాడవు
శుద్ధభావములందునన్
వైభవంబు నొసంగి బ్రోవుము
పార్వతీపరమేశ్వరా! 28.
ఓదయామయ! సన్నుతాశయ! ఓనిరామయ!
శ్రీమయా!
నీదుసన్నుతి చేయువారికి
నిత్యసౌఖ్యము లెల్లెడన్
స్వాదుసద్యశ మందుచుండును సత్య
మియ్యది దీనిలో
వాదులాట యొకింత లేదయ
పార్వతీపరమేశ్వరా! 29.
పండితాళి భవన్మహత్వము
భాగ్యదాయకతత్వమున్
మెండుగా వచియించుచుందురు
మేదినీస్థలమందునన్
దండిగా జనులందు సఖ్యత, ధార్మికత్వఫలంబులన్
పండ జేయుము కామసంహర! పార్వతీపరమేశ్వరా! 30.
తరలము.
పరమపావననామ! శంకర! భాగ్యదా! అభయంకరా!
నిరుపమా! సురకోటిసన్నుత!
నిత్యహర్షద! శాశ్వతా!
స్మరహరా! కొనుమయ్య! సన్నుతి
సర్వలోకశివంకరా!
వరకృపాకర! యిందుశేఖర!
పార్వతీపరమేశ్వరా! 31.
అవనిజేశశుభంకరా! హర! ఆశుతోష!
ముదాకరా!
కవిసమూహనమస్కృతా! శివ!
కాద్రవేయసుశోభితా!
స్తవములందుచు భక్తకోటిని సాకుమయ్య
మహేశ్వరా!
భవవినాశన! భక్తపోషణ!
పార్వతీపరమేశ్వరా! 32
సదమలాశయ మందగోరుచు
సర్వకాలములందునన్
ముదములున్ జయ మందనెంచుచు
మోక్షదాయక! నీపయిన్
మదిని జేర్చుచు నన్యభావన
మానివేయుచు నిన్నిటన్
వదలకుండ భజించుచుండెద
పార్వతీపరమేశ్వరా! 33.
నిరుపమాఘము, భావహీనత, నిర్మలాశయశూన్యతల్
పరుల కింతయు మేలు చేసెడి వాంఛ
యించుక లేమియున్
నరుడ నౌటను బల్కరించుచు
నాదుమానసమందునన్
వరుస గట్టెను కావు మయ్యరొ
పార్వతీపరమేశ్వరా! 34
కసిని జూపకు కాంక్షదీర్చను
కావబోనని శంకరా!
యసదృశా! నిను గొల్చుచుండెద
నాత్మబంధువు నంచు నా
దెసను నీకృప బంపి ధైర్యము దెల్పకుండిన
నండ యీ
వసుధలో మరి యెవ్వ రయ్యరొ
పార్వతీపరమేశ్వరా! 35.
సుచరితంబున నీధరిత్రిని శోభిలంగను
జేసి నా
కచలమై వెలుగొందు భక్తిని
నార్యసన్నుత! నీ పయిన్
రచన చేయుచు బ్రోవు మయ్యరొ
రమ్యతాగరిమంబు నా
వచనమందున నింపి నిత్యము
పార్వతీపరమేశ్వరా! 36.
సకలలోకము లెల్లవేళల శర్వ!
నీమహిమంబులన్
మకరిద్రుంచినవానిదైవమ!
మాన్యసన్నుత! చాటుచున్
వికలమానసులందు సత్వము విస్తృతంబుగ
నింపు నో
ప్రకటితాతులసత్వశోభిత!
పార్వతీపరమేశ్వరా! 37.
అనుపమంబగు నీ మహత్వము నందునిందును
గాంచుచున్
ఘనతరంబగు భక్తితోడను కాలకాల! త్ర్యంబకా!
నిను భజించుచు మానసంబున
నిత్యహర్షము లన్నిటన్
వనచరాళియు నందుచుండదె
పార్వతీపరమేశ్వరా! 38.
