Saturday, 6 December 2025

శ్రీరామలింగేశ్వర శతకము

 

శ్రీరామలింగేశ్వర శతకము

శా. 

శ్రీకంఠా! జగదీశ్వరా! పశుపతీ! క్షేమంకరా! శాశ్వతా!

లోకాధీశ! సమస్తదేవవినుతా! లోభప్రభావాపహా! 

నీకున్ మ్రొక్కెద సన్నుతించెదనయా! నిత్యానురాగమ్ముతో 

నాకందించుము నీకటాక్ష మసమానా! రామలింగేశ్వరా!              1.

శా.

నీపై పద్యశతమ్ము పల్కుటకునై నీసత్కృపాదృష్టిచే 

జూపెన్ కోరిక నామనస్స్థలమునన్ శుద్ధాంతరంగమ్ముతో

దీపిల్లంగను జేయుమయ్య! పదముల్ ధీశక్తియున్ భావముల్ 

శ్రీపత్యర్చితపాదపద్మయుగళా! శ్రీరామలింగేశ్వరా!                       2.

మ. 

కొలువై యుంటివి పంచలింగములతో గూర్మిన్ శుకశ్యామలన్ 

వలపుం జూపుచు నిల్పి యుంచి సతమున్ భక్తాళిబ్రోవంగ నీ 

స్థలమం దోశివ! "నందిగామ"పురిలో సర్వార్థసంపత్తులన్ 

కలుగం జేయగ సద్యశంబు లిట దాకన్ రామలింగేశ్వరా!                        3.

మ. 

శుభసందోహము "నందిగామ"పురిలో శోభిల్లగా జేయుటే

యభవా! నాపని యంచు దెల్పెడి నినున్ హర్షప్రభాపూర్ణునిన్

విభవశ్రేణి నొసంగువానిని జగద్వేద్యున్ శుకశ్యామలా

ప్రభునిన్ గొల్తుము సంతతమ్ము భవ! దేవా! రామలింగేశ్వరా!       4.

 

మ. 

అభిషేకప్రియ! చంద్రశేఖర! మహాన్యాసాదిమంత్రంబులం

"దభయం బిమ్ము మహేశ్వరా!"యనుచు నిన్నర్చించు భక్తాళికిన్ 

శుభసంపత్తుల నందజేయుమని యస్తోకాచ్ఛభావమ్ముతో 

విభవప్రాపక ! కోరువాడ గతి నీవే రామలింగేశ్వరా!                     5.

***

 

ఓం న మ శి వా య

(పంచముఖ ధ్యానం)

శా.

ఓంకారంబు భవత్స్వరూపమని సర్వోత్కృష్టభావమ్ముతో

శంకల్ లేక మహానుభావు లిట విశ్వశ్రేయమున్ గోరుచున్

పంకేజాక్షకరార్చితా! పలుకుటన్ భాగ్యంబుగా నెంచి యీ 

వంకన్ నేను జపింతు నెప్డు శివదేవా! రామలింగేశ్వరా!               6

మ. 

తులో శంకర! భక్తపాలనపరా! నాంగేంద్రహారా! హరా! 

అతులానందద! యచ్యుతార్చితపదా! యచ్ఛానురాగాస్పదా! 

వ్రతమంచున్ భవదర్చనాదివిధులన్ భక్తిప్రకాశమ్ముతో

సతతమ్మున్ బొనరింప గావు మగజేశా! రామలింగేశ్వరా!            7.

 

మ. 

నుజానీకము స్వార్థభావనలతో మాత్సర్యసంపూర్ణులై

యనునిత్యం బిట సంచరించుచు మహాహానిన్ ధరాస్థానమం

దున గల్పించుచు నున్నవారలు శివా! దుఃఖంబునందైన నిన్

మనమందున్ స్మరియింప రెట్లిడెదొ ప్రేమన్ రామలింగేశ్వరా!      8. 

మ. 

శిఖ నాచంద్రుడు, కంఠసీమను గనన్ శేషాహిసద్వంశ్యులున్ 

సఖియై గంగ శిరస్థలంబు పయినన్ శక్త్యర్థదేహంబునన్ 

సుఖదాతా! వసియించ శంకరునిగా శోభిల్లుచున్నట్టి 

ణ్ముఖతాతా! "నమ"యందు బ్రోవుమయ నన్నున్ రామలింగేశ్వరా!  9.

శా.

వాదుల్ సేయుచు దేవతాస్థితులపై పల్మారు నాస్త్యుక్తులన్

నేదంపూర్వవిధాన బల్కుచును విశ్వేశా! మదోన్మత్తులై

మోదం బందెడివారిలోని ఘనమౌ మూర్ఖత్వముం గూల్చగా

వేదాధార! జగత్పతీ! క్షముడవీవే రామలింగేశ్వరా!                                   10.

మ. 

తనంబుల్ సలుపంగ నెంచెదను సవ్యానందసంధాయకా!

క్షితిలో నున్న జనంబు లందరును నా సేమంబు కాక్షించు వా 

రతులానందదబంధువర్గ మనుచున్ హర్షాతిరేకమ్ముతో

సతతం బుండెడి శక్తినిమ్ము గిరిజేశా! రామలింగేశ్వరా!                11.

***

హ ర హ ర మ హా దే వ  (అష్టాంగ ప్రణామము)

మ. 

రివంశీయుడ "సత్య"మందురు జనుల్ హర్షస్వరూపుండవౌ

హర! నీనామము సంతతమ్ము మదిలో నత్యంతమౌ భక్తితో

వరభావంబుల నందగోరుచు నినున్ భావించి సేవించుచున్

స్మరియింతున్ దయజూపుమయ్య జగదీశా! రామలింగేశ్వరా!     12.

మ. 

జనీకాంతుడు నీ శిరస్సుపయినన్ రమ్యాతిరమ్యంబుగా 

విజయప్రాపక! చేరియుండెను మహద్విఖ్యాతినిం గాంచుచున్

నిజ మవ్వాని యదృష్ట మెంతయొ కదా! నీపాదసేవారతిన్

స్వజనం బంచును నాకు నీయదగు నీశా! రామలింగేశ్వరా!         13.

మ. 

ర! దేవాసురవంద్య! శాత్రవహరా! యత్యర్చితా! శంకరా! 

