Saturday, 6 December 2025

జననీశతకము

 

శ్రీరామ

జననీశతకము

(కందములు)

(మాతృమూర్తి స్మరణలో)

 

శ్రీవిఘ్ననాథు దలచుచు

భావంబున నిల్పి గొల్చి భారతి నటపై

నావేంకటపతి సన్నుతి

నీవేళను జేయువాడ నిటనిదె జననీ!                                                1.

 

శ్రీలను చూపిన దానవు

నాలయమై మమత కెప్పు డతివత్సలతన్

లాలించి యున్నదానవు

నీలాగున నొకరు గలరె నిజమిది జననీ!                                            2.

 

శ్రీవేంకటేశసతివై

పావనతను సంతరించు భాగ్యోన్నతికిన్

తావయి వెలిగినదానవు

నీవిల వందనశతమ్ము నీకిదె జననీ!                                                  3.

 

అనుపమవాత్సల్యంబున

నను నింతటివాని జేసి నాయజ్ఞత కీ

వనుదినహరణాధ్వంబును

ఘనతరముగ నిల్పినావు కద ఓజననీ!                                               4.

 

నలుగురిలో నేరీతిని

మెలగంగావలయు ననెడి మేలగు ఫణితిన్

సలలితముగ నేర్పించితి

వలఘుస్వాద్వచ్ఛభావమందున జననీ!                                              5.

 

లోకము లన్నియు వెదకిన

నీకన్నను ప్రేమమూర్తి నిష్ఠాభరితా!

లేకుండుట నిజమందును

శ్రీకమనీయస్వభావ! జేజే జననీ!                                                       6.

 

నేనీయిలలో యశములు

మానితముగ నందు కొరకు మహదభిలాషన్

మానసమున నిల్పిన నీ

వైనంబును దలచెద ననవరతము జననీ!                                           7.

 

సత్యమునే పలుకుమురా

నిత్యము జయమందగలదు నీకని నాకున్

సత్యస్ఫూర్తిని జూపితి

వత్యతి వత్సలత నతుల నందుము జననీ!                                          8.

 

తనువున మనమున నేవిధి

ననిపించిన బాధ శీఘ్ర మమ్మా యనుచున్

వినబడు వెలువడు శబ్దం

బనుమానము లేదు నరున కరయగ జననీ!                                       9.

 

 

అమ్మా యని పిలిచినచో

సమ్మోదము హృదయమందు చక్కగ గలుగున్

ముమ్మాటికి సత్యం బిది

అమ్మా! నీమహిమ చెప్ప నలవియె జననీ!                                           10.

 

సుతుడొకపరి దుష్టుం డీ

క్షితిపైనను గానవచ్చు క్షేమంకరియై

యతులితనిర్మలరాగా

న్విత మాత యటుండ నెందు నేర్చునె జననీ!                          11.

 

కొమరుం డుచ్చపదంబున

నమరంగావలయు నంచు ననుదిన మీవో

సమతామూర్తీ! తలచెద

వమలినభావాన నతుల నందుము జననీ!                                         12.

 

అంబవు సామ్రాజ్యాంబవు

సంబరములు మనమునందు సంతతమును తో

రంబుగ నిలిపెడి నిన్నున్

సంబోధించెదను దైవసమముగ జననీ!                                             13.

 

నిర్మలతకు నిలయమవై

ధర్మాచరణైకభావధారిణి వగుచున్

కర్మఠగా చరియించితి

వర్మిలి నానుతులనందు మనిశము జననీ!                                         14.

 

విసుగొందక నానోటను

నసదృశశబ్దాళి పల్కునట్లుగ నీవో

లసదనురాగ! యొనర్చితి

వొసగెద ప్రణతులను నీకు నొప్పుగ జననీ!                                         15.

 

మనసంస్కృతి మనధర్మపు

టనుసరణము క్షేమకరము హర్షప్రదమౌ

ననుచును తత్తద్జ్ఞానము

గొన జూపితి వమ్మ సతము కూర్మిని జననీ!                                        16.

 

పరధనమును గాంక్షించుచు

నరయుట యుచితంబు గాని దఘసంతతికిన్

తెరువగునని నిరతంబును

వరగతి బోధించినావు ప్రణతులు జననీ!                                            17.

 

జీవనపరమార్థంబును

భావంబున నిల్పి మసలవలయు నటంచున్

పావనమగు హితబోధను

గావించిన నీకు నతులు ఘనగుణ! జననీ!                                         18.