హరహరా! మహదేవ! జిహ్మగహార!
హైమవతీసఖా!
సురగణస్తుత! యంచు భక్తిని జూపుచున్
నుతియించగా
త్వరితరీతిని జేరి బ్రోతువు
వల్లెయంచును నిత్యమున్
వరద! రమ్మని బిల్చువారిని
పార్వతీపరమేశ్వరా! 39.
నిగమసన్నుత! భూతనాయక! నీకుసన్నుతు
లీశ్వరా!
అగణితోన్నతసద్దయామయ! ఆర్యపూజిత!
శంకరా!
విగతపాపుల జేసి ప్రోతువు వేగమీయిల
భక్తులన్
భగవతీవరదాయకా! హర!
పార్వతీపరమేశ్వరా! 40.
ఒరులజీవన మెట్టులేగతి నున్న నేమగు
నాకిటన్
స్థిరతరంబగు సౌఖ్యసంపద చేరగావలె
నిత్యమున్
వరముగా నని మానవుం డిల స్వార్థ మందున
మున్గె నీ
భరతభూమిని కావుమయ్యరొ
పార్వతీపరమేశ్వరా! 41.
త్రిజగదీశుడ వన్నిరీతుల
శ్రీకరుండవు కావునన్
నిజము దెల్వగ లేక యీభువి
నిస్తులాఘమహోగ్రమౌ
రుజను మున్గుచు తాప మందుచు రోదనంబును
జేయు నీ
ప్రజను గాచుట నీదుధర్మము
పార్వతీపరమేశ్వరా! 42.
తమకు జన్మ మొసంగి దైవము ధాత్రి
జేర్చిన వేళనే
విమలతాస్థితి ధర్మపద్ధతి విజ్ఞతన్
గన దెల్పె నా
క్రమము నెంచక తుచ్ఛసౌఖ్యపు
కాంక్షజేసెడి వారి యా
భ్రమలు ద్రుంచుట నీదుకార్యము
పార్వతీపరమేశ్వరా! 43.
విమతనాశము చేయగల్గిన వేల్పులందున
నిచ్చలున్
క్రమము దప్పక భక్తకోటిని గాచుటందున
నెల్లెడన్
సమత నిల్పెడి కార్యమందున సర్వరీతుల
శంకరా!
ప్రముఖతన్ వహియించి యుంటివి
పార్వతీపరమేశ్వరా! 44.
ఏమినోములు నోచి యుండెనొ ఏమి పూజలు
చేసెనో
ఏమి సద్వ్రత మాచరించెనొ యేశ్రుతుల్
పఠియించెనో
ప్రేమపూర్ణ! త్వదీయసేవలు
విస్తృతంబుగ జేసెనో
పాము నీగళమందు జేరెను
పార్వతీపరమేశ్వరా! 45.
మంచిభావము లంది నిత్యము మానవత్వము
దాల్చుచున్
కొంచెమైనను నీర్ష్యజూపక క్రోధిగాక
మనస్సులో
వంచనాస్థితి నందకుండెడి వారికిన్
సుఖసంపదల్
పంచకుండుట నీకసాధ్యము
పార్వతీపరమేశ్వరా! 46.
శర్వ! నీకు నమస్కరించెద
శాంత్యహింసల స్థాన మీ
యుర్వి భారత మీస్థలంబున నొప్పు
మీరగ హర్షముల్
సర్వరీతుల సౌఖ్యసంతతి సత్ఫలంబుల
దీప్తియున్
బర్వగావలె నెల్లవేళల
పార్వతీపరమేశ్వరా! 47.
వాడిపోవని భక్తితోడను వాస్తవంబగు
నీద్యుతిన్
వీడు వాడను దృష్టితోడను వేరుచేయని
భావమున్
తోడునీడయి భక్తకోటుల దోసమెంచని
ప్రేమనున్
పాడుచుండెద నెల్లవేళల
పార్వతీపరమేశ్వరా! 48.