వరభావస్థిరతాప్రదాయక! శివా! భవ్యానురాగోన్నతా! 

కరుణాసాగర! కామితార్థద! విభూ! కైలాసవాసా! నినున్

నిరతంబున్ భజియింతు భాగ్యములవానిన్ రామలింగేశ్వరా!      14.

మ. 

మణీయాద్భుతభావనాబలముచే రాజిల్లు సౌజన్య మీ 

క్షమపై మాన్యుల కందగల్గుటకు నీకారుణ్యమే కారణం 

బమలోదాత్తసువత్సలా! సురవరా! ఆనందసంసిద్ధికై

"నమ"యంచున్ నినుగొల్తు వైభవనిధానా! రామలింగేశ్వరా!      15.

మ. 

రువం బోవను నీపదార్చనగతుల్ మచ్చిత్తమం దెప్పుడున్

పరమేశా! తగు సత్వ మీయగ నినున్ బ్రార్థింతు నశ్రాంతమున్

మరియాదల్ దెలియంగ నేర్పి దొసగుల్ మన్నించి నీదాసునిన్

గిరిజానాయక! బ్రోవగా దగును నీకే రామలింగేశ్వరా!                 16.

శా. 

హానుల్ ఛాయలకైన రావు, కలుషవ్యాపారముల్ దగ్గరై

మేనున్ దాకగలేవు, కష్టవితతుల్ మిథ్యాపవాదాదులున్ 

దీనత్వంబును గూర్చ జేరవు కదా! దివ్యానురాగామృత

స్థానున్ నిన్ను దలంచ వందనము లీశా! రామలింగేశ్వరా!           17. 

శా.

దేవా! యీ భువిపైన మానవునిగా తేజంబుతో నుంటకున్

నీవే కారణమయ్య! యందువలనన్ నీసేవలో నిచ్చలున్

భావస్థైర్యమునంది యుండగల సద్భాగ్యంబు నిన్ గోరెదన్ 

లే వేకాంక్షలు సత్యమో గిరిశ! శూలీ! రామలింగేశ్వరా!                 18.

మ. 

రభావంబున పార్వతీసతిని నీవంకన్ జేర్చ నర్థాంగిగా 

నురుయత్నంబును జేసి దేవతలకై యుత్సాహముం జూపగా 

స్మరునిన్ భస్మము జేసినాడవు గదా మాన్యా! భవల్లీల నె

వ్వరు నెంచంగను లేరు సత్యమిది దేవా! రామలింగేశ్వరా!            19. 

***

ఓం న మో భ గ వ తే రు ద్రా య   (దశాంగ రౌద్రీకరణం)

శా.

ఓం కారంబు సమస్తసత్వభరితం బుర్వీస్థలంబందునన్

శంకాలేశము లేదు పల్కిన జనస్వాస్థ్యంబు సంవృద్ధమై

కొంకన్ నేర్వని ధైర్యమిచ్చి మనుచున్ గ్రోధాదులన్ నిచ్చలే 

వంకన్ జేరగనీదు నీవగుట దేవా! రామలింగేశ్వరా!                     20. 

మ. 

దులున్, గోవులు, భూజసంతతి మహానందమ్ముతో నెల్లెడన్ 

సదయా! చేయు పరోపకారమెపుడున్! సర్వోన్నతుండై నరుం 

డదయుండౌచు పరాపకారమునకై యత్యంతమౌ శ్రద్ధతో

నుదయాదిన్ జరియించు నిత్య మదియెట్లో రామలింగేశ్వరా!     21. 

శా.

మోక్షప్రాపక! దక్షయజ్ఞహర! శంభూ! సాధురక్షాకరా!

త్ర్యక్షా! రాక్షసకోటిగర్వహరణా! దాక్షిణ్యభావస్థిరా! 

అక్షీణామితవత్సలా! త్రినయనా! యక్షేశ్వరాప్తా! భవా!

దాక్షాయణ్యధినాయకా! నతి, సురాద్యా! రామలింగేశ్వరా!                        22. 

మ. 

గవద్భక్తి సమస్తపాపహరమై భాగ్యంబులం గూర్చు నీ 

జగమందున్ శుభసాధకం బనెడి విశ్వాసమ్ము లేకుండగా 

పొగరుం దాల్తురు నాస్తికుల్ కనుమయా! భూతేశ! నీసత్వమీ

యుగమం దెల్లెడ వీరికిం దెలుపలేవో రామలింగేశ్వరా!               23. 

మ. 

రళం బేగతి నుంచినాడవొకదా! కంఠంబునం దాయెడన్

సురసంఘంబులు గోర, త్రాగుమనెనా శూలీ! జగన్మాత? యో 

కరుణాపూర్ణ! జగద్ధితంబునె సదా కాంక్షింతువే గాని నీ 

వరయం జాలవు స్వాపదన్ నిజమి దయ్యా! రామలింగేశ్వరా!       24. 

మ. 

దలం జూడను నీపదాబ్జముల సేవాకార్య మేవేళనున్  

వదలం జూడ జలాభిషేకవిధులన్ పత్రార్చనం బేయెడన్

వదలం జూడను త్వత్కథాశ్రవణమున్ భాగ్యంబుగా నెంచుచున్

సదయా! దీనుని నేలబ్రోచెదవొ, యీశా!  రామలింగేశ్వరా!          25. 

శా.

తేజోదీప్తి యణంగిపోకమునుపే, ధీశక్తి క్షీణించకే 

నైజానందము గూలిపోక మునుపే నాచిత్తమం దొప్పుగా 

రాజిల్లంగను జూడు మందరిపయిన్ రమ్యానురాగమ్ము లే

వ్యాజమ్ముల నెంచకుండునటు లయ్యా! రామలింగేశ్వరా!                        26. 

మ. 

రుజ లీదేహములోన జేరి యతిగా క్రోధమ్ము జూపించుచున్

నిజదౌష్ట్యంబున రేగకుండు మునుపే   నీసన్నిధిం జేరగా 

సుజనానందకరా! పథమ్ము విధిగా చూపించి యీతండు నా

ప్రజయంచున్ కృపజూపుమయ్య శివ! దేవా! రామలింగేశ్వరా!     27.

 

శా.

