Monday 7 October 2019

శ్రీ హరిశతకము


శ్రీరామ
శ్రీ హరిశతకము
10.09.2019
(కందములు)
శ్రీపతి! కౌస్తుభధారీ!
పాపాపహ! దానవారి! వనసంచారీ!
చూపుము త్వత్కృప శౌరీ!
నీపయి పద్యములమాల నిలిపెదను హరీ!                            1.

నిత్యము నిను నే గొలిచెద
గృత్యంబులలోన యుక్తి కేవల భక్తిన్
సత్యము బలికెడి శక్తిని
బ్రత్యహమును నాకు నీయవలె వినుము హరీ!            2.

నారాయణ! ఖగవాహన!
కారుణ్యపయోధి! విష్ణు! కల్యాణగుణా!
నీరేజపత్రలోచన!
యేరీ నినుబోలు త్రాత లిలపయిని హరీ!                            3.

నీహస్తమందు చక్రము
దేహంబున దివ్యదీప్తి స్థిరతరసత్త్వం
బాహవమున, నిను గని దా
సోహమ్మన గాచు రీతి యున్నతము హరీ!                4.


ఏక్షణమున నిను దలచిన
నాక్షణమున నాలసించ కతివత్సలతన్
రక్షించగ జేరెద విదె
సాక్ష్యం బా కరిరాజదివ్యచరితమ్ము హరీ!                            5.

దశావతారములు
మత్స్యావతారము:
మీనమవై యలనాడిట
మానితముగ వేదరాశి మహిమము గావన్
దీనోద్ధారక! వెలసితి
వానందముతోడ గనగ నద్భుతము హరీ!                            6.

కూర్మావతారము:
కూర్మమవై సంద్రంబున
నర్మిలి నా కొండ మునుగ నద్దానిని  హే
ధర్మాత్మ! యుద్ధరించిన
కర్మంబది యద్వితీయ కార్యంబు హరీ!                              7.

వరాహావతారము:
అలనాడు సూకరంబయి
ఖలుడగు రక్కసుని ద్రుంచి కడు దక్షతతో
నిలగాచి వేదరాశిని
నిలబెట్టిన నిన్ను గొలుతు నిత్యమ్ము హరీ!                 8.



నరసింహావతారము:
నరసింహరూప మందుచు
స్థిరతసద్భక్తి నిన్ను జీరిన బాలున్
ధరపయిని నిలుప బూనుచు
నరియగు నా దైత్యు ద్రుంచు  టరసితిమి హరీ!            9.

వామనావతారము:
వామనమూర్తిగ జని నీ
కామన తెలియంగ జూపి నుడగు బలికిన్
ధీమతికి సముచితంబగు
సీమను జూపించినట్టి శ్రేష్ఠుడవు హరీ!                       10.

పరుశురామావతారము:
పరశువును జేత బట్టుచు
నరపతులను ద్రుంచి భువిని నానాగతులన్
సురిచిరమగు యశమందిన
వరదాయక! నీదుసేవ వరమిలను హరీ!                     11.

శ్రీరామావతారము:
రాముడవై పదిశిరముల
కామాంధుని రావణాఖ్యు గాలుని పురికిన్
క్షేమము ద్రుంచుచు బంపిన
నీమహిమం బున్నతంబు నిరుపమము హరీ!               12.



శ్రీకృష్ణావతారము:
కన్నా! మృద్భక్షణ మెటు
లన్నా? యని తల్లి పలుక నామెకు ముఖమం
దున్నతముగ  భువనంబుల
నన్నింటిని జూపినాడ వద్భుతము హరీ!                             13.

బుద్ధావతారము:
బుద్ధుడవై జరియించితి
విద్ధరణికి హితము గూర్చి యెంతయు బ్రీతిన్
సద్ధర్మం బిట నిలుపగ
శౌద్ధోదన! నీకు జేతు సన్నుతులు హరీ!                              14.