ముందు వెన్కలు చూడకుండగ మూర్ఖతన్
జరియించి నే
నందుచుంటి ప్రమాద మెల్లెడ నార్తి
మున్గుచునుంటి నా
కెందు గూడదు హర్ష మేగతి నీస్థితిన్
సరిచేయు మో
వందితామరకోటిరక్షక!
పార్వతీపరమేశ్వరా! 49.
సురుచిరంబయి సుందరాశయ శోభలన్
కలిగించి యీ
ధరను గౌరవ మంద జేయుచు ధన్యతన్
సమకూర్చు నీ
వరమతంబగు హైందవంబును బాసి యీనరు లీయెడన్
పరమతంబుల కేగ నేలొకొ
పార్వతీపరమేశ్వరా! 50.
యశము గోరను దాని కర్హత నందకుంటిని
విత్తముల్
భృశము చేకొను భాగ్యమైనను విశ్వనాథ!
యొకింతలే
దశనిపాతము వంటి కష్టము లంట నీయక
ముక్తి నా
వశము చేయుము నీకు దాసుడ
పార్వతీపరమేశ్వరా! 51.
మందబుద్ధికి జ్ఞానసంపద
మాన్యతాగరిమంబు లీ
వందజేయుదు వాత "డోహర" యంచు మానస
మందు నా
నందమందుచు నిన్ స్మరించిన నాయతంబగు
సత్కృపన్
వందితామరకోటిభాగ్యద!
పార్వతీపరమేశ్వరా! 52.
గుణవిధాయక! నిర్గుణాత్మక!
గోత్రజాహృదయేశ్వరా!
ప్రణుతి జేసెద స్వీకరించుము
రక్షసేయుము భక్తులన్
గణుతి నింపుము సర్వరీతుల
కాంక్షలన్నియు దీర్చుచున్
ఫణివిభూషణ! పాపనాశన! పార్వతీపరమేశ్వరా! 53.
ధారుణీస్థలమందు నిత్యము
తద్గతోన్నతభక్తితో
పారవశ్యము నందుచున్ ప్రజ
పార్వతీసుత! యంచు వి
ఘ్నారి యౌటను గొల్చుచుండెడి
యాదరంబును బొందె నా
వారణాస్యపు స్వామి నీదయ
పార్వతీపరమేశ్వరా! 54.
ముదము గూడును సర్వకాలము భోగభాగ్యము
లందుచున్
సదమలాశయదీప్తి కూడును సత్వముల్
సమకూరెడిన్
వదలకుండగ నిన్ను గొల్చినవారి కాంక్షలు
దీరుచున్
పదిల మౌగద జీవనం బిట
పార్వతీపరమేశ్వరా! 55.
పరమపావతాసుగంధము
వైదికోన్నతసంస్కృతుల్
సురుచిరాతుల సద్యశంబులు సుందరత్వము
యోగ్యతల్
భరతభూమిని నిల్చి యుండుట త్వత్కృపాస్థితిచేతనే
వరద! సర్వశుభంకరా! శివ!
పార్వతీపరమేశ్వరా! 56.
అనుదినంబును నిన్ స్మరించుచు
నాయతంబగు భక్తితో
మనము నిండగ జేయుచున్ వర మంగళాశయ
మన్నిటన్
మనుచునుండెడివారి కన్నియు మాన్యతల్
సమకూరు నా
వనమునందు జరించుచుండిన
పార్వతీపరమేశ్వరా! 57.
వీడువాడని యెంచకుండగ స్వాన్యభేదము
లేయెడన్
చూడకుండగ సంచరించుచు
శుద్ధమానసదీప్తితో
నేడనుండిన బ్రేమ జూపుచు నింపుమీరగ
బల్కుచున్
పాడి దప్పని శక్తి నిమ్మయ
పార్వతీపరమేశ్వరా! 58.