ద్రాక్షాదుల్, రమణీయసత్ఫలము లందంబైన పుష్పంబులున్ 

దీక్షాసంయుతులౌచు బిల్వదళముల్ దివ్యాపగానీరముల్

త్ర్యక్షా! నీకొసగంగ భక్తజనముల్ ద్వారస్థులైనారు కా

మాక్షీనాయక! స్వీకరించు శుభనామా! రామలింగేశ్వరా!                          28. 

మ. 

తులున్, మౌనులు, దేవతానికరముల్, యక్షుల్, ఫణిశ్రేణులున్ 

క్షితిపై నున్న సమస్త జీవతతులున్ శ్రీకంఠ! నీసత్కృపా

స్థితికై మ్రొక్కుచు వేచిచూతు రెవరిన్ దివ్యానురాగమ్ముతో

నతులానందముగూర్చి బ్రోతువొ శివయ్యా! రామలింగేశ్వరా!      29. 

***

 

 అ ఆ ఇ ఈ ఉ ఊ ఏ ఐ ఓ ఔ

(దశాంగ రౌద్రీకరణము)

 

మ. 

తడెవ్వాడొ ముఖంబుతో జలము నీకర్పించి పత్రంబులన్ 

స్తుతి లేకుండగ రాల్చి మాంసములతో జూపంగ ప్రేమంబు నా 

సతతానందము గాంచ మోక్షమిడుచున్ సమ్యగ్విధానమ్మునన్ 

క్షితి నవ్వాని ననుగ్రహించితివయా! శ్రీరామలింగేశ్వరా!                30.

 

శా.

కాళంబును హస్తి భక్తియుతులై యర్చించగా వారలన్ 

శ్రీకంఠా! దరి చేర్చుకొంటివి కదా, చిత్సౌఖ్య మందించుచున్

నాకున్ నీదయ యించుకైన నిడవా! నానేర్చు నట్లీయెడన్ 

జేకొంటిన్ భవదీయసేవను శివా! శ్రీరామలింగేశ్వరా!                 31.

మ. 

ది నాభాగ్యదకారణంబు గిరిశా! యిప్పట్టునన్ మంత్రముల్

ముదమొప్పంగను నేర్వకుండిన, భవత్పూజావిధానంబులన్

సదయా! నేర్వకపోయినన్ "శివ! నమో శంభో!" యటంచాడగా 

నది నీవందితి వంతె చాలును శివయ్యా! రామలింగేశ్వరా!           32.

శా.

వేళన్ మహదాశయప్రకృతితో నింతేని ధర్మం బిలన్

భావస్వచ్ఛతనంది చేయని మహాపాషండు డేరీతిగా 

దైవానుగ్రహమందగల్గును? కటా! దారిద్ర్యసంతప్తుడై

జీవించున్ శవమట్లు సత్య మిదియే శ్రీరామలింగేశ్వరా!               33.

మ. 

మకున్ మ్రొక్కెద, నీకెడన్ నిలిచి తానుండన్ శుకశ్యామలన్ 

సమతామూర్తిని సన్నుతించెదనయా సర్వేశ! విఘ్నేశునిన్ 

క్రమ మొప్పంగను గొల్చువాడను మహత్కారుణ్యభావుండ వీ 

గములైయున్న యఘంబులన్ దునుము వేగన్ రామలింగేశ్వరా!            34.

 

శా. 

రూరన్ జగదేకరక్షకుడవై యున్నట్టివాడౌటచే

చేరం జూతురు భక్తకోటి యభవా! క్షేమంకరా! నిన్నిటన్

తోరంబైన కలిప్రభావగతులన్ దూరంబుగా ద్రోచి చె

న్నారన్ గావుమటందు మ్రొక్కి బుధగేయా! రామలింగేశ్వరా!        35.

శా.

యేవిద్యలు నేర్వగావలయునో యేయే మహామంత్రముల్ 

స్వాయత్తంబుగ జేసికోవలయు శర్వా! యే బృహత్కార్యముల్ 

నీయాప్యాయత నంద జేయవలెనో నిక్కంబుగా నేర్వ నో 

శ్రేయోదాయక వందనమ్ము గొనుమా శ్రీరామలింగేశ్వరా!                         36.

శా.

శ్వర్యంబులధామమై వెలుగుని న్నర్థించనైశ్వర్యముల్ 

విశ్వవ్యాప్త జనమ్ము గోరు సుఖముల్ వేడంగ బోనయ్య  నం

ద్యశ్వా! దీర్ఘవయఃప్రభావయుతమౌ వ్యాప్తిన్ నినున్ గోర నీ

విశ్వాసమ్ము లభించ చాలు నది యీవే రామలింగేశ్వరా!              37.

శా.

విశ్వేశ్వర! ఓకృపాజలనిధీ! ఓభక్తకల్యాణదా!

ఓ వేదాది సమస్తవాఙ్మయనుతా! ఓముక్తిసంధాయకా!

ఓవిజ్ఞానమహాబ్ధిసారజనకా! ఓగోత్రకన్యాపతీ! 

ఓవీరాగ్రణి! సన్నుతుల్ గొనుము నీవోరామలింగేశ్వరా!               38.

 

శా.

దార్యంబున నీకు సాటి గలరా! ఆదైత్యు డర్థించగా

మోదం బందుచు నిచ్చినావు వరముల్ పోకార్చగా వైరులన్ 

శ్రీదా! హస్తము శీర్షమందునుచగా శీఘ్రంబె భస్మంబులై

యేదన్ వందన మందుమో యచలశాయీ! రామలింగేశ్వరా!      39.

***

 

శ్రీ నం ది గామ రా మ లిం గేశ్వ రా నీ కు న తు లు

(షోడశాంగరౌద్రీకరణం)

శా.

శ్రీదా! లోకశుభంకరా! సురవరా! ప్రేమానురాగస్థిరా!

వేదస్తుత్య! మహేశ్వరా! ప్రమథపా! విశ్వైకవంద్యా! శివా!

నీదే భారము రక్షసేయు మనెదన్ నిన్ దేవ! నీసత్కథల్

మోదంబంద బఠించుచుండి శుభనామున్ రామలింగేశ్వరా!      40.  

శా.

నంద్యశ్వా! జగదీశ్వరా! పురహరా! నాగేంద్రసద్భూషణా!

