Thursday 19 April 2012

ఈశ్వరేచ్ఛ

ది.17.04.2012 వ తేదీ శంకరాభరణం బ్లాగులో
"పద్యరచన"  శీర్షికన ఇవ్వబడిన చిత్రాన్ని దృష్టియందుంచుకొని
వ్రాసిన ఖండిక
ఈశ్వరేచ్ఛ
చం.
ఇనకుల సంభవుండు మృగయేచ్ఛను బూని సరిత్తటీస్థలిన్
ఘనవనభూమి కేగి, నిశ గ(గ్ర)మ్మినవేళ నొకానొకండు ని
స్వనమది సోక వీనులకు సామజమంచు దలంచి శబ్దభే
దిని ఘనుడౌట వేసెనొక తీక్ష్ణశరం బపుడా దిశన్ వడిన్. 

తే.గీ.
ఆర్తనాదంబు విన్పింప నచటికేగి
దశరథాధిపు డచ్చట దారుణమగు
బాణహతిచేత మిక్కిలి బాధ జెందు
నేల కొరిగిన సన్ముని బాలు గాంచె. 

కం.
ఆతడె శ్రవణకుమారుడు
సాతురుడై జలముగోరి సరయూనదికిన్
మాతాపితరులు పంపగ
నేతెంచి శరాగ్నిగూలె నీశ్వర మాయన్. 

కం. 
తను జేసిన దుష్కృత్యము
మనమును గుందంగజేయ మాటలడం(ణం)గన్
మునిబాలకు దుర్దశగని
ఘనతాపము జెంది నిలిచె క్షత్రియుడంతన్. 

కం. 
అంధులు జననీజనకులు
బంధువులా లేరు, నన్ను బాలుని శరమున్
సంధించి కూల్చి వారిని
బంధించితి వౌర! నీవు బాధలలోనన్. 

తే.గీ.
అనుచు వచియించు శ్రవణున కనియె రాజు
వినుము గజమంచు బాణము వేసినాడ,
ననఘ! నీయున్కి నేనిందు గనగ లేక
ఇట్టి పాపాని కేనొడి గట్టినాడ. 

తే.గీ.
కట్టి కుడుపును నాకింక చుట్టుకొనును
బ్రహ్మ హత్యాఖ్య మైనట్టి పాతకంబు
మునికుమారక! నీవారి ముందు కరిగి
విషయమును జెప్పి సర్వంబు విశద బరతు. 

కం. 
అని పలికిన దశరథునకు
ననఘుం డా మునికుమారు డనెనీ రీతిన్
కనగలవు నాదు జనకుల
వనభూమిని  కుటిని నీవు  వారతి వృద్ధుల్.


ఆ.వె.
అచటి కేగి వారి కాసాంతమును దెల్పి
యంజలించి యభయ మడుగ గలవు
దాహబాధతోడ తప్తులై యున్నార
లింక నీదు భాగ్య మెట్లు గలదొ. 


తే.గీ. 
బ్రహ్మహత్యాఘ మంటదు, బ్రాహ్మణుడను
గాను నేనింక వైశ్యుని మేనినుండి
యువిద శూద్రకు జన్మించి యుంటిగాన
చింత వలదింక మనమున సుంత యేని.


తే.గీ.
అనగ నాముని బాలుని తనువునందు
దిగిన బాణంబు నారాజు దీసి వేయ
కనులు మూసెను శ్రవణుడు కనగ నపుడు
చిత్తరువు వోలె నృపునకు చేష్టలుడిగె.



2 comments:

  1. శ్రీ మూర్తిగారూ,

    మీ పద్య రచనాశైలి అమోఘమండీ. మంచి ధాటి, వివేకవంతమైన పదప్రయోగము, మంచి నడక, ఉన్నతమైన భావన......

    చాలా బాగున్నాయండీ.

    ReplyDelete
    Replies
    1. శ్రీ సంపత్కుమార శాస్త్రి గారూ!
      మీ అభినందనలకు ధన్యవాదములు, నమస్కారం.

      Delete