Monday 7 October 2019

శ్రీ దుర్గాశతకము


శ్రీ దుర్గా శతకము

శ్రీమాతా! నిను గొల్తుము
కామితములు దీర్చి మమ్ము కావుము సతతం
బేమాత్రం బలసత్వము
మామనముల కంటకుండ మహిలో దుర్గా!                  1.

నీవిల దల్లివి గావున
పావనతను గూర్చి మాకు భావము లందున్  
దైవంబుల యెడ భక్తిని
ధీవైభవ మెసగ నిమ్ము స్థిరముగ దుర్గా!                      2.

తల్లికి దనప్రియతనయుల
యుల్లంబులలోన శుద్ధి యురుతర భావం
బెల్లెడలను సద్వర్తన
లొల్లక చేకూర్చ దగదె? యొప్పుగ దుర్గా!                   3.

నీవొక్కతె వీజగతిని
దైవంబుల కెల్ల గొప్ప దైవమ వగుటన్
దేవీ! నిన్నే కొలిచెద
కావుము నీతనయు నన్ను గరుణను దుర్గా!                4.


నీనామమె జపియింతును
మానక నీచరితలెల్ల మక్కువతోడన్
జ్ఞానద వగుటను జదివెద
దీనప! నన్గావు కరుణ దీపిల దుర్గా!                          5.

తల్లులకు దల్లి వీవని
యెల్లరు తల్లులును నిన్ను నిచ్చట నిత్యం
బుల్లాసంబున గొల్తురు
తల్లీ! నీకెపుడు గూర్తు స్తవములు దుర్గా!                     6.  

దుష్టులను జగతి కెల్లెడ
కష్టంబులు గూర్చునట్టి కఠినాత్ముల, బా
పిష్టులను గూల్చి జగతికి
దుష్టిని జేకూర్చు మమ్మ దోడ్తన దుర్గా!                      7.

కలియుగ మిదియై యుండుట
నిలలో సద్భావ మన్న నేహ్యత హెచ్చెన్
వలదని చెప్పుట యిట నీ
వలనయె సాధ్యంబుగాన బలుకుము దుర్గా!                8.

అమ్మవు నీవనియెడి నా
నమ్మకమును వమ్ముచేసి నను కష్టములం
దమ్మా! త్రోయక సద్గుణ
మిమ్మా! శుభ మొదవు కొరకు నెప్పుడు దుర్గా!             9.

నను ప్రజ్ఞాన్వితు జేయుము
నతర సంపదల నొసగి కావు మటంచున్
నిను గోరను నీపదముల
ననిశము గొల్వంగ శక్తి నడిగెద దుర్గా!                       10.

దనుజుల గూల్చిన విధమున
మనుజులలో నిలిచియున్న మత్సరభూతం
బును గాల్చగ వలెనమ్మా!
యనుపమ కరుణాలవాల! వగుటను దుర్గా!                11.

కులధర్మము ద్వేషించుచు
నిలలో మోహంబుతోడ నితరము లందున్
మెలగెడి నేటి జనాలకు
తలపున సవ్యత్వమొసగ దగదా? దుర్గా!                    12.

హరిహరులు బ్రహ్మ సురలును
సురుచిరగతి నీవు సేయు సూచనతోడన్
నెరపుదురు విధుల ననిశము
కరుణామయి! నీకు సాటి గలరా దుర్గా!                     13.

ఫాలేక్షణు దేహంబున
మేలీ జగములకు గూర్చ మించిన రుచితో
దాలిమిని జూపి నిలిచిన
యో లలితా! నతులు గొనుట యొప్పును దుర్గా!         14.

బహునామ రూపధారివి
యిహమున బరమందు జనుల కీప్సిత హర్షం
బహరహము గూర్చు దానవు
మహిమాన్విత! నీకు నతుల మాలలు దుర్గా!               15.

