Sunday 28 August 2016

తెలుగుభాష



తెలుగుభాష
(సీసపద్యమాలిక)

సీ.      శ్రీకరంబై యెల్ల క్షేమంబు లందించి
వెలుగు చుండెడి భాష తెలుగు భాష
మధుర స్వరాలతో మమతలు గురిపించు
తేట తెల్లపుభాష  తెలుగుభాష
కన్నతల్లికి బోలె  కడు సౌఖ్యమందించి
దీప్తి పెంచెడి భాష తెలుగుభాష
పారుష్య మొకయింత పదములం జూపక
తీర్చి యుండెడి భాష తెలుగు భాష
మంచి గంధం బట్లు మహితమౌ హాయిని
కలుగ జేసెడి భాష తెలుగు భాష
టీక, తాత్పర్యంబు లేకుండ భావంబు
తెలియ గల్గెడి భాష తెలుగు భాష
ఆత్మీయతాభావ మందరికిని బంచు
దివ్యమౌ సద్భాష తెలుగు భాష
స్వరము లంతంబందు సౌందర్యమును గూర్చ
నిలిచి యుండిన భాష తెలుగు భాష
యతులు ప్రాసలతోడ నతులితవైభవం
బందుచుండెడి భాష యాంధ్రభాష
ముదమును గలిగించు పదబంధములతోడ
నంద మొల్కెడి భాష యాంధ్రభాష
అలతి శబ్దాలతో నలఘు తాత్పర్యంబు
నందించగల భాష యాంధ్ర భాష
తే.గీ.            అమ్మవంటిది మనభాష యాంధ్రభాష
కమ్మనైనది మనభాష కావ్యభాష
నిరుపమంబౌచు జగతిలో నిర్మలమగు
యశము నందెడు భాష యీ యాంధ్రభాష.

No comments:

Post a Comment