Saturday 24 August 2019

ఆత్మహత్య తగదు

ఆత్మహత్య తగదు

ఉ.
శ్రీలను గాంచుచున్ భువిని క్షేమములందుచు సంచరించుచున్
మేలగు కృత్యముల్ సలిపి మేదినిపై యరుసంబు నింపగా
జాలిన జన్మ మిచ్చటను సన్నుతరీతిని దేవు డిచ్చె నీ
కేలనొ యాత్మహత్య? తగునే? జనుడా! గమనించు మీగతిన్. 1.
ఉ.
ఆపరమేష్ఠి నీకిడె మహాత్ముడు మానవజన్మ మిచ్చటన్
శ్రీపతి రక్షకుం డగుచు చేయుచునుండె శుభంబు లెంచగా
నా పరమేశ్వరుండెగద! యంతమునున్ ఘటియించువాడు నీ
కీపరమాత్ములం దెవరు నిచ్చట బల్కిరొ యాత్మహత్యకున్? 2.
ఉ.
నష్టము వచ్చె నాకనుచు నమ్మగ బల్కుచునుండు మానవా!
కష్టము లెంచలే ననెడి కారణమున్ జపియించుచుందు వీ
విష్టముతోడ యత్నముల నిందొనరించిన సౌఖ్యమబ్బు నీ
కష్టము తీరదా యిట నకారణ మెంచకు మాత్మహత్యకున్. 3.
ఉ.
పుట్టుచు దెచ్చితే ధనము? పోయెడి వేళను వెంటరాని దీ
పట్టున తృప్తిలేనివిధి భాగ్యము లందెడి యత్నమేల? నీ
కెట్టుల బోధచేయగల రియ్యెడ చూడుము కానిదానికై
పట్టిన పట్టు వీడ వనివార్యమె యాత్మను హత్య చేయుటల్? 4.
ఉ.
నీకు భవంబు నిచ్చిన వినిర్మల భూమికి సేవచేయుచున్
బ్రాకటమైన సద్యశ  మవారితరీతిని బొందకుండ నీ
యాకృతి మార్చి బాధ్యతల నందక నన్నిట దోష మెంచుచున్
జేకొన నాత్మహత్య నిల జేయునె మంగళ మోయి మానవా? 5.
ఉ.
జీవన మద్భుతంబయిన చిన్మయసౌఖ్యయుతంబు, దీనిలో
పావనమైన బంధములు, భాగ్యదముల్ బహుదివ్యభావనల్
చేవను గల్గజేయునవి, చింతిల నేలనొ? వీని నందకే
యీవిధి యాత్మహత్యలకు నెంచుట యుక్తము కాదు మానవా! 6.
ఉ.
జీవనమందు కష్టములు, క్షేమకరంబు లమేయసౌఖ్యముల్
తావక పూర్వకర్మల విధానముచేతనె కల్గు మానవా!
యీవిధి కుందనేల? లభియించును కష్టమువెంట సౌఖ్యమున్
గావడి కుండలట్టులివి, కావున నెంచకు మాత్మహత్యకున్. 7.
ఉ.
క్ష్మాతలమందు జంతువులు సైతము ప్రాణవిహీన లౌటకున్
చేతమునన్ స్మరింపవు విజేతవు విశ్వమునందు జూడ నీ
వీతనువున్ ద్యజించుటకు నీగతి నెంచుచు నాత్మహత్యకున్
భీతిలకుండ సాగుటను విజ్ఞత యందురె? విజ్ఞ! మానవా? 8.
ఉ.
"ఆడగలేక మద్దెలకు నంటగ జూపుట లోడు" "తామిటుల్
పీడలకిందు భీతిలుచు బెంచిన కాయము ద్రుంచుటన్నచో"
వీడగరాదు ప్రాణ మవివేకముతోడ ననేక దుఃఖముల్
ప్రోడతనంబునన్ గెలువ బూనుట యొప్పును మానవాళికిన్. 9.

హ.వేం.స.నా.మూర్తి
25.08.2019.

No comments:

Post a Comment