లోకములను రక్షించెడి
యేకైక సులక్ష్య మూని యిలవారలలో
చీకాకులు దొలగించెడి
నీకొనరించెదను నతులు నిత్యము దుర్గా!                  16.

ఏరీ నీసరి దైవము
లీరేడు జగంబులందు నీవిధి ప్రజలన్
గారవము గూర్చి గాచెడి
వారలు నీ వందుకొనుము ప్రణతులు దుర్గా!               17.

నిను బూజించు విధానము
లను నే నేర్వంగలేదు లలితపదాలన్
నిను నుతియించుట యెరుగను
జననీ! తచ్ఛక్తినొసగ జాలవె దుర్గా!                          18.

నేనొక మూఢుడ నగుటను
దీనులలో బాలలందు దీపిలు నిన్నున్
కానంగ లేక పోయితి
జ్ఞానద వయి కావదగదె జన్మద! దుర్గా!                              19.

జననీ! నీనామములకు
ననుపమమగు మహిమ గలదు హర్షము తోడన్
మనమున స్మరియించెద నిను
ననిశము సత్వంబు గూర్చు మమ్మరొ దుర్గా!              20.

నీవే వాణివి లక్ష్మివి
నీవే లోకములయందు నిత్యసుఖంబుల్
సూనృతచరితుల కొసగెడి
దానవు శక్తివి గదమ్మ దండము దుర్గా!                      21.

నిన్నర్చించెడి భాగ్యం
బెన్నో జన్మంబులందు నేర్పడ సుకృతం
బెన్నంగదగిన రీతిని
మున్నొనరించుటను గలుగు మోక్షద! దుర్గా!               22.

నీకొరకు భూతబలులను
శ్రీకరము లటంచు నమ్మి చేకూర్తు రిలన్
స్వీకార్యములా నీకవి
ప్రాకటముగ దెల్పరాదె వసుధను దుర్గా!                    23.

ఇడుములు గల్గిన వేళల
నిడుమమ్మా! సత్వ మనుచు నెంతురు నిన్నున్
గడుసరులు సౌఖ్య మందున
బుడమిని నిను దలపరైరి పొగరున దుర్గా!                   24.

కలకాలము సత్యంబున
నిలబడగల శక్తి మరియు నిర్మల హృదితో
మెలగుచు సజ్జన సేవల
నలయక నొనరించు సత్వ మడిగెద దుర్గా!                  25.

పిలిచిన పలుక వదేలా
తలపులలో దోసమెంచి దండించుటకై
తలచితివా? యీ మూఢుని
తలపును సరిచేయలేవె తగువిధి దుర్గా!                     26.

దండంబులు జగదీశ్వరి!
దండంబులు శీతశైలతనయా! నీవే
యండవు మాకయి గాచుచు
నుండంగా నొరు లికేల నుర్విని దుర్గా!                       27.  

బెజవాడ పురము నందున
విజయంబులు క్షేమరాశి విస్తృత ముగ నీ
ప్రజకీయ జేరియుంటివి
నిజమిది గొలిచెదను నిన్ను నిత్యము దుర్గా!               28.

జగములకు దయను బంచెడి
నిగమాగమవినుత! మాత! నిర్మలచరితా!
భగవతి! మృత్యుంజయసతి!
యగజా! నేనొసగు ప్రణతు లందుము దుర్గా!              29.

హేసింహవాహినీ! యుమ!
హేసర్వశుభప్రదాత్రి!హే గౌరి! శివా!
హేసవ్యభావదీపిత!
చేసెద సద్భక్తి నతులు చేకొను దుర్గా!                       30.

పార్వతి!గౌరీ!శాంకరి!
సర్వేశ్వరి! కాళి!శక్తి! చండి! భవానీ!
శర్వాణి! సర్వమంగళ!
యుర్వీధరపుత్రి! ప్రణతు లొసగెద  దుర్గా!                 31.

హైమవతీ! గిరిజా! శివ!
భూమీధరరాజదుహిత! ఫుల్లాబ్జాక్షీ!
క్షేమంకరి! హే శాంకరి!
నీమంబున గొల్తు నిన్ను నిత్యము దుర్గా!                   32.