 

భగవంతు డెట్టులుండునొ

యగణితకరుణాబ్ధి తానటందురు విజ్ఞుల్

నిగమోక్త తత్స్వరూపము

గనకుంటిని నీవె తాను గద యిల జననీ!                                           19.

  

తలపులలో చేతలలో

పలుకులలో శుద్ధి జూపి బడయుము శుభమీ

యిలలోన సంతతం బని

పలికిన నీ కొసగుచుంటి ప్రణతులు జననీ!                                        20.

 

ఎవరెట్టులు చరియించిన

భవదీయసుశీలదీప్తి భవ్యంబయి యీ

యవనిని నుతిగొనవలెనని

వివరించితి వాత్మతమము విడివడ జననీ!                                          21.

 

పరులను మోసము చేసెడి

కరణియు ననృతంబు లాడి కల్మషరాశిన్

విరివిగ సంపాదించెడి

తెరు వనుచిత మంటి వదియె దీవెన జననీ!                                       22.

 

భగవంతునిపై భక్తిని

నిగమోక్తవిధానమందు నిరతశ్రద్ధన్

తగునని యెంచుచు దాల్చిన

నగణితసౌఖ్యంబు లమరు నంటివి జననీ!                                          23.

 

మృదువాక్యభాషణంబున

సదమలసత్స్నేహ మరసి సంతోషంబుల్

హృదయస్ఫూర్తిగ గొనుమిది

వదలకుమని చెప్పు నీకు ప్రణతులు జననీ!                                         24.

 

 

సురుచిరభావముతోడను

నిరతము చరియించుచున్న నీకగు శుభముల్

ధరపైని నిత్య మంచును

వరగతి వచియించు నీకు ప్రణతులు జననీ!                                       25.

 

పేదరికము భూతంబై

మోదంబును గూల్చుచున్న పొందక భీతిన్

వేదన కనబడనీయక

మేదినిపై నిలిచినావు మేలని జననీ!                                      26.

 

బహుసంతానము గలిగిన

నహరహమును వారికొరకు నతివత్సలతన్

సహియించి కష్టపంక్తిని

గృహిణిగ వెలుగొందినావు క్షితిపయి జననీ!                                       27.

 

అతిథులకు నన్నపూర్ణయి

సతతము ధర్మానుసరణ సత్కృతియని స

మ్మతితో చరియించిన నీ

ధృతదీక్షకు వందనమ్ము తెలిపెద జననీ!                                             28.

 

నీవును నాన్నయు నాకెడ

దైవములై యనుదినమ్ము ధైర్యము గూర్చన్

జీవనమున సంతోషము

భావింపగ గలిగినాడ ఫలముగ జననీ!                                              29.

 

 

హిమవంతుని గతి నాన్నయు

సముదంచితధీరమూర్తి సన్నుతగుణులై

యమలినభావంబులతో

మము బెంచిరి నుతియొనర్తు మనమున జననీ!                                 30.

 

తానేరీతిని మనెనో

మానితమగు సచ్చరిత్ర మహిమాన్వితమౌ

జ్ఞానము గలవాడనుచును

మానాన్న యశంబు నందె మహినిట జననీ!                          31.

 

ఏనాడును లేమిని దా

మానసమున నిల్పుకొనుటె మా కెవ్వరికిన్

తానయి వ్యక్తము చేయరు

జ్ఞానప్రదులౌచు నాన్న సతతము జననీ!                                            32.

 

పురహితము గోరి మనిరిట

నిరతము పూజాదికములు నిష్ఠాయుక్తిన్

సురుచిరగతి జేయించుచు

వరగుణులయి నాన్న యివియె ప్రణతులు జననీ!                                33.

 

ధనమది బంధుత్వంబున

గనగూడని భేదభావ కారణమయి తా

ననుపమవైరము నింపును

విని మసలుం డనిరి నాన్న విజ్ఞత జననీ!                                            34.

  

నీవును, నాన్నయు, బామ్మయు

భావంబున శుద్ధి గూర్చు వాక్యంబులతో

గావించిన సద్బోధన

లీవేళను ఫల మొసంగె నింపుగ జననీ!                                              35.

 

ప్రేమయు ననురాగంబును

నీమహి నెట్లుండు నంచు నెంచినవేళన్

నామానస మో నరుడా!

నీమాతను జూడ తెలియు నిజమను జననీ!                           36.