నాసమాజము నాకుటుంబము నాకులంబును
బంధువుల్
వాసి గూర్తురె? వెంట వత్తురె?
ప్రాణవాయువు వీడినన్
గాసిబొందిన స్వీకరింతురె కాన శంకర!
నన్ను నీ
వాసనల్ దొలగించి కావుము
పార్వతీపరమేశ్వరా! 59.
మారిపోయెను లోకమంతయు మానవత్వము
భీతితో
పారిపోవుచు నున్న దయ్యరొ
పాపకర్మలధాటికిన్
కోరికై మదులందు నిల్వగ
క్రూరతాస్థితి దానిచే
స్వైరవర్తన నిండె నేడిట పార్వతీపరమేశ్వరా! 60.
తృప్తి లే దొకయింతయేనియు
తీవ్రతాపము భూతమై
వ్యాప్తిచెందుచు మానసంబును
పాడుచేయుచు నుండ నీ
వాప్త సేవకుడంచు గాచుట లాదరించుట
లెల్ల నా
ప్రాప్తమంచును సంతసించెద
పార్వతీపరమేశ్వరా! 61.
తోడునీడయి భక్తకోటికి, దుష్టశక్తుల
ద్రుంచుచున్
వీడజేయుచు నంధకారము
విజ్ఞాతామహనీయతల్
కూడజేయుచు నెల్లవేళల గూర్మి
దెల్పెడి భావనన్
వాడవాడల నిల్చినాడవు
పార్వతీపరమేశ్వరా! 62.
తోరమౌ యనురాగదీప్తులు దోప నిత్యము
బల్కుచున్
సారవంతపు జీవనంబును సంతరింపగ
జేయుచున్
పారవశ్యము గూర్చు జన్మదవార్ధకంబు
సుతాళికిన్
భార మయ్యెను నేడు జూడుము
పార్వతీపరమేశ్వరా!. 63.
నిరుపమాఘసమూహవృద్ధియు నిస్తులంబగు
దౌష్ట్యముల్
కరుణలేమియు కర్కశత్వ
మకారణంబుగవైరముల్
వరుసగట్టె నమానుషత్వపు వాసనల్ బలమందుచున్
పరిసరంబులు నిండిపోయెను
పార్వతీపరమేశ్వరా!. 64.
తావకీనపదాంబుజంబును తన్మయస్థితినందుచున్
పావనత్వము పొంద గొల్చుచు
వాస్తవంబగు హర్ష మె
ప్డీవసుంధరపైన గాంచెడి యిచ్ఛ
గూర్చు సమర్థమౌ
భావనాబలమీయగోరెద పార్వతీపరమేశ్వరా! 65.
లేశమైనను సద్విచారపు లేమి చేతను
సంతతా
వేశమందున మున్గి యుంటిని
విస్తృతంబగు రీతిగా
నాశ చేరెను మానసంబున నందుచేతను
సంసృతీ
పాశబద్ధుడ నైతి గావుము
పార్వతీపరమేశ్వరా!. 66.
అతులితాఘము చేసినానిట నాయతంబగు
దౌష్ట్యమున్
సతతమున్ బొనరించినాడను సత్యపాలనమందునన్
వ్రతము నందక యున్నవాడను వాస్తవం బిది
నాకు నో
పతితపావన! నీవెదిక్కిట
పార్వతీపరమేశ్వరా!. 67.
ఇలను దుష్టుల కారణంబున నెల్లరీతుల ధర్మముల్
నిలువలేమని పారిపోయెను నిస్తులంబగు
వేదనల్
కలుగుచుండెను సవ్యమార్గము కానజేయగ
నాకిటన్
బలము ధైర్యము గూర్చుమో హర!
పార్వతీపరమేశ్వరా!. 68.