కామారిదేహసంస్థిత!
వామాంగీ! యాద్య! సింహవాహన! కాళీ!
శ్రీమాత! శాస్త్రసన్నుత!
నీమం బొనగూడు గొలువ నిన్నిల దుర్గా!                  33.

తల్లివి, త్రాతవు దైవమ
వెల్లరకును నీవు గాన నెల్లవిధాలన్
చల్లగ జూడుము నీప్రజ
కెల్లెడలను హర్ష మమర నెన్నడు దుర్గా!                     35.

అమ్మా! నీపద సన్నిధి
యిమ్మహి జేకూర్చు నెప్పు డిహపరసుఖముల్
ముమ్మాటికి సత్యం బిది
నమ్మిన హర్షంబు గూడు నరునకు దుర్గా!                  36.

దైవం బన్నది లేదను
భావంబున మూఢు లగుచు పలికెడి ప్రజకున్
దేవీ సత్యము నెరుగగ
తావక మహిమలను జూప దగదా దుర్గా!                   37.

ఆశలభూతం బిలలో
ధీశాలురలోననైన తేజశ్శక్తిన్
నాశనము చేయుచున్నది
నీశక్తిని జూపవలయు నిజముగ దుర్గా!                      38.

బంధుప్రీతి యణంగగ
సైంధవులై మానవాళి సర్వవిధాలన్
సంధించుచుండి రయుత
బంధంబులు చూడు మమ్మ వసుధను దుర్గా!              39.

ఆలోచనలకు సరిపడ
నాలాపము చేయువార లవనీస్థలిలో
నేలాగు జూడ గనబడ
రేలా? కలికాల మగుట నిచ్చట దుర్గా!                       40.

నా కుక్షి నిండ జాలును
చీకాకులు చేరకుండ సేమంబుగ నే
నేకాల ముండవలయును
ప్రాకటముగ ననుట జనుని స్వార్థము దుర్గా!               41.

అందరు బాగుండగవలె
నందరిలో నేనొకండ నని యెంచిడివా
డెందున్న సుఖము లందుచు
నందలముల నెక్క గలుగు నవనిని దుర్గా!                  42.

జననీ జనకుల పదముల
కనుదినమును మ్రొక్కుచుండి యవిరళ భక్తిన్
నతరముగ సేవించెడి
మనుజుడు  ధన్యతను గాంచు మహిలో దుర్గా!                    43.

వనితలను గౌరవించెడి
మన మేకాలంబునందు మనుజులలోనన్
కనిపింప జేయు మనుచును
నిను గొలిచెద సత్యమమ్మ నిత్యము దుర్గా!                44.

పావన హిందూ సంస్కృతి
నేవిధమున నష్టపరుప నెవ్వండైనన్
దేవీ! యత్నము జేసిన
జీవితమున సుఖము గనడు సిద్ధము దుర్గా!                 45.

దండంబులు దాక్షాయణి!
దండంబులు దనుజహంత్రి! దండము తల్లీ!
దండంబులు ధర్మస్థిత!
దండంబు లుదాభరిత! దండము దుర్గా!                    46.

పలుకులలో మార్దవమును
జిలికించుచు నమ్మజూపి చేతం బందున్
బలురీతుల గలుషములను
దలచెడి వారలకు శిక్ష తగుగద, దుర్గా!                       47.

తనవారలు  పెరవారని
యనుచితమగు భావ మెదకు నంటనిరీతిన్
మనుజులకు మమత బంచెడి
నులకు మనికి సుఖమయము గావలె దుర్గా!             48.

నినుగొల్వ బూను వేళల
ననుదినమును మానసమున ననుచిత వాంఛల్
నను జేరుచున్న వీస్థితి
ననుకంపను జూపి యాపు మమ్మా! దుర్గా!                49.