కల్క్యవతారము:
కలియుగమునందు నెల్లెడ
నిలపయి నణగారు ధర్మ మెప్పటి యట్టుల్
నిలుపగ గల్క్యవతారం
బలఘుయశా! దాల్తు వందు రందరును హరీ!              15.

గోపాలా! మాపాలిటి
పాపంబులు గూల్చునట్టి పావనమూర్తీ!
చూపితివి నీమహత్వము
తాపసవరదాత! భక్తతతులకును హరీ!                      16.




నిను జంపగ దుర్మతియై
చనుబాలను విషమునింపి చనుదెంచిన యా
దనుజాతను యమపురమున
కనఘాత్మా! బంపినాడ వలనాడు హరీ!                     17.

శకటంబయి యొకరక్కసు
డకటా! నిను జంపబూని యరుదెంచగ నా
వికలాత్ముని గని మృత్యువు
నకు నతిథిని జేయు నిన్ను నమ్మితిని హరీ!                18.

ధేనువుల మందలోపల
దానును జరియించునట్టి దానవుని ఖలున్
మానసము నెరిగి గూల్చిన
వానిని నిను సన్నుతింతు వాస్తవము హరీ!                  19.

పరిపరివిధముల జనకుల
కురుతరకష్టములు గూర్చి యొప్పని నిన్నున్
పరిమార్చ బూను కంసుని
హరిపురమున కంపినాడ వనుపమము హరీ!               20.

స్వామీ! జగదాధారా!
మామానసములను నిల్చి మాన్యతనిడు నా
నతరభావము లందగ
జ్ఞానప్రద! చూడుమయ్య సన్నుతులు హరీ!               21.


లీలామానుషవేషా!
ఫాలేక్షణతోష! భక్తవరజనపోషా!
లాలిత మణిగణభూషా!
నీలాభ్రసమానదేహ! నిను గొలుతు హరీ!                            ౨౨.

కరిరాజవరద! సుఖదా!
నిరుపమ కరుణాలవాల! నిజజనపాలా!
సురుచిరసుందరకాయా!
పరిపాలయ మామటంచు బ్రార్థింతు హరీ!                  23.

నిను నే ననిశము దలచెద
మునిజనసంస్తూయమాన! మురహర! నానా
దనుజాంతక! కావుమయా!
యనుదినహర్షంబు గూర్చి యన్నింట హరీ!                24.

పద్మాక్ష! పద్మనాభా!
పద్మోద్భవజన్మదాత! పద్మేశ! సదా
పద్మాదినిధివిధాయక!
పద్మంబుల గొలిచి గావ బ్రార్థింతు హరీ!                             25.

పాండవులకు ధర్మంబున
నండవు నీవౌచు సాకి యనుపమయశముల్
మెండుగ జేకూర్చితివయ!
దండంబులు సేతు నీకు దయజూడు హరీ!                 26.


రండో బాలకు లంచును
నిండుగ వ్యాపించుచున్న నిఖిలాగ్నులనున్
దండించురీతి మ్రింగితి
వండగ గోపాలబాలకావళికి హరీ!                                      27.

ధర్మంబులు రక్షింపగ
మర్మజ్ఞా! దూతవగుచు మాధవ!(మామకు) యీదు
ష్కర్మంబు నాపు మంచును
నిర్మలమతి బోధజేసి నిలిచితివి హరీ!.                      28.

సతతము జీవన మందున
నతులిత సౌఖ్యంబు లందదగు మార్గములన్
జతురత భగవద్గీతగ
క్షితివారికి జూపు నీకు జే యందు హరీ!                     29.

భగవానుండవు నీవయి
యగణిత వత్సలతతోడ నర్జునుని కెడన్
తగునని సఖ్యత జూపిన
జగదీశా! గొలుతు నిన్ను సతతంబు హరీ!                  30.