మదుల నిండెను నాకు నాకను మాట లోకుల
కెల్లెడన్
ముదిమి పైబడి యున్నవేళను ముందు కేగగ
లేమిచే
కదలకుండెడి కాలమందున కాంక్ష
వృద్ధిని బొందుచున్
వదలకున్నది స్వార్థభూతము
పార్వతీపరమేశ్వరా!. 69.
పరుల వృద్ధిని జూచి యోర్వక బాధ
పెట్టెడి మానసం
బురుతరంబుగ తోటివారికి నుత్సహించి
మహాపదల్
నిరతమున్ కలిగించువారికి
నిర్మలత్వపుగంధముల్
వరశుభాశయ మెట్లు
కూడునుపార్వతీపరమేశ్వరా!. 70.
దీనబాంధవ! మౌనిసన్నుత! దివ్యతేజ!
ముదాకరా!
మానసంబున నిన్ను నిల్పుచు
మంత్రముల్ పఠియించుచున్
ధ్యానమున్ బొనరింతు నీకయి
త్వత్పదార్పితనీరమున్
పానకంబుగద్రాగుచుండెద
పార్వతీపరమేశ్వరా!. 71.
చేసియుండిన పాపమంతయు శీఘ్రమే
నశియించు నిన్
ధ్యాస యందున నిల్పి కొల్చిన
నాయతంబగు భక్తితో
చేసెదన్ భవదర్చనల్ శివ! చింత
దీర్చుము కావు మో
వాసుదేవశుభంకరా! హర! పార్వతీపరమేశ్వరా! 72.
అనుదినంబును నిన్ను గొల్చుచు
నాపగాజలమెప్పుడున్
ఘనతరంబుగ నీకు నిచ్చుచు కాంక్షతో
నభిషేకముల్
వినుతరీతిని జేయుచుండెడి
విజ్ఞకోటికి నెల్లెడన్
పనులలోన జయంబు గూర్చుము
పార్వతీపరమేశ్వరా! 73.
అతులితోన్నతహర్షదీప్తికి ఆశ్రయంబగు
నమ్రతన్
వ్రతములందున దీక్ష గూర్చెడి
వాస్తవాయతశక్తులన్
చతురతామయభావముం గొను
స్వాంతశుద్ధిని నాకిటన్
ప్రతిదినంబు ఘటింపజేయుము
పార్వతీపరమేశ్వరా! 74.
అన్నిజన్మలలోన నుత్తమ మందు రందరు
భూమిపై
నెన్న మానవ జన్మమున్ గద యీభవంబున
కీశ్వరుం
డున్నతత్వము కూర్చుకారణ మొప్ప మానవు
డెంచడా
పన్నులన్ కృపజూడ బోవడు పార్వతీపరమేశ్వరా! 75.
తల్లిదండ్రులు నాకు జన్మము ధాత్రిపైన
నొసంగి నా
యల్లరిన్ దయతో సహించుచు నాదరంబున
బెంచి రా
ఫుల్లచిత్తుల సేవ నాకగు పూజయంచు
దలంచ డీ
వల్లమాలిన స్వార్థభావుడు
పార్వతీపరమేశ్వరా! 76.
ఎత్తుపల్లము లెల్లచోటుల నీభవంబున
దోచుచున్
చిత్తు చేయును యత్నమంతయు
శ్రేష్ఠతన్ గలిగించు నా
యత్తమున్ పొనరించు కష్టము లట్లె
సౌఖ్యము లెల్ల సం
పత్తి శాశ్వతమౌనె ధాత్రిని
పార్వతీపరమేశ్వరా! 77.
నేను నేనని యన్నిచోటుల నిస్తులాహము
దాల్చుచున్
జ్ఞానమున్ గొనియుండి యున్నను
సవ్యవర్తన చేయుచున్
మానవుండిల వృద్ధకోటికి మాన్యతల్
ఘటియింప డ
వ్వాని నేగతి గావ జూతువొ
పార్వతీపరమేశ్వరా! 78.