 

సంతతికి నొక్క కష్టము

సుంతైనను గల్గెనేని చూడగ లేకా

వంత గని నీవు గాంచెడి

చింతకు సీమయిన లేదు చెప్పగ జననీ!                                             37.

 

అమ్మా! నిన్నరసిన చా

లిమ్మహి కష్టమ్ము లన్ని యిటునటు తొలగున్

ముమ్మాటికి వీడుచు జను

సుమ్మీ, సౌఖ్యమ్ము హృదిని శోభిలు జననీ!                                          38.

 

అనుచితకర్మము చేయగ

మనమందగలేని రీతి మమతాస్థానా!

నను బెంచిన నీ కొసగెద 

ననుదినవందనసహస్ర మందుము జననీ!                                         39.

 

 

అక్షయవాత్సల్యంబున

నీక్షితి మనగలుగురీతి నింపుగ నాకున్

దక్షతతో నేర్పిన నీ

దీక్షకు వందనశతమ్ము తెలిపెద జననీ!                                              40.

 

ఆశల కంతము లేదిల

రాశులుగా మనమునం దరాతుల పగిదిన్

నాశనము చేయు భావము

లాశల ఖండనము ముఖ్యమటంటివి జననీ!                           41.

 

పిల్లల దొసగులు గాచుట

కెల్లజగంబునను సాటి యెవరమ నీకున్

సల్లలితభావదీప్తిని

నుల్లమునం దుంచి ప్రోతు వొప్పుగ జననీ!                                        42.

 

జనకుడు దీపపు వత్తిగ

ననుమానము లేదు నీవు నట తైలముగా

నను వెలుగునకుం జేర్చిరి

జనసంఘమునందు నిల్పి సన్నుతి జననీ!                                          43.

 

అండగ నీవిల నుండగ

మండనముగ దలచినాడ మదిధైర్యంబున్

దండిగ గాంచుచు నిత్యము

నిండుగ సౌఖ్యంబులంది నిలిచితి జననీ!                                           44.

 

 

నీదయయు, నాన్నకృపయును

సాదరముగ బిల్చు బామ్మ సద్వత్సలతల్

మోదము గూర్చెడి పదసం

పాదన కధ్వ మిట జూపె వరలగ జననీ!                                             45.

 

సుతుడని గారాబము నీ

వతులితముగ జేయకుండ నావశ్యకమౌ

గతి మందలించి నిలిపిన

ప్రతిపదమును దలచువాడ వరముగ జననీ!                           46.

 

మెత్తని పలుకులు పలుకుచు

కుత్తుకలను గోయునట్టి కుటిలతగల యా

చిత్తంబు తగదు నరులకు

నెత్తరి వినుమని తెలిపితి వింపుగ జననీ!                                           47

 

చదువే జీవనమందున

సదమల సత్సౌఖ్య మొసగు సర్వవిధాలన్

పదిలమగు భవిత యంచును

చదివించినదానవమ్మ చక్కగ జననీ!                                                 48.

 

స్థిరభక్తి దైవమందున

సురుచిరగతి చూపుచుండి శుద్ధాత్ముండై

నరుడీ జగమున దీనుల

నరయగవలె నుపకరించ ననిశము జననీ!                                        49.

 

 

జననీజనకుల నెవ్వడు

తనదైవములంచు దలచి తన్మయుడయి తా

ననునిత్యము సేవించును

కన వాడిల సచ్ఛుభంబు గాంచును జననీ!                                         50.

 

పరివారపు సేవలలో

నిరతము మునిగుండినావు నీసుఖ మొకవే

ళరయక యోర్చితి విడుములు

ధరయే నీసాటి యందు తథ్యము జననీ!                                           51.

 

అభిమానవతివి తల్లీ!

విభవము ముఖ్యమ్ము కాదు విమలంబగున

ట్లభిమానము గానని యెడ

సుభవా! అడుగైన పెట్ట చూడవు జననీ!                                             52.

 

చల్లని నీచూపులతో

పిల్లలలో భీతి వదలి వెడలెడి రీతిన్

ఫుల్లాయతసద్భావా!

యెల్ల శుభంబులను గూర్తు వింపుగ జననీ!                           53.

 

సమతాభావస్థానవు

మమతకు నిలయంబ వీవు మహి నెల్లపుడున్

విమలస్వాంతవు నీకున్

సములెవ్వరు కానరారు సత్యము జననీ!                                            54.