అవగుణుడగు శిశుపాలుని
స్తవనీయా! దోషశతము సైచుచు నంతం
బవలీలగ నొనరించిన
భవదీయ పరాక్రమమును బ్రణుతింతు హరీ!              31.


ఆపదలో నిను బిలువగ
ద్రౌపది మానంబు గాచి ధరణీస్థలిలో
జూపితివి భ్రాతృధర్మము
శ్రీపతి! నీవందుమయ్య! జేజేలు హరీ!                     31.

తోరంబగు సద్భక్తిని
నీరేడు జగాలలోన నెల్లసురాళిన్
గోరుచు జేసెడి మ్రొక్కులు
చేరును సర్వాత్మ! నిన్నె చివరకును హరీ!                 32.

నానావిధ రూపంబుల
నీనేలను నీవు దాల్చు టెల్లర కిచటన్
నీనాభేదము వలదను
జ్ఞానంబును నింపు కొరకె సత్వాఢ్య! హరీ!                           33.

దుర్మతులను బరిమార్చుచు
నిర్మలముగ నవని జేయ నిస్తులబలుడా
ధర్మాత్ముడైన దశరథ
కర్మఠునకు సుతుడవైన నచరిత! హరీ!                            34.

గురువర్యుని యజ్ఞంబున
కురుతర విఘ్నంబు గూర్చుచుండెడి ఖలులన్
పరిమార్చిన శ్రీరామా!
నిరుపమశౌర్యాఢ్య! నతులు నీకిడుదు హరీ!               35.


శంకరుని విల్లు చేకొని
సంకటహర! విరిచి నాడు సముచితరీతిన్
పంకజనయనను సీతను
శంకరసఖ! యందినావు సన్నుతులు హరీ!                 36.

జనకుని యాజ్ఞగ నడవుల
కనుపమసుఖ మచట ననుచు హర్షముతోడన్
జనినట్టి నీచరిత్రం
బనుదిన పఠనీయ మిలకు ననియెదను హరీ!              37.

మునిజనులను కానలలో
నతరముగ  సేవచేయు కమనీయగుణా!
ననిభసుందరదేహా!
కొను సన్నుతి రామచంద్ర! గోవింద! హరీ!                38.

మిత్రుడవై వానరునకు
శత్రువు నా వాలి జంపి సామ్రాట్టుగ సత్
పాత్రుడవని సుగ్రీవుని
చిత్రంబుగ నిలుపు నీకు జేజేలు హరీ!                       39.

పదితలలవాని రాక్షసు
ముదితను బాధించినట్టి మూర్ఖుని ఖలునిన్
సదమలహృదయా! యంతక
సదనంబున కంపినావు సర్వేశ! హరీ!                        40


ధరయందు గిరులపైనను
సురుచిరగతి నిలిచియుంట సుందరమూర్తీ!
పరమాత్ముని సర్వోన్నతి
నరయుడు జనులంచు దెల్పు టనియెదను హరీ!                   41.

యాదవవంశోద్ధారక!
నాదవినోదా! సురాధినాథ! కృపాళూ!
మోదాకార! జనార్దన!
మేదిని నిను గొలువ బూన మేలగును హరీ!                42.

దీనుండను నీవాడను
జ్ఞానం బర్థించుచుండి సంతతము నినున్
మానక కొలిచెడి వాడను
నానావిధ రూపధారి! ననుగావు హరీ!                        43.

స్మరియించెద నభయంకర!
నిరతము సద్భక్తితోడ నిను వైకుంఠా!
కరుణాకర! గిరివరధర!
మరువను టియించుమయ్య! మంగళము హరీ!                 44.

దాసులకు బ్రేమ జూపుచు
జేసెడి సద్ధితము భువిని చిన్మయరూపా!
చూసితిని నమ్మినాడను
నీసము లెవరయ్య నతులు నిత్యమ్ము హరీ!               45.