వందే లోకశుభంకరా! స్మరహరా! ఫాలాక్ష! భూతేశ్వరా!

మందున్ నన్ను క్షమించి నాదొసగులన్ మన్నించి రక్షించుమా 

యందున్ నీకభిషేచనంబిడి శరణ్యా! రామలింగేశ్వరా!                41.

 

 

శా.

దివ్యానందమహత్ప్రభావపటలీదీప్తిస్థిరత్వంబులున్

భవ్యశ్రేష్ఠయశఃప్రకాశగతులున్ భాగ్యాన్వితౌన్నత్యముల్

కావ్యప్రోక్తములట్లు చేరు జనులన్ కైలాసవాసా! నినున్

దీవ్యద్దీక్ష దలంచ బూనిన కపర్దీ! రామలింగేశ్వరా!                                    42.

శా.

గానారాధ్య! మహాహిభూషితగళా! గంగాసతీనాయకా! 

దీనోద్ధారక! దేవతానికరముల్ దీక్షాయుతిన్ నీకథల్

నానారీతుల బాడుచుందురు జగన్మాన్యత్వముం గాంచగా 

నేనుం గొల్చెద నిన్ను బ్రేమగలవానిన్ రామలింగేశ్వరా!                43.

మ. 

హి నీసఖ్యము నందినట్టి నరుడే మాన్యుండు దిక్పాలుడై

రహియించున్ గద గుహ్యకేశ్వరునిగా రాజిల్లు విత్తమ్ముతో

నహిసద్భూషణ! వందనమ్ము లివిగో యందందగున్ నాపయిన్

దహనాక్షా! దయజూప నిచ్ఛ గొనరాదా? రామలింగేశ్వరా!           44.

శా.

రాజీవాక్షుడు మాధవుండు సతమున్ రమ్యాంతరంగమ్ముతో

తేజస్స్థానుని నిన్ను గొల్చి గొనియెన్ దేవారి సంహారియై

నైజౌన్నత్యము చాటు చక్రమును సన్మానమ్ముతో చక్రియై

రాజిల్లెన్ గద, వందనమ్ము లహిహారా! రామలింగేశ్వరా!              45.

 

 

మ. 

నుజానీకము ధర్మహీనులగుచున్ మానంబులన్ వీడుచున్ 

దనుజత్వంబును గాంచుచుండగ ప్రభూ! త్వద్భక్తులం గావగా 

మనమం దెంచ వదేమి చిత్రమొ యిదే మర్యాదయౌ నేమి పా 

వననామా! శశిమౌళి! వందనము దేవా! రామలింగేశ్వరా!                        46.

శా. 

లింగాకారము దాల్చి భక్తుల నిటన్ లిప్తన్ మహాపాపముల్

కంగారై నశియించిపోయెడు గతిన్ గల్పించి రక్షించుచున్

కొంగుం గట్టిన బంగరీ ప్రభుడనన్ గూర్మిన్ ప్రసారించు నో 

సంగీతప్రియ! వందనమ్ము జగదీశా! రామలింగేశ్వరా!                 47.

శా. 

గేలిం జేయుదు రీ సమాజమున నిన్ గీర్తించుచున్నప్పు డో

శూలీ! కొందరు నాస్తికత్వగతులన్ శూరత్వమున్ జూపుచున్

వాలాయంబుగ దెల్పుచుందు రెపు డవ్వారిన్ భవద్భక్తిలో

దేలం జేసెదవో విరోధిహర! వందే(యిందే) రామలింగేశ్వరా!       48.

మ. 

శ్వసనుండగ్నియు భూమియున్ జలములున్ బ్రహ్మాండ మాకాశ మో

యసమాక్షా భవదంశలే యగుటచే నన్నింటిలో నీవిటన్ 

వసియించన్ గనువారి కందునుగదా భాగ్యంబు లశ్రాంతమున్ 

భసితాంగా! కొను వందనమ్ములివి దేవా రామలింగేశ్వరా!           49.

 

శా.

రావే శక్తులు నీకు భక్తి సలుపన్ రమ్యాభిషేకంబులన్

పోవే బాధలు బిల్వపత్రములతో పూజించి సేవించినన్

కావే కార్యము లన్ని సత్ఫలములన్ కల్గించునట్లీ యెడన్

దేవా! నిన్ గన, రక్షసేయు పని నీదే రామలింగేశ్వరా!                   50.

శా.

నీసౌజన్య మనంత మద్భుత మయా! నిత్యంబు నీకోసమై 

భాసిల్లంగ తపించు వారలయినన్ వాంఛాఫలం బిత్తువే

ధ్యాసన్ చేయవు వారు దైత్యులయినన్ తథ్యంబుగా దేవ! నీ

దాసున్ నన్ను ననుగ్రహింతు ననరాదా! రామలింగేశ్వరా!                        51.

మ. 

కుమతుల్ చేరి ధరాతలంబు పయినన్ గోబ్రాహ్మణార్యాదులన్

క్షమియించందగనట్టి బాధ లకటా! కల్పించుచున్నార లో

సమతాస్థాన! భవత్కృపారసమిటన్ సర్వప్రకారమ్మునన్

శమియించంగ దలంచెనేమి గిరివాసా! రామలింగేశ్వరా!                        52.

మ. 

యనానందకరమ్ము దర్శనము, సన్మానప్రదంబై యిటన్  

జయమున్ గూర్చు భవత్కథాశ్రవణమున్ శర్వా! శుకశ్యామలా

ప్రియ! భూతేశ్వర! నందిగామపురిలో విస్తారసత్సౌఖ్య మా

రయజేయించుచు నుంటివయ్య శుభదేహా! రామలింగేశ్వరా!      53.

 

మ. 

తు, యారంభము లేనివాడవు జగత్పూజ్యుండ వీసృష్టికిన్

మొద లంతంబులు జూపువాడ వగుటన్ పూర్ణాచ్ఛసద్భక్తితో

సదయా! కావుము వందనమ్ము లనుచున్ స్రష్ట్రచ్యుతాదుల్ శుభ

ప్రద! నిన్ గొల్తురు సన్నుతింతు శివదేవా! రామలింగేశ్వరా!          54.

శా.