పూజలు తెలియని వాడను
తేజోహీనుడను ఖలుడ దేవీ! వినుమా!
ధీజాడ్య మణచి దయతో
నీ జడునకు రక్షయొసగు మెల్లెడ దుర్గా!                     50.

అనవసరపు వాంఛలతో
నకాలము వ్యర్థమయ్యె కాయము నందున్
మునుపటి సత్తువ చిత్తయె
విను నన్నెట్లైనగావ వేడెద దుర్గా!                             51.

కరుణామయి! కల్యాణీ!
శరణాగతవత్సల! యుమ! జయ శర్వాణీ!
వరదాయిని! రుద్రాణీ!
వరసుమపాశాంకుశశరపాణీ! దుర్గా!                          52.

నీకోసమె సుమశరుడపు
డాకారము గోలుపోయె, హరుదేహమునన్
లోకోత్తరముగ నుంటివి
నీకా మనసిజుని గావ నేరమె దుర్గా!                          53.

వేదస్తుతవై వెలుగుచు
ఖేదంబులు మాన్పునట్టి గిరిరాజసుతా!
నీదే భారము జగతిని
వాదన లేకుండ గావ వలయును దుర్గా!                     54.

నవరాత్ర దీక్ష జేకొని
యవిరళముగ నిన్ను గొలువ నసంఘంబుల్
జవమున భస్మాకారము
లవనిని దాల్చుటయె సత్యమమ్మా! దుర్గా!                 55.  

అష్టాదశపీఠములం
దిష్టముగా వెలసియుంటి విడుములు బాపన్
దుష్టాత్ముల దునుమంగా
నష్టైశ్వర్యము లొసంగ నవనిని దుర్గా!                       56.

అధికారమేల ఖలులకు
వ్యధలకు లోకమును ద్రోయు వారల కిచటన్
బుధగౌరవ మందించెడి
విధమున కే కతము తెలుప వినతులు దుర్గా!               57.

అవసరము లేక యున్నను
వివిధములౌ విధములందు విస్తృతరీతిన్
భువివారు బొంకు లాడుట
నవతాధర్మంబు లయ్యె నమ్ముము దుర్గా!                 58.

నీదర్శన భాగ్యంబున
రాదెన్నడు కష్టపంక్తి రక్కసి మూకల్
ఖేదంబున వెనుదిరుగును
నీదేభారమ్ము సుఖము నింపగ దుర్గా!                       59.

సూనృతవాక్యము లాడుట
లీనాడిట భారమయ్యె యించుక యేనిన్
మానక పల్కుట లనృతము
మానవునకు కృత్యమయ్యె మహిపయి దుర్గా!             60.

ధరలం బరమును దాకగ
ధరపయి సామాన్యజనులు త్రాగుటకైనన్
దొరకదు గంజియు నీస్థితి
వరదాయిని తొలగద్రోయ వలదా దుర్గా!                    61.

కనుమూసి పాలు త్రాగుచు
తననెవ్వరు గాంచ రనుచు కడుహర్షితయై
మనుచుండు పిల్లియట్టుల
మనుజుడు పాపంబు చేయు మానడు దుర్గా!              62.

దేవాలయమున కేగుట
కావలెనని దాన మిడుట కడు హర్షముతో
పావనతను జూపించుట
కావేవియు నరుని నైజకర్మలు దుర్గా!                        63.

సన్మార్గగముల జూచుచు
తన్మయతను బొందలేక దౌష్ట్యంబున వి
ద్వన్మణులగువారి క
సన్మతియయి కీడు చేయ సరియా దుర్గా!                  64.

తానే నుడను భావన
మానవునకు మనమునంద మానుషరీతిన్
కానని వానిని జేయుచు
తానయి వాసంబు చేయు తథ్యము దుర్గా!                 65.

గురుసన్నుతి నిత్యం బే
నరు డొనరించు వాని నమ్మక మందున్
స్థిరమై సఫలతయుండుట
లరయంగా వచ్చు ధరణి నమ్మా దుర్గా!                    66.