కైవల్యదాయకా! శుభ
భావప్రద! దైత్యహంత! భాగ్యవిధాతా!
దేవా! వసుదేవాత్మజ!
పావనగుణ! నిన్ను జేరి  ప్రణుతింతు హరీ!                46.

నిను  గొలిచెడి సద్రీతులు
మునిజనకోట్యేకపూజ్య! మోక్షద! యెరుగన్
నను నీనామము నిరతము
మనమున స్మరియించువాని మన్నించు హరీ!             47.

వేదారాధ్యుడ వీవని
మోదంబున నిన్ను  గొల్వ  భువనంబులకున్
ఖేదంబు లణచి గావగ
నీదే భారమ్ము సతము నిక్కమ్ము హరీ!                              48.

ధనధాన్యరాశు లడుగను
నతర వైభవము గూర్చి కావు మటంచున్
నిను గోరను నీ సన్నిధి
ననయము వసియించు భాగ్య  మడిగెదను హరీ!                   49.

దారాపుత్రులు సోదరు
లారోగ్యము  భాగ్యచయము లందించిన ని
న్నోరార పిలుచు శక్తిని
నారాయణ! యొసగుమయ్య! నాకిందు హరీ!             50.


ఇందుగల వందు లేవను
సందేహము లేదటండ్రు సర్వేశ్వర! నీ
విందుండ నామనంబున
కందము చేకూర్చవేమి యాగ్రహము హరీ!                 51.

స్థిరతను దాల్చక చిత్తం
బురుతరముగ భ్రమణ చేయుచున్నది దీనిన్
సరియగు త్రోవకు జేర్చెడి
తరుణోపాయంబు నాకు దయజూపు హరీ!                52.

మదమత్సరములు నాకే
యదనున మది నంటకుండ నమలినభావం
బుదయింపజేసి కావగ
సదయా! భారంబు నీదె సర్వత్ర హరీ!                       53.

జయ చక్రపాణి! మాధవ!
జయ గోపాలక! ముకుంద! జయ గోవిందా!
జయ కౌస్తుభమణిధారీ!
జయ బృందావనవిహారి! జయమయ్య హరీ!              54.

బహువిధముల రూపంబుల
నిహమున దాల్చెదవు ధర్మ మెల్లవిధాలన్
మహిమాన్వితమై యిచ్చట
నహరహమును నిలుచుకొరకు నింపార హరీ!               55.


నరతిర్యగ్రూపంబులు
ధరణిని నీ వందు టెల్ల ధరవారలకున్
సురుచిర సమతాభావము
గరపుచు సుఖముండు డనుట కాదేమి హరీ!                56.

ఎవ్వారలు నిను గొలిచెద
రవ్వారలు  సౌఖ్యరాశి  నవనీస్థలిలో
నొవ్వక నందుచు నుండెద
రవ్విధి వర్ణింప దరమె యనాశ! హరీ!                     57.

నిత్యము నీపదసన్నిధి
నత్యాయతభక్తిభావ మగుపడు రీతిన్
భృత్యుడనై చరియించిన
బ్రత్యక్షము కావదేమి? పాపఘ్న! హరీ!                      58.

నిన్నే నమ్ముచు బ్రతికెడి
నన్నీ సంసారమందు నమ్మించి యిటుల్
మన్నించక బడద్రోసితి
వున్నతభావాఢ్య! కావ నొప్పగును హరీ!                            59.

ఏయపరాధము చేసితి
నోయిట బ్రత్యహము నిన్ను నుత్సాహమునన్
"జే"యంచు గొలువకుంటినొ?
శ్రేయఃప్రద! కినుక యేల చిద్రూప! హరీ!                             60.


వంశీకృష్ణా! నాకీ
సంశయమును దీర్పు మయ్య సకలమున న్నీ
యంశయె యుండగ ధర్మ
భ్రంశంబది గలుగు టెట్లు వసుమతిని హరీ!                  61.