 

 అనురాగవత్సలత్వము

ఘనతరముగ నొక్కచోట గనబడజేయన్

మును ధాత నీదురూపము

తనచాతుర్యమున గూర్చె తథ్యము జననీ!                                           55.

 

కన్నులు తెరిచిన మూసిన

నిన్నే యీ జగమునందు నిత్యము జూతున్

మన్నన చేసెద నేయెడ

నన్నింటను జన్మదాత్రి వగుటను జననీ!                                              56.

 

నీవొసగిన దీదేహము

పావనముగ నీవు చూపు భావంబులతో

నేవేళ నింపి యుంచెద

జీవనమును దీప్తిమయము చేయగ జననీ!                                        57.

 

చెడుతలపులు రాకుండగ

నొడిదుడుకులు సంతసమున నోర్చుచు శుభముల్

వడసెడి సత్త్వము నాకిట

నడుగడుగున జూపుమమ్మ యనిశము జననీ!                                   58.

 

నీకొమరుడు సజ్జనుడై

లోకంబున కీర్తినంది లోపల బయటన్

చేకొన సమభావంబును

నీకదె సన్మానమగును నిజముగ జననీ!                                             59.

 

 

అమ్మా యనియెడి శబ్దం

బిమ్మహి నమృతంబు కన్న నెన్నగ మిన్నై

సమ్మోదము గలిగించును

నెమ్మది నన్నింటిలోన నిత్యము జననీ!                                               60.

 

కన్నా! రమ్మని పిలిచెడి

నిన్నెన్నగ నాకు దరమె నిర్మలభావం

బన్నింటను జూపింతువు

మన్ననలను గాంతు వెపుడు మహిపయి జననీ!                                  61.

 

అక్కలతో నన్నలతో

చక్కని వర్తనము ప్రేమ సర్వవిధాలన్

మిక్కుటముగ జూపించుచు

నిక్కుంభిని మెలగుమంటి వింపుగ జననీ!                                          62.

 

అందరినీ నీవలెనే

సుందరభావంబుతోడ జూడు మటం చీ

వందంబుగ బోధించితి

వెందైనను బంధుభావ మేర్పడ జననీ!                                               63.

 

అనురాగంబున దైవము

నినుబోలగలాడె సతము నిర్మలహృదితో

తనుజులను బల్కరించెద

వనుపమ వీవందు సత్యమంతట జననీ!                                            64.

 

దైవంబును బూజించుట

భావంబున శుద్ధి నింపి ప్రత్యహ మిచటన్

సేవించుట వృద్ధాళిని

నీవే కద నేర్పినావు నిజముగ జననీ!                                      65.

 

అనృతము లాడుట బాధలు

గనజేయుట పరులనిలను కాదుచితం బా

పని జీవితనాశకమౌ

నని తెల్పితి విదె ప్రణామ మందుము జననీ!                                      66.

 

కనిపించి దైవ మీయెడ

నను వరమును కోరుమనిన నాతో నెపుడున్

మన జేయుము నామాతను

ననియెద వేరొక్కటేమి యడుగక జననీ!                                            67.

 

వారే భాగ్యాన్వితు లీ

ధారుణిపై శ్రద్ధ జూపి తలిదండ్రులకున్

తీరైన సేవ చెసెడి

వారలు సందేహమిందు వలయునె జననీ!                                        68.

 

ఒకతల్లికి జనియించిన

సకలుర మానసములందు సమభావంబుల్

ప్రకటితము కాకపోవుట

కొకకారణ మేదియేని యున్నదె జననీ!                                             69.

 

 

నీలాగున జనులందరి

కేలనొ కరుణార్ద్రహృదయ మేర్పడ దిచటన్

మేలగు భావపరంపర

తాలిమి కనబడ వదేమి ధర్మము జననీ!                                             70.

 

అనవరతము చతురతతో

తనపని సాధించుకొనుట ధర్మ మటంచున్

మనుజుడు తలచి యసత్యము

ననుదిన మిట నాడుచుండు నవురా! జననీ!                                       71.

 

తనబాగు కోరి యెల్లెడ

మనుజుడు పెరవారి హితము మనమున నైనన్

గొనబోవడు స్వార్థములో

మునుగును పాపమ్ము దలచ బోవడు జననీ!                          72.

 

నీవొసగిన సంస్కారమె

దీవెనయై జీవనమున దీప్తిని నింపెన్

తావక భావోన్నతియే

యీవేళ జయంబు గూర్చె నిలపయి జననీ!                                        73.