నినుగంటి పేదవానికి
తనసంపద బంచిపెట్టు ధన్యునిలోనన్
జనహితమున కార్యంబుల
ననిశంబును జేయువాని యందున దుర్గా!                  67.

శక్తివి నీవనుచును వి
ధ్యుక్తంబుగ గొల్చునట్టి యుర్వీప్రజకున్
ముక్తి నొసంగెడి పని నా
సక్తత జూపించుటెల్ల సరియగు దుర్గా!                       68.

ధనమున్నది నాకంచును
జను డతిమదమునను దుముకు సర్వవిధాలన్
జనియించునపుడు తెచ్చెనె?
కొనిపోవునె మరణమందు గొనకొని దుర్గా!                  69.

జీవన మొక బుద్బుదమను
భావం బొకయింతలేక బహుకాలమిలన్
జీవించ గోరు మానవు
డేవిధి జ్ఞానంబు గూర్తు వితనికి దుర్గా!                       70.

పలుకాయలు పత్రంబులు
నిలలో భక్షింపనుండ యీ మనుజుడు తా
దలపెట్టును జీవంబుల
తలలను ఖండించు కొరకు దడయక దుర్గా!                71. 

లేదొకదైవం బంచును
వాదించును మూర్ఖుడౌచు వాని కసాధ్యం
బేదియు లేదను మనుజుడు
కాదా మృత్యువుకు వశుడు కనినన్ దుర్గా!                 72.

నాదేశమందు భక్తియు
మోదము హృది నిల్పగల్గు మునిజనులందున్
సాదర భావము నాకిడి
నీదయ జూపించు మమ్మ నిత్యము దుర్గా!                73.

పలురకముల లాంఛనముల
కలయక సంపదల నంది వ్యర్థముచేయున్
గలిమిని బంచగ నెంచడు
నలుగురిలో మానవుండు నమ్ముము దుర్గా!               74.

ఇతరులకయి యనునిత్యము
క్షితి దున్నుచు సేవచేయు కృషకుని కొరకై
యతులిత వాత్సల్యాన్విత!
స్తుతమతి! దయ యించుకైన చూపుము దుర్గా!           75.

కరుణానిధి వని పలికెద
రరయుము రక్షకులులేని యార్తుల యార్తిన్
సురగణమునిజనవందిత!
స్థిరయశ! మావందనమ్ము చేకొని దుర్గా!                    76.

అంగీకరించి యిచ్చట
సంగంబులు వీడినాము సన్న్యాసుల మం
చింగితము దెల్పువారల
సంగతులను జెప్ప దరమె జననీ! దుర్గా!                   77.

తామే దైవంబులమని
కామితములు దీర్తుమంచు కడగి జనాలన్
ప్రేమించు నటుల నుండెడి
కామనలకు నంతమిందు గలదా దుర్గా!                     78.

కాషాయపు ముసుగును గొని
ద్వేషము విడనాడలేక దీనజనాలన్
రోషంబున దూషించుట
కీషణ్మాత్రంబు భీతి నెరుగరు దుర్గా!                        79.

యోగుల మందురు సర్వము
త్యాగము చేసితిమి జనుల యాతన ద్రుంచన్
భోగము లందురు బహువిధ
రాగంబులు వీడలేరు భ్రష్టులు దుర్గా!                        80.
ఋతుధర్మంబులు సరిగా
క్షితిపయి జరుగమికి జనుల చిత్తములందున్
గతిదప్పిన యోచనలే
ద్యుతిదాయీ! కారణంబు లోయమ! దుర్గా!               81.

స్వాములుగా నటియించుచు
నీమంబున భక్తజనుల నిఖిల సుఖంబుల్
తామై హరియించెడి యా
కాముకులకు శిక్ష యొండు కలదా దుర్గా!                   82.