లుప్తావస్థకు జేరనున్నవి కదా! లోకమ్ములో ధర్మముల్ 

వ్యాప్తంబైనవి నూతనప్రకటనల్ యజ్ఞాదిసత్కర్మలున్

దీప్తిన్ గాంచవు వాస్తవప్రకృతితో తేజోమయా! యేలనో 

ఆప్తశ్రేణిని రక్షసేయవలెనయ్యా! రామలింగేశ్వరా!                                    55.

 

***

 

నీ దా సు డ న ను గా వ ద గు న యా శి వా

శా.

నీవేతల్లివి నాకు దండ్రివి కదా నీకన్న వేరెవ్వరో

దేవా! నా మొర నాలకించగల రీదీనాత్మునిన్ సేవకున్

బ్రోవం దల్చిన ధాత్రిలోని జనులన్ బూర్ణేచ్ఛతో నాయటుల్

భావింపందగు శక్తి నిమ్ము శివదేవా! రామలింగేశ్వరా!                 56.

 

 

శా.

దారిద్ర్య స్థితి నున్నవేళ, నిడుముల్ తామై మహత్తాపమున్

గోరల్ జాపిన భూత మన్నటులుగా గూడంగ జేయు స్థితిన్

నైరాశ్యంబున మున్గి నిన్ను దలచున్ బ్రహ్లాదముల్ గల్గినన్

జేరండౌర జనుండు పూజసలుపన్ శ్రీరామలింగేశ్వరా!                57.

మ. 

సుఖముల్ గల్గిన, కష్టముల్ దొరలినన్, సుఖ్యాతి చేకూరినన్, 

సఖులున్ లోకులు నవ్వినన్, ధనములున్, దారిద్ర్యముల్ కూడినన్

మఖతుల్యంబుగ నీదునామజపమున్ మానన్ మహామోదమున్

ముఖమందున్ ధరియింతు బ్రోవదగు నన్నున్ రామలింగేశ్వరా!             58. 

మ. 

మరున్ మ్రోగగజేసి నాడు మదినిండన్ హర్షసంపత్తితో

క్రమ మొప్పంగను నక్షరప్రకరమున్ కాంక్షానుసారమ్ముగా

నమలస్వాంతున కందజేసితివి, నీవా మౌని కద్దానిచే 

క్షమపై జేరెను వ్యాకృతుల్ జగదధీశా! రామలింగేశ్వరా!              59.

శా.

న్నేరీతిని బ్రోచువాడవొ హరా! నాకీసమాజమ్మునం

దెన్నం జాలిన కీర్తులున్ బిరుదముల్ హేమాదిసంపత్తులున్

మన్నించందగు వాహనప్రకరముల్ మాన్యంబులున్ లేవు నీ 

చిన్నామంబు జపించు వాంఛకు వినా శ్రీరామలింగేశ్వరా!           60. 

 

మ. 

నుతులన్ జేయుటలేదు, ద్రవ్యతతులన్తోరంబుగా గూర్చుచున్

వ్రతముల్ సల్పుటలేదు, పూజలకు సంభారంబులన్ దెచ్చుటల్ 

సితికంఠా! యిట లేదు నిర్మలజలశ్రీయుక్తపత్రంబులన్

క్షితి నందించిన జాలు తృప్తి గనెదో శ్రీరామలింగేశ్వరా!               61.

శా.

గాత్రౌన్నత్యములేదు నీదు నుతులన్ గానంబు చేయంగ స

త్పాత్రత్వం బదిలేదు మంత్రగతులన్ వాంఛించి యందంగ నే

మాత్రంబును యోగ్యతన్ గనని నన్ మన్నించు టెట్లౌనొకో

చిత్రం బయ్యెడు దీని నెంచిన శివా! శ్రీరామలింగేశ్వరా!                62.

మ. 

రమిమ్మంచు సమస్తసంపద లిటన్ వాంఛించుచున్ పూజలన్

నెరపంబోవ, యశంబు గూర్చు మనుచున్ నిత్యంబు ప్రార్థించుచున్ 

హర! నిన్నున్ విసిగించబోను సతతం బానందమొప్పార నీ 

వరనామంబు జపించు శక్తి నిడు దేవా! రామలింగేశ్వరా!                        63.

మ. 

యతో నామొర నాలకించుము హరా! త్వద్భక్తి నాకుండినన్

భయమొక్కింతయు లేక యీ జగతిలో భక్తార్తులన్ బాపు నీ 

సురసంఘంబున నిన్ను బోల రెవరంచున్ సూక్తి చాటించుచున్ 

స్థిరచిత్తంబును దాల్చు శక్తి నిడుమా శ్రీరామలింగేశ్వరా!              64.

 

మ. 

గురుభక్తిన్, జనకద్వయంబు పయినన్ గూర్మిప్రసారమ్ముతో 

నిరత మ్మీయెడ సేవచేయు బలిమిన్, నిష్ఠాయుతిన్ లోకులన్ 

బరమానందముతోడ సోదరులుగా భావించు ధీశక్తియున్ 

బరమేశా! నినుగొల్తు నాకిడుము దేవా! రామలింగేశ్వరా!                         65.

మ. 

మకంబున్, చమకంబు, సూక్తయుతమౌ న్యాసమ్ము, శాంత్యుక్తులన్

క్రమ మొప్పంగను బల్కుచుండి జలముల్ కల్యాణభావమ్ముతో

"నమ"యంచున్ శుభబిల్వపత్రములు మాన్యశ్రేష్ఠ! యర్పింతు నా 

భ్రమలన్ గూల్చి యనంతహర్ష మిడు దేవా! రామలింగేశ్వరా!      66.

శా.

యావచ్ఛక్తిగ నిన్ను గొల్చెదనయా! ఆనందసంధాత! నీ 

సేవాకార్యమునందు విఘ్నతతులన్ జేరంగ రానీక నా 

భావంబందున నిల్చి కావు మనుచున్ ప్రార్థించుచున్నాడ నో

దేవా! వందనమందుమయ్యరొ కపర్దీ! రామలింగేశ్వరా!               67.

మ. 

శిశిరాంతంబగు సర్వకాలములు కాశీనాథ! యబ్దాదులున్ 

శశిసూర్యాదులు, దిక్పతుల్, గ్రహములున్, సర్వామరశ్రేణియున్, 

నిశలున్, ఘస్రము, లుర్వి, లోకచయముల్ నీయాజ్ఞకై జూచుచున్

వశమై యుండును నీకు వందనము దేవా! రామలింగేశ్వరా!       68. 