 

నీవొనరించిన బోధన

లేవేళను మరువబోవ కెల్లవిధాలన్

జీవనమున నవ్వానిని

పావనముగ దాల్చు వాడ వరముగ జననీ!                                         74. 

 

 

మధురములగు వచనంబులు

విధమెరిగిన యాదరంబు విమలమనంబున్

విధిగా దాల్చుట లొరులకు

నిధి యొసగుట కంటె హెచ్చు నిజముగ జననీ!                                   75.

 

పరహితమును గోరెడివా

రరయుదు రిహమందు సౌఖ్య మాపయిని సదా

పరమున స్థిరతను గాంచెడి

సరణిని సందియము లేదు సత్యము జననీ!                           76.

 

తల్లిని మించిన దైవం

బెల్లజగంబునను వెదుక నెచ్చట గన మా

యుల్లంబది సంతోషపు

టిల్లౌగద తల్లియొడిని నిలపయి  జననీ!                                            77.

 

అమ్మా! యను నక్షరములు

కమ్మదనంబునకు ఠావు గావున నెపుడున్

సమ్మోదామృతఝరులను

నెమ్మదిలో బారజేయు నిజమిది జననీ!                                              78.

 

మానవు డెంతయు ఖలుడై

దానవతను నింపుకొనెను తానన్నింటన్

జ్ఞానాఢ్యుడ ననుకొనుచును

మానడు దౌష్ట్యం బదేమొ మహిపయి  జననీ !                                    79.

 

 కులమతములు వలదందురు

తలపులలో వానియూసె తాల్చుచు సతమున్

పలువిధముల వ్యత్యాసము

లిల నిలుపుచు సంతసింతు రేలనొ  జననీ!                                        80.

 

తనపూర్వీకులు నేర్పిన

ఘనతరధర్మమును వీడి కతిపయసుఖముల్

గనబూని మతము మారెడి

జనుడగు జీవచ్ఛవంబు సత్యము  జననీ!                                           81.

 

శివకేశవులకు భేదం

బవనిని గణియించువాడు హర్షితమతియై

గనలేడు ధన్యతాస్థితి

గొను కలుషము తనకు తాను గోరుచు  జననీ!                                  82. 

 

అమలినమగు భావంబును

సుమధురవాక్యములు బల్కు చొప్పును గనుటల్

రమణీయవర్తనంబును

సమతాగుణ మరయ డవుర! జనుడిల  జననీ!                                    83.

 

తనకోసమె యార్జించుట

తనయుదరమె నింపుకొనుట దయ దీనులపై

నను జూపక వర్తించుట

జనునకు తగదనుట నిత్యసత్యము  జననీ!                                         84.

 

 

విమలము హిందూధర్మము

క్రమమును నేర్పించువిధిని ఘనతర మగుచున్

సమతను సర్వవిధంబుల

నమలినభావమున జూపునట్టిది  జననీ!                                            85.

 

వైదికధర్మంబందున

మోదంబున నిచ్ఛ జూపి పుడమిని జనుడే

వాదన చేయక మసలుట

శ్రీదంబయి శుభము కలుగజేయును  జననీ!                                     86. 

 

వనితయె సృష్టికి మూలము

జనన మొసంగుచును బెంచు సకలోపకృతుల్

తనపనిగ జేయు చుండెడి

ననుదినమును సాటి యెవ్వ రతివకు  జననీ!                                     87.

 

వినకూడని విషయంబులు

వినకుండగ జేయు మనుచు వేడుచు నిన్నో

ఘనచరితా! స్మరియించెద

ననుదినమును శక్తియొసగి యనుచును  జననీ!                                88.

 

తానొకధర్మంబందున

మానవు డొకరుండు నుండ మరియొకరుం డ

వ్వానిని మార్చగ జూచును

మానక దుర్మార్గగతుని మాదిరి  జననీ!                                              89.

 

 గురుజనులకు ప్రణుతించుట

సురకోటులపైని భక్తి చూపుచు నుతులన్

నిరతము సలుపుచునుండుట

వరమని తెల్పితివి నీవు ప్రణతులు  జననీ!                                          90.

 

అమ్మా! సామ్రాజ్యాంబా!

సమ్ముదమున నేనొనర్తు సత్ప్రణతుల కీ

వెమ్మెయిని సంతసించెద

విమ్మా సద్భావదీప్తి యెపుడును జననీ!                                              91.