స్వార్థ మీయెడ హద్దు మీరెను
శాంతిపాఠము లన్నియున్
వ్యర్థరూపము దాల్చియుండెను వాస్తవంబు వచించుటల్
సార్థకత్వము నందకుండెను స్వామి
యీస్థితి గాంచు మో
పార్థసారథి గొల్చు దేవర!
పార్వతీపరమేశ్వరా! 79.
విత్త ముండిన చాలు నేడిట
విస్తృతంబగు కీర్తు లా
యత్త మౌచు నలంకరించును
హర్షసౌఖ్యములందు స
ర్వోత్తమాయతశక్తియుక్తులు
నొప్పుమీరెడి ధైర్య సం
పత్తి చేరెడి నీయుగంబున
పార్వతీపరమేశ్వరా! 80.
జాతిధర్మము లంతరించుచు సంకరత్వము
లోకమం
దీతరంబున నెక్కువైనది ఎట్టులీగతి
మార్చుటో
ఖ్యాతి నిల్పెడి స్వీయసంస్కృతి
నాదరించుట మానవ
వ్రాత మందున గూర్చు టెట్టులొ
పార్వతీపరమేశ్వరా 81.
వినయసంపద లేదొకింతయు విజ్ఞతాస్థితి
నాకిటన్
కనగచిక్కదు శబ్దదీప్తియు కానరాదిక
భావమం
దొనరకున్నవి నిర్మలత్వము
లొక్కమార్గము జూపుమా
వనచరత్వచ మంబరంబగు పార్వతీపరమేశ్వరా!
82.
నిన్ను గొల్చుట నీచరిత్రము
నిత్యమున్ బఠియించుటల్
సన్నుతించుచు రుద్రమందున సజ్జలంబుల
స్నానమె
ప్డెన్నగల్గిన రీతి నీకిడి యీశ!
పాహియటందు నా
పన్నరక్షక! కావు మయ్యరొ
పార్వతీపరమేశ్వరా! 83.
ఎదుటివారికి ధర్మసూత్రము
లెన్నియేనియు జెప్పు దా
సదమలాశయుడన్నరీతిని సర్వకాలము
స్వీయమౌ
ముదము గోరుచు సంచరించును
మూర్ఖుడౌచు నధర్మమున్
వదలబోవడు మానవుండిట
పార్వతీపరమేశ్వరా! 84.
అతులితాఘమహాగ్నిగాలుచు
నాయతామయతప్తులై
క్షితిని మోదము గాంచ జాలని
ఛిద్రమానసకోటికిన్
ప్రతిదినంబును నిన్నుదల్చెడి
భావశుద్ధిని గూర్చుటే
వ్రతసమానముగా దలంచెద
పార్వతీపరమేశ్వరా! 85.
పరమపావనమైన గంగకు వాసమున్ గలిగించి
యీ
ధరకు బంపితి వయ్య లోకుల దారుణాఘము
గూల్చగన్
కరుణలో నినుబోలు దైవము కానారా రెట
జూచినన్
వరశుభంకర! కామసంహర!
పార్వతీపరమేశ్వరా! 86.
నందినెక్కి జగాలనుండెడి
నైజభక్తజనాల కా
నందమున్ గలిగించి కావగ
నైష్ఠికత్వము నెంచుచున్
సుందరంబగు రీతి వచ్చుచు శోభలన్
బ్రకటింతువో
వందనీయ! ప్రణామమందుము
పార్వతీపరమేశ్వరా! 87.
నేను నేనను భావజాలము నిత్య మీయెడ
చిత్తమం
దాని మార్గము గాననీయక యన్నిరీతుల
శంకరా!
ధ్యానమున్ గబళించుచున్నది దాని
ద్రుంచుము నన్ను నీ
వాని గావుము ప్రేమజూపుచు
పార్వతీపరమేశ్వరా! 88.