 

శా.

వారిన్ వీరిని భక్తులం చెవరినో ప్రహ్లాదమందించుచున్

జేరం బిల్చి యనుగ్రహించితివి వాసిం గాంచు సద్భాగ్యమున్

నేరం బెంచక కూర్చినాడవు భవానీనాథ! నీవంటివా 

రేరీ, లేరను ఖ్యాతి నీకిలను గాదే రామలింగేశ్వరా!                       69.

***

 

శా.

నిన్నే నమ్మితి, నీకటాక్షమునకై నిత్యంబు నిష్ఠాయుతిన్

జన్నంబట్లు త్వదీయనామజపమున్ సాగించుచున్నాడ నా

మిన్నేటిన్ జడలందు దాచిన హరా! మేలంచు నాయీకృతిన్

గొన్నం జాలును వందనమ్ము లివె నీకున్ రామలింగేశ్వరా!          70.

మ. 

నను నీదాసుని, మూఢభావుని, మనోనైర్మల్య మొక్కింతయున్

గనలేకుండిన వానినిన్, విమలసంస్కారప్రభాహీనునిన్

గొని సౌఖ్యంబు లొసంగినాడవు కదా, కోటిప్రణామంబులన్ 

నిను సేవించెద సానుభూతిగలవానిన్ రామలింగేశ్వరా!              71.

మ. 

కరిరూపంబున నున్న దానవుడటన్ గాంక్షించ నవ్వానికిన్ 

వరమందించుచు వాని కుక్షిని గదా వాసంబు గావించి త 

చ్ఛిరమున్ పూజ్యముగా నొనర్చి త్వచమున్ శ్రీకంఠ  వస్త్రంబుగా 

ధరియించన్ గొనినాడ వీవపుడు గాదా, రామలింగేశ్వరా!           72.

మ. 

ధనదుండేమి తపంబు చేసి కనెనో త్వత్సఖ్యమున్ శంకరా

మనుజుం డర్జునుడేల పొందెనొ నినున్ మాన్యాస్త్రరూపంబునన్

ఘనసర్పంబు లవేల నిల్చెనొ కదా కంఠంబునన్ భూషలై

నను నేరీతి ననుగ్రహింతువొ వదాన్యా! రామలింగేశ్వరా!                         73.

మ. 

గిరిరాట్పుత్రిక నిన్ను నందుకొర కక్షీణోగ్రసద్దీక్షతో

నిరతంబున్ తపియించి నీకు సతిగా నీయర్థదేహంబునన్ 

స్థిరతన్ జేరెను భక్తకోటిసులభశ్రీనామ మొప్పారగా 

ధరపై నీకు లభించెనో ప్రమథనాథా! రామలింగేశ్వరా!                 74. 

మ. 

కవివాక్యం బది సత్యమేని త్రిజగత్కల్యాణభావా! నినున్

స్తవముల్ చేసి జలమ్ము శుద్ధమతితో సద్బిల్వపత్రాలతో 

భవనాశంకర! గొల్చినాడను మహద్వాత్సల్యమేపారగా

జవముం జూపి యనుగ్రహించు జగదీశా! రామలింగేశ్వరా!        75.

మ. 

కడు వాత్సల్యముతోడ మౌని సుతు మార్కండేయునిం జూచుచున్

జడియంగా నిట నేలయంచు యమునిన్ చండప్రతాపమ్మునన్

దడపుట్టించుచు పారద్రోలితివయా! ధాత్రిన్ చిరాయుస్థితిన్

బడయం జేయుచు బాలకప్రవరు సాంబా! రామలింగేశ్వరా!        76.

 

 

మ. 

తినినన్ గారెలు తింటయే సరియగున్ దేవా! జగంబందునన్

వినినన్ భారత మొక్కటే వినవలెన్ విజ్ఞాళి యన్నట్లుగా 

కొనినన్ నీపదసేవ చేకొనవలెన్ కోర్కెల్ ఫలం బందగన్ 

జనసంఘావన! పార్వతీరమణ! యీశా! రామలింగేశ్వరా!                         77.

మ.

శివ నీభక్తుల కెవ్వరేని కలతల్ చేకూర్చ యత్నించినన్ 

కవిసంఘస్తుత! వారిగర్వమణచన్ గల్పించి సంత్రాసమున్

నవచైనత్యము దాసకోటి కిడుచున్ రక్షింతు వశ్రాంత మో

స్తవనీయా! యమరాజసత్వహర! యీశా! రామలింగేశ్వరా!          78. 

మ. 

సురసంఘంబు నుతించ వల్లె యనుచున్ శుద్ధాంతరంగమ్ముతో 

ధరకున్ క్షేమము గూర్చ హాలహలమున్ ధర్మంబు నాకంచు నో

కరుణాపూర్ణ! గళంబునం దునుచు సత్కార్యంబుచే నందరన్ 

హరుసంబందున ముంచి గాచితివి  ఆద్యా! రామలింగేశ్వరా!      79.

మ. 

వరగర్వంబున నింగిలో దిరుగుచున్ బహ్వాపదల్ లోకమం

దరయం జేయుచు దుఃఖసాగరమునన్ దార్యాళినిన్ ముంచు నా 

పురరూపాసురసోదరత్రయమునున్ బోకార్చి హర్షమ్ము నం

దరకున్ గల్గగ జేసినావు సురవంద్యా! రామలింగేశ్వరా!               80.

 

 

మ. 

సిరులం గోరితినా? సమస్తసుఖముల్ చేకూర్చుమా యంటినా?

నిరతౌన్నత్యము గూర్చుమంటిన ప్రభూ! నిత్యమ్ము నీసేవకున్

స్థిరశక్తిన్ గలిగించుమా, విమలతన్ జేకూర్చి యాపైని 

పరమస్థానము జూపుమంటి! శివ! దేవా! రామలింగేశ్వరా!           81. 

మ. 

పరమానందముతోడ నుంటివిగదా పండ్రెండుప్రాంతాలలో 

స్థిరసౌఖ్యంబులు గూర్చబూనుచును జ్యోతిర్లింగరూపమ్ములన్

హరియించున్ భవదీయదర్శనముచే నత్యుగ్రపాపమ్ములున్

పరమేశా! క్షణమందె భక్తులకు దేవా! రామలింగేశ్వరా!                82. 