ఉదయాదిగ నజాలము
సదమలహృదయారవింద! స్వాంతమునందున్
మెదలుచు నను బీడించును
సదయా! కావంగవలయు జననీ! దుర్గా!                    83.

భగవద్భక్తిని జనులకు
నిగమాగమవినుత! మాత! నిర్మలచరితా!
యగణితమహిమాన్వీతా!
యగజా!యందించవలయు నమ్మా! దుర్గా!               84.

విద్యల నేవిధి నేర్చిన
హృద్యంబగు స్వీయధర్మ మెంతయు బ్రీతిన్
సద్యత్నంబున దాల్చుట
కుద్యుక్తుల జేయ జనుల నొప్పును దుర్గా!                  85.
అవినీతి పెరిగిపోయిన
దవనిని సత్యమ్ము నమ్ము మమ్మా! గిరిజా!
స్తవనీయా! యణచుటకయి
జవమున నీశక్తి జూప దగదా దుర్గా!                         86.

బలహీనుని బీడించుట
యిలలో సర్వత్ర నిండె నేవిధినైనన్
నిలబెట్టగ బాధితులను
దలపక వీక్షించుచుండ దగునా దుర్గా!                       87.

నీవీ జగతికి జననివి
కావా? భ్రష్టత్వ మిందు గాంచగలేవా?
రావా దౌష్ట్యము నణచగ
దీవీ! యాలస్యమేల? తెలుపుము దుర్గా!                    88.

ఒకటో రెండో పద్యము
లకటా చెప్పంగ నేర్చి నంతనె కవినం
చకలుషశుభగుణదాయీ!
ప్రకటించెడివాడు మూర్ఖవాచ్యుడు దుర్గా!                   89.

తనకవితను సంఘంబున
ఘనతరముగ జేరియున్న కలుషంబులకున్
సునిశిత బాణాగ్నికి వలె
ననయము నిర్మించువాడె యార్యుడు దుర్గా!              90.
పరులను హింసించుటయే
నరులకు నీనాడు చూడ నాగరికతయై
చరియించుచు నుండిరి కద
యరయగ నిను వేడుచుంటి నమ్మా! దుర్గా!                91.

ఇలపై జన్మం బొసగిన
తలిదండ్రులకన్న భార్య తనయుల కన్నన్
నరునకు మిత్రులకన్నను
మరి ధనమే యధికమయ్యె మాతా! దుర్గా!                 92.

పరధనముల నాశించక
దొరికిన ఫలముననె కనుచు తోరపు తృప్తిన్
జరియించెడి వాడిప్పుడు
నరుడయి కొరగానివాడు నమ్ముము దుర్గా!                93.

ఖల శబ్దపు టర్థము నే
డిలలో నిట మారిపోయె నెల్లవిధాలన్
పలుకులలో మార్దవ్యము
తలపున సద్భావ మెపుడు దాల్చుట దుర్గా!                94.

సన్మతికి చోటు లేదిట
నున్మత్తుల కన్నిగతుల నురుతర దౌష్ట్యా
లన్మది నెంచుచు నిరతము
తన్మయులగు వారు మనెడి తావిది దుర్గా!                 95.
వందనము దైత్యనాశిని!
వందనము గిరీశురాణి! వరకల్యాణీ!
వందనముపాశపాణీ!
వందనమిదె స్వీకరింపవలయును దుర్గా!                   96.

నిన్నే నమ్మితి నమ్మా!
మున్నేటిని జటలలోన మోడము తోడన్
గ్రన్ననదాల్చిన శంభున
కున్నతయశమందజేయు చుండెడి దుర్గా!                  97.

పాలకులలోన సన్మతి
యేలా కలిగించజూడ వీభువిలోనన్
ప్రాలేయాచలపుత్రీ!
మాలిన్యము నిండె వీరి మనముల దుర్గా!                   98.

పండితుని జేయబూనెద
వండగ నీవుండి జగతి నద్భుతరీతిన్
కొండలరాయని దుహితా!
దండంబుల నొసగుచుండు ధన్యుని దుర్గా!                 99.

