Sunday 22 December 2013

గణిత శాస్త్రవేత్త రామానుజం

గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజం 
జన్మదిన సందర్భంగా
పరమ పావనమై యొప్పు భరతజాతి
శక్తి యుక్తులు విశ్వాన చాటినాడ
వతుల ధీయుక్త! రామానుజార్య వర్య!
గణిత శాస్త్రజ్ఞ! కొనుమిదె ప్రణతి శతము.

గణిత శాస్త్రంబు జీవనక్రమమునందు
ముఖ్యమైయొప్పు నిరతంబు ముదము గూర్చు
దాని నాపోశనంబందు ధన్యజీవి!
గణిత శాస్త్రజ్ఞ! కొనుమిదె ప్రణతి శతము.

ణితమందున నీకృషి గణుతి కెక్క
మాన్య! రామానుజాఖ్యార్య! ధన్యమయ్యె
నిజము భవదీయ జన్మంబు నిఖిల జగతి
గణిత శాస్త్రజ్ఞ! కొనుమిదె ప్రణతి శతము.

భరతమాతకు బిడ్డవౌ భాగ్యమంది
భవ్యయశముల నిలలోన బడసినావు
రమ్యగుణధుర్య! రామానుజార్యవర్య!
గణిత శాస్త్రజ్ఞ! కొనుమిదె ప్రణతి శతము.

సహజపాండిత్యగరిమతో నహరహమ్ము
గణిత శాస్త్రాన శ్రమియించి ఘనతబెంచి
భరతభూమికి కూర్చితి వరయ  ఘనత
గణిత శాస్త్రజ్ఞ! కొనుమిదె ప్రణతి శతము.

No comments:

Post a Comment