రక్కసిమూకల నలనా
డుక్కడగించితివి యిచట నున్మాదమునన్
మిక్కిలిగా చెలరేగెడి
యిక్కలుషాత్ములకు శిక్ష యేదగును హరీ!                 62.

నీతనయ కలుషహారిణి
నీతనయుడు సృష్టికర్త నీసతి సంప
ద్వ్రాతము జగతికి బంచగ
జేతువు రక్షణము సతము చిద్రూప హరీ!                             63.

నిగమములు నీమహత్వము
నగణితసద్వాక్యదీప్తి నఖిలజగానన్
ఖగవాహన! వివరించును
సుగుణాకర! దయను కొంత చూపించు హరీ!              64.

అవతారము చాలించుట
లవతారము నీవు దాల్చు టవనీస్థలిలో
భవమున గల సత్యంబును
స్తవనీయా! విశదబరుచ దలచుటయె హరీ!                 65.


గురువులయెడ సద్భక్తిని
పరసతులను మాతృభావపరిమళ మెపుడున్
నరహరి నాకొసగుమయా
నిరతము నిను దలచువాడ నిక్కమ్ము హరీ!                66.

ఒరులేయవి ప్రవచించిన
నురుతర సద్భావమూని యుత్సాహముతో
స్థిరముగ వినుచున్ సత్యం
బరయగనౌ శక్తి నాకు నందించు హరీ!                       67.

అరిషడ్వర్గము నాపయి
పరమాత్మా! కక్ష బూని బహుభంగులుగా
నెరపుచు నున్నది దౌష్ట్యము
కరుణించుము కావుమయ్య కాదనక హరీ!                  68.

హరివంశసంభవుండను
హరిభక్తుడ నగుచునుంట ననవరతంబున్
హరిహరి హరియని దలచెద
హరిహరి! హరియించు మస్మదములను హరీ!                   69.

నీదాసులతో నెయ్యము
శ్రీదంబగు నీచరిత్ర చెవికింపొదవన్
మోదంబున విను  భాగ్యము
నాదాత్మక! యొసగుమయ్య నాకెపుడు హరీ!              70.


ఇలపయిని నిండియుండిన
ఛలమున కంతంబు దెలిపి జనులకు హితమున్
గలిగించెడి మార్గంబుల
నలఘుయశా! చూపు మనుచు నర్థింతు హరీ!             71.

పామరుడను మూర్ఖుడనై
నామన మందునను జేరు నానావాంఛల్
క్షేమంకర! యడిగితినని
ప్రేమను విడనాడబోకు విధివినుత! హరీ!                            72.

ధనమే శాశ్వత మనునటు
లనయం బీ భువుని దాని నందుటకొరకై
తనశక్తిని వెచ్చించుచు
మనుచుండును పిచ్చివాడు మానవుడు హరీ!             73.

ధనముండగ స్మరియించడు
నిను మనుజుడు వానికనులు నెత్తిననుండున్
తన నయ్యది వీడినచో
ననుదినమును దలచుచుండు నవగుణుడు హరీ!                   74.

పలువురిలో నీమహిమము
నిలబడి పలుకుటకునైన నిస్తులధైర్యం
బలయనిరీతిని నాకిడి
కలిగించుము హర్ష మెపుడు కంసారి హరీ!                            75.


యుక్తాయుక్తము లెరుగను
శక్తివిహీనుండ నేను సదసద్ జ్ఞప్తిన్   
ముక్తిప్రద! యొసగుమయా!
ప్రాక్తనపాపములు ద్రుంచి ప్రణుతింతు హరీ!              76.

ఇలయంతయు కలుషంబుల
నిలయంబై యుండె నేడు నిను గొలుచుట కే
ఫలములు చేకొన నొప్పను
ఖలహర! వందనము చేతు గైకొనుము హరీ!               77.

పసిబాలల హృదయంబున
వసియించెడి నిన్ను గాంచి బహుభంగులుగా
నసదృశసుందరమూర్తీ!
దెసలన్నియు నింపుకొనును దీప్తులను హరీ!               77.