అనుదినంబును దీనమానసులైనవారికి సాయమున్
జననుతంబుగ జేయుచుండుట సంతసంబును
బంచుటల్
ఘనతరంబుగ వారి మేలును కాంక్షచేయుచు
నుండుటల్
పనిగ నిత్యము నాకొసంగుము
పార్వతీపరమేశ్వరా! 89.
మంచివారలతోడ స్నేహము మాన్యవర్యుల
సంగతుల్
వంచనల్ దరిచేరనీయని భవ్యమానస
దీప్తియున్
సంచితార్థము తోటివారికి
స్వాంతశుద్ధిని జూపుచున్
బంచిపెట్టెడి భావ మిమ్మయ
పార్వతీపరమేశ్వరా! 90.
హరికి నీకును భేదభావము లంటకుండెడి
చిత్తమున్
మరణ మందగ బోవుచుండిన మాన్యతల్
నిలబెట్టు నీ
పరమపావననామధేయము బల్క గల్గెడి
శక్తియున్
వరద! నాకిడి కావుమయ్యరొ!
పార్వతీపరమేశ్వరా! 91.
నిన్ను గొల్వగ గౌరవంబది నిత్య మందుచునుండినన్
సన్నుతించగ వెర్రివాడని సంఘమందున
నవ్వినన్
క్రొన్నిధానము లందకుండిన కోరి
నిత్యము దేవ! యా
పన్నరక్షక! నిన్ దలంచెద
పార్వతీపరమేశ్వరా! 92.
నాగృహంబును, నాధనంబును, నాచరాచరసంపదల్
సోగకన్నుల నాపడంతియు, చుట్టపక్కము
లాదులున్
రాగమానసులైన మిత్రులు, ప్రాణసన్నిభు
లెవ్వరున్
భాగధేయము మార్చలేరిట
పార్వతీపరమేశ్వరా! 93.
సహచరాళికి మిత్రకోటికి సజ్జనాదుల
కీయకే
యహరహమ్మును నాది నేనని అంతమందని స్వార్థమున్
సహనశీలములేక దాల్చుచు సర్వదా
నరుడక్కటా!
బహుళ మూర్ఖత జూపుచుండును
పార్వతీపరమేశ్వరా! 94.
తల్లిదండ్రుల సేవచేయుట ధన్యతన్
సమకూర్చునం
చెల్లవేలల నెంచకుండగ నెంతయేనియు
వారికిన్
తల్లడిల్లెడి బాధగూర్చుచు
దైవపూజలయందునన్
వల్లమాలిన భక్తి భావ్యమె
పార్వతీపరమేశ్వరా! 95.
నమకపాఠములోన నీకయి నైష్ఠికత్వము
జూపుచున్
సుమశరాయతగర్వనాశక! చూపుమా దయయంచు
నిన్
క్రమము దప్పక గొల్చువారికి
గల్గజేయుము సౌఖ్యముల్
భ్రమలు ద్రుంచుచు శాశ్వతంబుగ
పార్వతీపరమేశ్వరా! 96.
ఒకడు చేసిన కార్య మీయెడ నొక్క
డొప్పడు నేతయై
సకలమున్ గబళించ జూచుచు సర్వరీతుల
తానె పో
యకలుషాద్భుతమానవుండ నటంచు బల్కుట
సాజమై
ప్రకటితంబగుచుండె నెల్లెడ
పార్వతీపరమేశ్వరా! 97.
ప్రకృతిమాత యొసంగె నెన్నియొ
భవ్యమైన ఫలంబులన్
రకరకంబుల ధాన్యరాశులు ప్రాణరక్షకు
భోజనం
బొకవిధంబున జే కొనంగను నొల్ల కీ
మనుజుండు చూ
పకదయన్ వధియించు బ్రాణుల
పార్వతీపరమేశ్వరా! 98.