నినుగొల్వగ సౌఖ్యంబులు
నతరముగ నబ్బెనేని కడుఃఖమునన్
మునుగుట జరిగిన నంతయు
విను మమ్మా! మదిని ముదమె వెలయును దుర్గా!         100.
నాపూజ లందుకొన్నను
చూపక యనురాగలవము సురుగు మటన్నన్
నీపాదపద్మసేవల
నోపార్వతి! నిజము వదలకుండెద దుర్గా!                   101.

నను గేలిసేయ నేలనొ
వినుమమ్మా! నీదుసుతుడ వివిధాగమముల్
నతరముగ నేర్వనితన
మనదగునా దోసమంచు ననయము దుర్గా!                102.

నీసేవ కొరకు బుట్టితి
నీసేవకు బెరిగినాడ నేను భవానీ!
నీసేవనె మరణించెడి
భాసురతను గూర్చుమమ్మ పావని! దుర్గా!                103.

సర్వేశ్వరి! సుఖదాయిని!
దుర్వారానంతదుఃఖదూరిణి! గౌరీ!
సర్వైశ్వర్యవిధాయిని!
పార్వతి! రక్షించుమమ్మ ప్రణతులు దుర్గా!                 104.

కాత్యాయని! పరమేశ్వరి!
నిత్యామితసౌఖ్యదాయి! నిస్తులఫలదా!
భృత్యులను గాంచుచుండెడి
దైత్యఘ్నీ! కావుమమ్మ తడయక దుర్గా!                    105.
దాక్షాయణి! దనుజఘ్నీ!
దక్షాధ్వరనాశకార్యధారిణి! యగజా!
రాక్షసయత్నవిఘాతిని!
రక్షించుము దయను జూపి రయమున దుర్గా!             106.

ప్రణుతించెద శర్వాణీ!
గణుతించెద నీదు మహిమ కను కల్యాణీ!
గణనాయకపితృరాణీ!
మణినిభ మృదు మధురవాణి! మరువను దుర్గా!         107.

వందనములు చేకొనుమిదె
సుందరవదనారవింద! సురుచిర గాత్రా!
వందారులోకవత్సల!
వందనములు శంభురాణి! వరగుణ!  దుర్గా!                108.

అంబా! శాంభవి! కాళీ!
సంబరములు నింపుమమ్మ! సకలజగానన్!
సంబోధించెద ననిశము
లంబోదరజన్మదాతృలలనా! దుర్గా!                        109.

అవలీలగ దానవులను
స్తవనీయా! సంహరించి తగు హర్షంబీ
వవనికి గూర్చెద వనియెద
రవినీతిని గూల్చవేల నమ్మా! దుర్గా!                        110.
ధరణీస్థలమున నేడిట
సురుచిరబంధంబు లన్ని సురిగిన వమ్మా!
కరుణించుము రుద్రాణీ!
సరియగు భావంబు మదుల సాగగ దుర్గా!                 111.

సహవాసము కృత్రిమమై
యిహమున నాపదల బెంచె నీయుగమున నీ
మహిమను జూపుచు నిచ్చట
విహరించగ వినతి నీకు వినవలె దుర్గా!                      112.

నీవే జగమును జూపితి
వీవే పెరుగంగ జేసి తిట నను దల్లీ!
నీవే రక్షణ చేయగ
రావలె నుతియింతునమ్మ రయమున దుర్గా!            113.

మందుడనగు నాచేతను
సుందరమగు పద్యశతము సురుచిర రీతిన్
కందంబుల వ్రాయించితి
వందుము వందన శతమ్ము లనయము దుర్గా!          114.

ఈపద్య శతము నెవ్వరు
దీపిల్లెడి భక్తితోడ స్థిరతర బుద్ధిన్
హేపార్వతి బఠియింతురు
చూపుము దయవారియందు సుముఖత దుర్గా!          115.

No comments:

Post a Comment