 

పుట్టితివి గండికోటను

మెట్టితి వీహరికులాన మేలగు దీప్తిన్

బిట్టుగను నిలుపజేయగ

బట్టితివమ దీక్ష నీకు ప్రణతులు  జననీ!                                             92.

 

కోదండరామయార్యుడు

మోదాత్మక సుబ్బమాంబ ఫుల్లాశయు లీ

మేదినిపయి నీజన్మదు

లాదిమదంపతుల తుల్యు లనఘులు  జననీ!                          93.

 

పుత్రిక లిలగల మువ్వురు

పుత్రులు నిక నల్వురట్లె పుడమిని గని యీ

గోత్రము వృద్ధిని పరచు ప

విత్రవు వందనము లివెయె వేలుగ  జననీ!                                         94.

 

 కష్టములే బహుకాలం

బిష్టంబుగ స్వీకరించి యిసుమంతున్నన్

తుష్టిని గాంచిన దేవత

వష్టాంగప్రణుతి గూర్తు నందుము  జననీ!                                         95.

 

హితబోధయు, సన్మార్గము

సతతము నేర్పించి నన్ను సభ్యత గనుచున్

క్షితిపయి నిలువగ జేసితి

వతులితమహిమాఢ్య ప్రణతు లందుము  జననీ!                                 96.

 

సంతానపు టౌన్నత్యము

సుంతైనను జూడ కిచట, సురలోకమునన్

సంతసమున జరియించెడి

పంతంబున నేగినావు భావ్యమె  జననీ!                                             97.

 

పరలోకము నందుండియె

సురగణసభ్యత్వమంది శోభిల్లెడి నీ

వరయుచు మాస్థితిగతులను

నిరతము రక్షించు మనెద నిన్నో జననీ!                                             98.

 

ఎల్లప్పుడు సత్యమునే

సల్లలితాశయముతోడ సత్ఫలితము సం

ధిల్లగ బలికెడి బల మీ

వెల్లవిధంబులను నాకు నీవలె  జననీ!                                               99.

  

జపములు తపములు చేసిన

నెపమెన్నక యొరులయందు నిత్యోపకృతుల్

కృపజూపి చేయుచుండిన

నపగత మాతౄణ మగునె యవనిని  జననీ!                           100.

 

కని పెంచిన తలిదండ్రుల

మనమును నొప్పించునట్టి మానవు డిలలో

గనలేడు సత్యసౌఖ్యము

లనుమానములేదు కొంచెమైనను  జననీ!                                         101.

 

తల్లియె సకలాధారం

బెల్లజగంబులకు త్రాత యీశుండైనన్

తల్లికి సుతుడే కావున

తల్లియె సర్వప్రధాన ధరణినిజననీ!                                                   102.

 

తనసుతుడు సత్ప్రవర్తన

గొని కనవలె సద్యశమ్ము కువలయమందున్

ఘనతరముగ ననుకొనియెడి

యనఘాశయ మాతృమూర్తి యనిశము  జననీ!                                 103.

 

నాన్నయు నీకడనే యట

యున్నారుగ వారితోడ నొప్పగు రీతిన్

మన్నించి మాకు నిరతం

బన్నింటను నిలువుమమ్మ యండగ జననీ!                                         104.

 

 

మనమునను దోచినట్లుగ

వినుమంచు ననేక గతుల విపరీత పదా

లను బలికితి పద్యములని

తనుజుడ నాగ్రహము జూప దగదమ జననీ!                          105.

 

నీ నేర్పిన మాటలనే

నేనీయెడ బల్కినాడ నిర్మలహృదితో

నీనా వాక్యములందున

నానిన దొసగులను  గావు మమ్మా! జననీ!                                          106.  

 

అనురాగము, మృదుభాషణ

మనుపమసౌజన్యదీప్తి, యమలాశయమున్

తనుజాయతవత్సలతయు

నిను సర్వోన్నతపదమున నిలిపెను  జననీ!                                         107.

 

అజుడైయుండియు దైవము

త్రిజగంబులపాలనమున స్థిరుడయి తానున్

నిజమగు మాతృత్వంబును

భజియించగ భవమునందె పలుమరు  జననీ!                                   108.

                                                జన్మదాతలైన నా తల్లిదండ్రుల పాదపద్మములకు భక్తిపూర్వక సమర్పణ.

 

***

 

 

No comments:

Post a Comment