తరుగణంబును జంతుజాలము ధాత్రిపై ప్రవహించు
నా
వరనదీఝరులన్ని నిత్యము
స్వాంతశుద్ధిని జూపుచున్
నరసమాజపు దీప్తి గోరుచు నైజసభ్యత
దెల్ప దే
వర! నరుండిల దుష్టతం గొనె
పార్వతీపరమేశ్వరా! 99.
భారతీయత నిచ్చినాడవు, భాగ్యరాశి నొసంగుచున్
చారుశీలకుటుంబబంధము సవ్యరీతిని
జూపుచున్
గౌరవంబును గూర్చినాడవు కాంక్ష లేర్పడ
దీర్చి నిన్
జేరుమార్గము దెల్పు మయ్యరొ
పార్వతీపరమేశ్వరా! 100
కన్నవారలనైన సౌఖ్యము గాంచనీయడు
మానవుం
డన్నివేళల స్వార్థభావము
నందియుండును భాగ్యముల్
కొన్ననైనను తృప్తిచెందడు
కూర్మిజూపడు నిత్యమా
పన్నరక్షక! ఓ కృపామయ!
పార్వతీపరమేశ్వరా! 101.
భరతభూమిని ధర్మదీప్తికి బాధకల్గని
రీతిగా
నిరతవేదవిధానకర్మలు నిష్ఠతోడను
సాగగా
సురుచిరోన్నతభావజాలపు సుందరత్వము
గూడగా
వరద! జూడుము మానవాళిని
పార్వతీపరమేశ్వరా! 102
సర్వమానవకోటిసౌఖ్యము స్వాంతమందున
గోరు నీ
యుర్విపైనను ధార్మికత్వము నొప్పు
మీరగ నిల్పుటే
పర్వమై విలసిల్లు
హైందవభవ్యధర్మముపై నిటన్
పర్వె నన్యుల దౌష్ట్య మెంచుము
పార్వతీపరమేశ్వరా! 103
నిదురలోనను మేలుకొన్నను నిత్య
మెల్లవిధంబులన్
ముదముతోడను నీదు నామము మోక్షదాయక!
పల్కు నా
సదమలత్వము నిమ్ము నాకది సాగకున్న
క్షణంబునన్
వదలజేయుము ప్రాణమున్ శివ!
పార్వతీపరమేశ్వరా! 104
జీవనం బిది బుద్బుదాభము శ్రీగళా!
మహనీయమౌ
తావకాజ్ఞను నిల్చియుండును తానణంగుట
యెప్పుడో
జీవి యెంచగలేక యుండియు చేయుచుండు
నహంకృతిన్
భావజాతులగర్వనాశక!
పార్వతీపరమేశ్వరా! 105
శివ! శివా! శివ! రుద్ర! శంకర! జే
యటందును నిత్యమున్
కవిని గానయ, కావ్యరాశిని
గాంచకుంటిని నీకడన్
స్తవము జేయగ జేరియుంటిని
తన్మయత్వము నందుచున్
భవహరా! కరుణించు మయ్యరొ!
పార్వతీపరమేశ్వరా! 106
నీదయావిభవంబుచేతను నిక్క మీగతి
నీయెడన్
స్వాదుశబ్దము లందె భావము
సవ్యరీతిని దోచి నీ
మీద పద్యము లల్లగల్గిన
నిర్మలాశయసిద్ధియున్
వాదులేల లభించె మ్రొక్కెద
పార్వతీపరమేశ్వరా! 107
ఈభవంబున నిన్ను గొల్చుట కెల్లవేళల
యత్నమిం
దోభవా! విను చేసియుండిన నొప్పుగా
భవమోక్షపున్
శోభ గూర్చుము లేనిచో విధుశేఖరా!
భవదర్చనా
వైభవంబును గూర్చు మెప్పుడు
పార్వతీపరమేశ్వరా! 108
***
No comments:
Post a Comment