Monday 5 September 2016

శ్రీ గణేశ



శ్రీ విఘ్నేశ్వరాయ నమ:
ఉ.      శ్రీల నొసంగుచుండెదవు, శ్రేయములన్ సమకూర్చు చుందు, వే
కాలము నాచరించు శుభకార్యములందున విఘ్నసంతతుల్
వాలగ నీక గాచెదవు వైభవవృద్ధులు గోరుచుండి యీ
నేల వసించు వారలకు, నిన్ను దలంచెద నో గణాధిపా!
ఉ.      శ్రీకరమున్, శుభావహము, సిద్ధిద, మెల్లెడ భూజనాళికిన్
శోకదవాగ్ని నాశకము, సుందరభావసుశబ్దదాయకం
బై కలిగించు సౌఖ్యముల, నన్నిట సద్విజయంబు లిచ్చుచున్
సాకు త్వదీయ పూజనము శంభుతనూభవ! హే గజాననా!
ఉ.      కోరను ధాన్యరాశులను, గోధనభూకనకాది భాగ్యముల్
కోరను గాక, లోకమున కోర్కులు దీర్చెడి రాజభోగముల్
కోరను, నీదు నామమును కూర్మి జపించెడి శ్రేష్ఠమైన సం
స్కారము నాకొసంగు శుభకామనలన్ దయ నో వినాయకా!
ఉ.      భాద్రపదాఖ్య మాసమున పావనమైన చతుర్థి రోజునన్
రుద్రతనూభవా! భువిని రుగ్మతలం దొలగించి మానవుల్
భద్ర మటంచు బల్కుటకు వత్తువు, తొమ్మిది రోజు లిచ్చటన్
ముద్రిత భక్తిభావమున మ్రొక్కెద గావుము హే గణాధిపా!
ఉ.      వక్రపుతుండమున్, ద్విరదవక్త్రము, బొజ్జయు, శూర్పకర్ణముల్
చక్రము బోలు నాకృతియు, చల్లని చూపులు, నేకదంతమున్
సక్రమమైన వర్తనము, చక్కని సర్పపు యజ్ఞసూత్రమున్
విక్రమదీపితా! సుముఖ! వేలనతుల్ కొను మో గజాననా!
ఉ.      మోదక సంమున్ భవదమో వరంబుల గోరి కూర్చెదన్
మోదము నందజేసి యిల మున్నొనరించిన పాపసంతతిన్
ఖేదము ద్రుంచి గూల్చవలె, క్షేమసమాగమ మొందజేసి మా
వేదన బాపి మాకెపుడు విజ్ఞత నీదగు నో వినాయకా!
ఉ.      విఘ్నము లెల్ల నిన్ను గని విస్తృతభీతిని బారిపోవు పా
ఘ్న! సమస్తసంపదలు భవ్యసుఖంబులు వచ్చి చేరు శ
త్రుఘ్నులు కారె మానవులు తోరపు భక్తిని నిన్ను గొల్వ ని
ర్విఘ్నము లౌచు కార్యములు వెల్గు ఫలాఢ్యములై గణాధిపా!

6 comments:

  1. జయ జయ జయ గణనాయక
    జయ జయ జయ విఘ్ననాశక

    ReplyDelete
  2. మీ గణేశ స్తుతి పద్యాలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

    ReplyDelete
  3. ఆర్యా!
    ధన్యవాదము, నమస్కారములు

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ:

      గణనాథుణ్ణి పార్వతీ దేవి సమయోచితముగా
      తనకు అనుకూలముగా నుండేలా వినోదముగా పిండితో
      సృష్టించి ప్రాణము పోసెను అని అంటారు గదా...!

      మరి "శంభుతనూభవ! హే గజాననా!" ననుటకంటే

      "శంకరనందన! హే గజాననా!" యనుట బాగుగా నుండునేమో
      ఆలోచించేది.

      Delete
    3. ఆర్యా!
      నమస్కారములు. చక్కని సలహా ఇచ్చారు. అట్లన్నచో మిక్కిలి సముచితముగా ఉండును. ధన్యవాదములు.

      Delete