శా.

నీవున్నట్టి స్థలంబు క్షేత్రము భువిన్, నీపాదపద్మంబు లో 

దేవా! మోక్షముజూపు స్థానములు, నీదివ్యాభిధానమ్ము మా 

కీవిస్తారభవాబ్ధి దాటుటకునై యింపారు సత్సాధనం

బై వెల్గొందును వందనమ్ము శుభకాయా! రామలింగేశ్వరా!          83.  

శా. 

నాకుం గల్గిన పూర్వపుణ్యఫలమో, నాపైని నీప్రేమయో 

ఈకర్మస్థలి భారతావనిని నాకీజన్మ సిద్ధించె ని

న్నేకాలంబున గొల్చియున్న నిటనే యిప్పించు జన్మంబు నీ 

రాకున్నన్ భవమోక్ష మో కృపనపారా! రామలింగేశ్వరా!             84.  

 

 

మ. 

ఒకచో మోక్షము నిమ్ము నాకనును, వీడొక్కొక్కచో నీస్థలిన్

సకలశ్రేష్ఠమనుష్యజన్మ మడుగున్ చాలించడున్మాద మం

చకలంకాశయ! యెంచబోకు భవదీయానుగ్రహం బెట్టులీ 

వికలస్వాంతుని జేరునో యెరుగ భావిన్ రామలింగేశ్వరా!           85. 

శా. 

ఏమాత్రంబు నఘంబుమీద భయ మిప్డీకాలమం దీయెడన్

స్వామీ! లేదు మనుష్యులందు నకటా! స్వార్థైకలక్ష్యంబుతో 

నీమంబౌగతి సంచరింతు రయినన్ నిత్యంబు  నీవొప్పుగా 

ప్రేమన్ బంచుచు బ్రోచుచుందువిల వారిన్ రామలింగేశ్వరా!       86. 

మ. 

గురుశుశ్రూషలు సన్నగిల్లినవయా! కూర్మిప్రసారమ్ము లీ 

ధరపై తగ్గుట చూచుచుంటివి కదా! దాక్షిణ్యభావా! భవ

ద్వరమాహాత్మ్యము జూపి మార్చుటకునై భావింపవా? దేవ! యీ 

నరులన్ గావవ? తండ్రివయ్యు నసమానా! రామలింగేశ్వరా!        87. 

మ. 

నిరతం బాస్తులు కూడబెట్టుట భవానీనాథ! లక్ష్యంబుగా 

నరులీకాలమునందు నుండిరి మనోనైర్మల్యతల్ పోయె నే 

కరణిన్ మైత్రియు, బాంధవత్వములు సత్కారంబునుం గాంచ వో 

హర! యీ తీరును మార్చలేవె? శుభదేహా! రామలింగేశ్వరా!         88.

 

 

మ. 

సమతాదృష్టి యొకింతలేని మనుజుల్ స్వామిత్వముం బొంది యీ 

క్రమమే యోగ్యమటంచు వైరము లిటన్ గల్పించుచున్నారు లే

శము భీతిన్ గొనకుండి రా ఘనులకున్ శర్వా! భవత్సత్వగం

ధము చూపించ వదేలనో ప్రమథనాథా! రామలింగేశ్వరా!                        89. 

శా. 

నా కీలోకమునం దసాధ్య మొకటైనన్ లేదు సర్వజ్ఞుడన్  

నాకప్రాభవ మీ ధరాస్థలమునం గల్పించ శక్యుండ నం 

చీనాడీనరు డెంచు జీమసయితం బెవ్వారినిం గుట్ట దా

శ్రీకంఠాజ్ఞ కలుంగకుండిన గదా శ్రీరామలింగేశ్వరా!                     90. 

మ. 

ఎవడెట్లుండిన నాకు నేమి సతతం బింపారు సౌఖ్యంబు లీ 

యవనిం గల్గిన జాలునంచును స్వకీయానంద సంసిద్ధికై 

వివిధానంతమహాపదల్ నిలుపుచున్ వేధించు నీలోకులన్ 

భవనాశంకర! యీనరుండు శివ! దేవా! రామలింగేశ్వరా!                        91. 

శా.

సర్వారాధ్య! మహేశ్వరా! పశుపతీ!స్వామీ! జగన్నాయకా!

శర్వా! దర్పకదర్పనాశన! శివా! శౌర్యర్చితా! ధూర్జటీ!

పార్వత్యీశ! భవాబ్ధితారక! మహాపాపాపహా! కొల్చెదన్

నిర్వాణప్రద! నిన్ను నా సిరులవానిన్ రామలింగేశ్వరా!                 92. 

 

 

మ. 

తనధర్మంబు నెరుంగకుండెనిట సద్వంశప్రకారమ్ములన్

మునిసాధుప్రకరంబు దెల్పు విధముల్ పూర్వోక్త కర్మావళుల్

గనలేకుండెను నేటి మానవుడహో కామారి! విశ్వేశ్వరా! 

విను మీ లోకమువారి గావగలవీవే రామలింగేశ్వరా!                   93. 

మ. 

అనృతంబుల్ వచియించరాదనుట తామానాటి వాక్కుల్ గదా

విను మీనాడిట నవ్వియే బ్రతుకుగా విజ్ఞత్వ మన్నట్లుగా

జనులున్నారు సుధాంశుశేఖర! ప్రభూ! సద్భావమేరీతిగా 

మనుజుల్ పొందెదరో గిరీశ! శుభనామా! రామలింగేశ్వరా!       94. 

శా. 

నేనేవేళను బిచ్చివానిపగిదిన్ నీసన్మహత్వంబులన్

దీనోద్ధారకతత్పరత్వగరిమన్ దెల్వంగలేకుంటి నీ 

వైనం బెంతవిచిత్రమో కద, భవద్భక్తాళి చిత్తస్థమౌ

దానిన్ దెల్వవె, మిన్నకుండుటది కాదా రామలింగేశ్వరా!              95. 

శా. 