వందనములు కరుణామయ!
వందనములు యోగివర్య! వందన మార్యా!
వందన మింద్రసహోదర!
వందన మినకోటితేజ! వందనము హరీ!                     78.

కమలాక్ష! కమలనాభా!
కమలాపతి! ననిభాభకాయ! ముకుందా!
సుమధురవాక్యవిశారద!
యమలినభావంబు నాకు నందించు హరీ!                  79.


ఒకదానికంటె నొక్కటి
సకలము చోద్యంబు గొల్పు జగమున జూడన్
బ్రకటిత తేజోవిభవా!
అకటా! భవదీయ మహిమ మద్భుతము హరీ!             80.

సన్మానము నాకగు నిట
మన్మనము త్వదీయ మగుచు మాన్యత నందన్
చిన్మయరూపా! వినుమిది
తన్మయమున బలుకుచుంటి తథ్యమ్ము హరీ!            81.

కలికాలము కలుషంబుల
నిలయంబై యున్న దనుచు నిష్ఠురము లిటన్
బలుకుచు నుండును మనుజుడు
తలపడు తత్కారకుండు తాననుచు హరీ!                 82.

నిరతము పరుగులు పెట్టుచు
స్థిరతను గాంచంగలేక తిరుగుచు నుండున్
నరు డీజగమున జూడగ
సిరులను దానందదలచి చిత్రమ్ము హరీ!                             83.

నీపాదజలము నిత్యము
శ్రీపతి! నే ద్రాగదలచి చేసెద వినతుల్
చూపుము కరుణ యొకించుక
నాపయి కరిరాజవరద! నతులిడెద హరీ!                              84.


గురువులయెడ సద్భక్తిని
నిరతంబును దాల్చునట్టి నిష్ఠాగరిమన్
వరగుణములు సద్వినయము
కరుణామయ! నాకునిమ్ము కమలాక్ష! హరీ!                85.

మనమున నెంచెడి దొక్కటి
యనయము వచియించు ఫణితి యది వేరొకటై
మనుజుం డానందించుచు
మనుచుండెను చూడుమయ్య మహిలోన హరీ!           86.

వివిధములౌ బంధంబులు
భవమున సమకూరునట్టి బాంధవ్యంబుల్
భువిపయిని మనుజకోటికి
జవసత్వము గూర్చునట్టి సంపత్తి హరీ!                     87.

కలియుగమున స్వార్థంబున
మెలగుట, ధర్మేతరంబు మేలని యనుటల్
పలురీతుల వంచనలకు
తలచుట నిత్యంబులయ్యె ధరపయిని హరీ!                88.

తనకంటెను విజ్ఞుం డొక
డనుమానము లేదు లేడు తన కెవ్వడిలన్
నుడై బోధించెడివా
డనుభావము నేడు మదుల నంటినది హరీ!                89.


తియ్యని మాటలు చెప్పుచు
నెయ్యముతో మానవుండు నిజమైన విధం
బియ్యదియని నమ్మించుచు
నయ్యో వంచనకుబూను ననిశంబు హరీ!                            90.

పరమున్నది యని నమ్మడు
నిరతంబును సౌఖ్యమరయ నిరుపమఫణితిన్
సరియగునా యని తలచక
దురితంబులు చేయు నరుడు తోరముగ హరీ!             91.

నదులన్నియు నీయిలపై
సదమల జలమయము లౌచు జనమానసముల్
ముదమును గాంచెడు రీతిని
నదనెంచుచు బారజూడు మనిశమ్ము హరీ!                92.

మేదినిపయి సస్యములకు
మోదము చేకూర్చు పగిది ముక్కాలములన్
సాదరముగ వృష్టిని దా
మోదర యందించ నీకు మ్రొక్కెదను హరీ!                 93.

