Monday 23 December 2013

క్రిస్టమస్ శుభాకాంక్షలు

క్రీస్తు జన్మదినోత్సవ(క్రిస్టమస్) శుభాకాంక్షలు
Jesus_Christ_Image_344.jpg (9880 bytes)
సీ. శ్రీదుండు, వరదుండు, చిన్మయాకారుండు
               కరుణామయుండౌట నిరుపముండు,
     మరియాంబ గర్భాన మహితతేజముతోడ
               జన్మించి మానవజన్మములకు
     సార్థకత్వము గూర్చ సవ్యమార్గము నేర్పి
               రక్షకుండాయె నా రమ్యగుణుడు,
     తులలేని క్షమతోడ శిలువ మోసినయట్టి
               మహనీయ చరితుడై యిహమునందు
     ఖ్యాతి కెక్కినవాడు, నీతిమార్గము శిష్య
               కోటి కందించిన మేటి యతడు,
     దేవదూత వచ్చి దైవమై వెలుగొంది
               విశ్వమందంతట వెలుగునింపె
     పరిశుద్ధమై యొప్పు భగవదర్చనమందు
               బుద్ధినిల్పుండంచు భూజనాళి
     కందించి సందేశ మవనివారలకెల్ల
               పాపాలు నశియించి తాపముడుగు
     బోధనంబులు చేసి పుణ్యకార్యములందు
               నండగా నిల్చినయట్టి ఘనుడు
     శాంతికాముకుడౌచు సంతతానందంబు
                జగతికి బంచిన సాధుశీలి
     నాల్గువార్తలలోన నానావిధంబుగా
               కీర్తింపబడిన సన్మూర్తి యతడు
     శిలువకాహుతియౌచు జీవనంబును వీడి
               మరలజీవంబందు గురువరుండు
తే.గీ.  సుజనవర్యుండు, శుద్ధాత్మ, సుగుణధనుడు,
         త్యాగమయజీవి, శ్రేష్ఠుడౌ యోగి నిజము
         లోకకల్యాణకార్యంబు స్వీకరించు
         ధన్యుడింకేమి సర్వథా మాన్యుడతడు,
తే.గీ.  ఏసుక్రీస్తంచు ప్రజలంద రింపుమీర
         నంజలించెడి ఘనుడాత డమరవరుడు
         భువిని క్రైస్తవధర్మంపు పవనములను
         వీచగాజేసి పుణ్యాత్ముడౌచు వెలిగె.
తే.గీ.  అతని దైవాంశ సంభూతు నహరహమ్ము
         తలచుచుండుచు తద్దత్త ధర్మమార్గ
         మనుసరించెడివారికీ యవనిలోన
         నలఘు సౌభాగ్యసంపత్తి కలుగు గాత.
సీ.   క్రీస్తు జన్మపువేళ వాస్తవంబైనట్టి
                   హర్షమందెడివారలందరకును
       క్రిస్మసాఖ్యంబిద్ది యస్మదీయంబైన
                    పర్వరాజంబంచు బహుళగతుల
       నంబరంబును దాకు సంబరంబులు చేసి
                     మోదమందెడు విశ్వ సోదరులకు
        క్రైస్తవంబును బూని కమనీయచరితులై
                     జగతిలో చరియించు సన్మతులకు
తే.గీ.   క్రీస్తు కనుయాయులౌచు సతీర్తినంది
          సంఘసేవానురక్తులై సర్వగతుల
          ఖ్యాతినందుచు నుండెడి క్రైస్తవులకు
          కావ్యమయమైన సత్ శుభాకాంక్షలిపుడు.


No comments:

Post a Comment