Sunday 14 August 2016

కృష్ణాపుష్కరాలు


 


శ్రీకరమీ పుష్కరవిధి
యాకరము సుఖాలకింక హర్షదమౌచున్
చేకుర జేయును సఫలం
బాకాంక్షలను పితృదేవతాశీస్సులతోన్.

పదిరెండు వత్సరంబుల
నదనెంచి ప్రవేశమందు నాపుష్కరుడీ
నదులందు క్రమత జూపుచు
సదయుండై శుభములొసగు సద్భావముతోన్.


గురు డాత్మగతిని జూపుచు
నరయంగా కన్యలోని కానందమునన్
సురుచిరముగ జేరినచో
నిరుపమయగు కృష్ణకగును నిత్యోత్సవముల్.


భవమంది పశ్చిమంబున
జవమున పూర్వంపు దిశకు సత్త్వోన్నతవై
స్తవనీయ వగుచు చేరెద
వవురా! కొను కృష్ణవేణి యభివాదములన్.


నీవేగు మార్గమందున
పావనమౌ క్షేత్రరాజి బహువరదముగా
భావింపబడుచు నుండును
దేవీ! నీసాహచర్య దీప్తిని గృష్ణా!


ఈపుష్కరకాలంబున
నీపంచను జేరు జనుల నిఖిలాఘములన్
కోపాది దుర్గుణంబుల
బాపంగా కృష్ణవేణి! ప్రార్థింతు నినున్.

No comments:

Post a Comment