సామాన్య జనుల కెల్లెడ
కామితములు దీరునట్లు క్రమముగ ధరలీ
భూమిని సఖ్యము జూపుచు
ప్రేమంబున నుండ జేయ విజ్ఞప్తి హరీ!                       94.


క్షితిపయిని ప్రాణికోటికి
బ్రతికెడి కాలంబులోన భవ్యసుఖంబుల్
సతతము గాంచగ శక్తిని
నతు లందుచు నొసగుమయ్య నాదాత్మ! హరీ!            95.

జగతికి నన్నము బెట్టుచు
నగణిత సత్వంబు గూర్చు నాకృషకునకున్
నిగమస్తుత! కష్టంబులు
తగిలించక కావుమయ్య దయజూపి హరీ!                  96.

శ్రమజీవికి సౌఖ్యం బిట
భ్రమయై కనిపించుచుండె వాడే యముల్
సమభావా! యొనరించెనొ
క్షమ జూప వదేమిటయ్య! సముచితమె హరీ!              97.

అన్నింట నిండియుంటివి
నిన్నందరు దైవమండ్రు నిఖిలజగానన్
మన్నించురీతి సమతను
క్రన్నన నిటనింప వేమి కారణము హరీ!                      98.

గోవిందా! గరుడధ్వజ!
సేవకగణసౌఖ్యదాత! శ్రేయోపేతా!
ధీవైభవసంధాతా!
పావనవంశాబ్ధిజాత! ప్రణుతింతు హరీ!                     99.


పీతాంబర! యభయంకర!
ప్రాతస్స్మరణీయభవ్యబహువిధనామా!
భీతావహభక్తావళి
చేతస్స్థిత! వందనమ్ము చేకొనుము హరీ!                            100.

కమలావల్లభ! నినుగను
క్రమ మెరిగినవారి మదుల గాంక్షలు సతమున్
సముచితరీతిని దీర్చెడి
యమరేంద్రా! వందనమ్ము లర్పింతు హరీ!                101.

పలుమారులు నిను బిలిచిన
బలుకవు నా మనములోని పారుష్యంబున్
దలచితివా కరుణారస
నిలయా! దిక్కీవెయగుట నినుగొలుతు హరీ!               102.

నలుగురిలో నున్నప్పుడు
నిలబడగల ఢైర్యమిచ్చి నిక్కమ్మచటన్
పలికెడి సత్వము గూర్చుము
తలచెద నిను సంతతమ్ము దయజూపి హరీ!               103.

భవ మొసగిన దేశంబున
కవనిని యశమందజేయు నాతని యెడలన్
భవదీయ వత్సలత్వము
సువరప్రద! యెల్లయెడల జూపించు హరీ!                  104.


నిను దలచెడి సన్మతులగు
మునిజనులకు  బాధ యొసగు మూర్ఖుల యెడలన్
నతర కాఠిన్యత్వం
బనునిత్యము చూపు మంచు నర్థింతు హరీ!               105.

వారే దైవసమానులు
వారే సద్గురువు లిలను వారే తపసుల్
వారే పూజ్యులు నిన్నె
వ్వారలు స్మరియింతు రిదియె వాస్తవము హరీ!            106.

జనహితమును  గాంక్షిచక
మనమున కలుషంబుతోడ మసలెడి నరునిన్
నసంకటమున ద్రోయక
పనిగొని రక్షించు టెంత భావ్యంబు హరీ!                             107.

నిను గాంచిన హృదయంబుల
ననుపమహర్షంబు, బలము లద్భుతరీతిన్
జనులకు కలుగుచు నుండుట
కననగు వందనము కొనుము కాదనక హరీ!                108.

ఈయదనున శతపద్యము
లోయయ్యా! వ్రాయజూపి యుంటివి నాకున్
నీయందు భక్తి జూపుచు
జేయందును చక్రపాణి! శ్రీనాథ! హరీ!                     109.
***

No comments:

Post a Comment