Tuesday 1 October 2019

ఆశావాదం చేయించే అద్భుతాలు


ఆశావాదం చేయించే అద్భుతాలు
శా.
ఆశావాదముచేత మానవు డిలన్ హర్షంబులన్ గాంచు న
య్యాశావాదమె లక్ష్యసాధనకునై యందించుచున్ సత్వముల్

నాశం బందగజేయు బద్ధకములన్ నైజప్రభావంబునన్
ధీశాలుల్ గ్రహియింతు రీవిషయమున్ తేజోమయస్ఫూర్తితోన్.                  1.
సీ.
విజయంబు లందించు వివిధరూపాలలో
                   విజ్ఞానమును జూపు విస్తృతముగ
చిత్తంబు వికసింప జేయు నద్దానితో
                   భావవైశాల్యంపు చేవ బెంచు
మానవత్వములోని మహిమను బ్రకటించు
                   సన్మార్గగమనైకసరణి దెలుపు
సాధువర్తన నేర్పి సర్వోత్తమంబైన
                   కర్మంబునం దిచ్ఛ కలుగజేయు
తే.గీ.
ఆశ యొక్కటి మనుజున కన్నిగతుల
నండ యౌచును చేయూత నందజేసి
జీవనంబున సుఖములు చేర్చు చుండి
కోరికలు దీర్చు ధైర్యమ్ము కూర్చుచుండి.                                                 2.
సీ.
ఆశయే సంద్రాన నమృతమ్ము పుట్టించె
పారతంత్ర్యము నిందు బారద్రోలె
ఆశయే సురగంగ నవనికి రప్పించె
చెనటుల నిలలోన జిదిమివైచె
ఆశయే మానవు నంతరిక్షము జేర్చె
ననుపమానందంబు నందజేసె
ఆశయే యణుశక్తి నవనినందగజేసె
మనుజుల నీనేల మునులజేసె
తే.గీ.
ఆశ సర్వార్థకాంక్షులౌ యవనిజులకు
ధైర్య మొసగుచు జీవనాధారమగుచు
నూహకందనిరీతిలో నుత్సహించి
యనిశమిచ్చట ఘటియించు నద్భుతములు.                                         3.

No comments:

Post a Comment