నాదీదేశము భారతావని ప్రభూ! నానాప్రకారమ్ములౌ

వేదోక్తామలధర్మకర్మములచే విఖ్యాతినింగాంచి స

మ్మోదం బందరికందజేయగలదై పూర్ణానురాగాలకున్ 

పాదై యున్నది వందనం బనెద దేవా! రామలింగేశ్వరా!               96.

 

 

 

మ. 

ధవళశ్రేష్ఠమహత్ప్రభాకలితశుద్ధానందసంధాయక

స్తవనీయాద్భుతసద్యశోవిభవవిశ్వవ్యాప్తి భక్తాళి "కో

శివ! దేవా! నమ" యన్న జాలు కలుగున్ శీఘ్రాతిశీఘ్రంబుగా 

నవనిన్ సత్యము నాగభూషణ! సుదేహా! రామలింగేశ్వరా!                        97. 

శా. 

నే నేకాయము నందియుండిన ప్రభూ! నిత్యమ్ము నీరూపమే

ధ్యానం బందునని ల్పి నామజప మత్యంతాచ్ఛసద్భక్తితో

నానందంబున జేయగల్గు బలమవ్యాజానురాగాశ్రయా!

ఓనాగేంద్రసుభూషణా! యొసగుమా! ఓరామలింగేశ్వరా!                         98. 

శా.

దుష్టశ్రేణి యొనర్చు దుష్కృతులతో తోరంబుగా నిత్యమున్

కష్టంబుల్ కనుచుండి సౌఖ్యపటలిన్ గాంచంగ లేకుండు నా 

శిష్టాత్మప్రకరంబు బిల్చి శుభముల్ చేకూర్చి యర్థించకే

అష్టైశ్వర్యము లిచ్చు నీకు నతులయ్యా! రామలింగేశ్వరా!              99. 

మ. 

ఎవడీవిశ్వమునున్ సృజించు ననిశం బింపారుభావమ్ముతో 

ఎవడిందున్ స్థితి జూపు నంతమునకై యెవ్వాడు కర్తృత్వమున్  

స్తవనీయుండయి దాల్చుచుండు నతనిన్ సర్వేశ్వరున్ గొల్చెదన్

శివ! నిన్నో కమనీయదివ్యచరితా! శ్రీరామలింగేశ్వరా!                   100.

 

 

శా.

అజ్ఞానమ్మున కానిపోని కబురుల్ హాస్యప్రలాపోక్తులన్ 

విజ్ఞానప్రద! పల్కుచుంటి నిటులన్ విస్తారకోపమ్ముతో

ప్రజ్ఞాహీనుని నన్ను దూరకుమయా భవ్యాను రాగాన నీ

యాజ్ఞన్ జూపుము ధ్వాంతరాశి యది పాయన్ రామలింగేశ్వరా!            101.

శా. 

నాకున్ శత్రువు వీడటంచు నొకనిన్ నానాప్రకారమ్ముగా

నేకాలమ్మున హింసపెట్టుటకునై యెన్నేని పన్నాగముల్

స్వీకార్యంబు లటంచుచేయు నరు డీచిత్తస్థవిద్వేషులై

జీకాకుల్ గొనజేయు వారి గనడో శ్రీరామలింగేశ్వరా!                  102.

మ.

కవితాశక్తి యొకింతలేదు, పదముల్ కల్యాణభావమ్ములన్ 

ఛవి గల్గించెడి రీతి గూర్చెడి మహత్సత్వంబు లేదింతయున్ 

భవదీయాతులసత్కృపామహిమయే పద్యంబు లీరీతిగా

కవివంద్యా! పలికించె నేడిచట వీకన్ రామలింగేశ్వరా!                 103.

మ. 

ఒక సంపన్నుడు బీదవాడగుట, తానొక్కొక్కచో పేదయున్ 

ప్రకటానంతమహత్ప్రభాకలితుడై భాగ్యాన్వితుండౌట లిం

దొక లిప్తన్ ఘటియించు చిత్రగతి నీయుర్వీస్థలంబందునన్ 

సకలానందద! నీదులీల యిది యీశా! రామలింగేశ్వరా!                          104.

 

 

మ. 

పరధర్మంబులలోన నేమి కలవో భాగ్యంబులో, జ్ఞానమో,

స్థిరమోక్షంబొ, ధరాధిపత్వమొ, యిటన్ జేకూరవా యవ్వి? యీ

నరు లీరీతి మతంబు మార్చుటకటా! న్యాయంబె? నీవైన నో

హర! వీక్షించుచు నూరకుండు టెటులయ్యా? రామలింగేశ్వరా!   105.

మ.

నిను సేవించుట, నిష్ఠ జూపుచు వ్రతానీకంబులన్ జేయుటల్,

ఘనభక్తిన్ బ్రకటించుచుండుటలు నీకాలాన సాజస్థితిన్ 

గనలేకుండిన వేమి కారణ మయా! కారుణ్యరత్నాకరా! 

ధనదాప్తా! సవరింతునంచు ననరాదా రామలింగేశ్వరా!               106.

మ.

సత మక్షీణపరాక్రమక్రమముతో సత్వప్రకాశమ్ముతో

క్షితి నేలంగలవాడ నంచు దలచున్ చిత్తమ్ములో మానవుం 

డతడేవేళ నడుంగు వేయగలడా ఆత్మప్రభావమ్ముతో

సితికంఠా! భవదాజ్ఞ లేని యెడలన్ శ్రీరామలింగేశ్వరా!                107.

శా.

నిన్నర్చించెడి కాంక్షతో పురహరా!  నేనిట్లు పద్యమ్ము లం

చెన్నోభావవిహీన శబ్దములతో నిచ్చోట జ్ఞానమ్ము లే

కున్నన్ కారులు ప్రేలినాడ దయతో కూర్మిన్ ప్రసారించుచున్

మన్నించన్ నిను వేడుచుంటి గుణధామా! రామలింగేశ్వరా!        108.

 

 

 

శా.

ఎన్నోజన్మల పుణ్యమీ భవమునం దిప్పించె నీసేవలో

నున్నన్ మానస ముబ్బు భాగ్యమును సద్యోగంబదే దాని నా

పన్నానంతసుఖప్రదాయక! శుభవ్యాసంగ మౌనట్లుగా 

నన్నున్ జూడుము పాహియంటి నసమానా రామలింగేశ్వరా!     109.

***