Wednesday 23 January 2019

శ్రీ శివ శతకము


శ్రీ విఘ్నేశ్వరాయ నమ:
శ్రీ శివాయ గురవే నమ:

శ్రీ శివ శతకము 


శ్రీ విఘ్నేశుని దలచెద
గోవిందుని బ్రహ్మనట్లె గురుతర భక్తిన్
సేవించెద గౌరిని రమ
నావాణిని దలచువాడ నదనెంచి శివా!              .

కులదేవుని వేంకటపతి
నలఘు జ్ఞానాఢ్యుడైన యాగురువర్యున్
దలచెద నారాయణను
పలికించగ సాధుపద్య పంక్తులను శివా!           .

పలుకుట నేర్పిన వారగు
తలిదండ్రుల సన్నుతించి తదనంతర మీ
తెలుగును భరతావనిలో
వెలిగించిన పూర్వకవుల వినుతింతు శివా!       

శత మష్టోత్తరసంఖ్యా
యుతముగ పద్యములు చెప్ప నుద్యుక్తుడనై
క్షితి నిలిచితి నీ యెదుటను
నతులను గొని పలుకు శక్తి నాకిమ్ము శివా!       .

ఛందంబులు యత్యాదులు
నందముగా బలుకురీతు లరయని వాడన్
మందుడ నా యీ కోరిక
వందనమిదె తీర్చుమయ్య వామాంగ శివా!     .

హరివంశ సంభవుండను
స్మరహర! శ్రీవేంకటేశ సామ్రాజ్యాంబల్
సురుచిరముగ గను పుత్రుడ
ధరలో సత్యాఖ్య నుంటి తథ్యంబు శివా!        .

శ్రీకంఠ! నాగభూషణ!
చీకాకుల  ద్రుంచునట్టి చిన్మయరూపా!
లోకాల నేలు చుండెడి
శ్రీకర! ప్రణతులను  నీకు  చేసెదను శివా!                  

నీవే  లోకాధీశుడ
వీవే సర్వార్థదాత వీవే ప్రజకున్
భావావేశము గూర్చెద
వీవే తండ్రులకు దండ్రి విమ్మహిని శివా!                      

నీయాన బూని బ్రహ్మయు
నీయాజ్ఞను  గొనుచు  హరియు  నిఖిల జగాలన్
చేయుచు  నుందురు  కృతులను
నీయాజ్ఞయె దాల్తు రెల్ల నిర్జరులు శివా!                           .

శిరమున గంగను, చంద్రుని
నురమున సర్పములు, పుర్రె  లుత్సవ మనుచున్
సురుచిర  సౌఖ్యము లొసగుచు
ధరవారిని గావ నీవు దాల్చెదవు    శివా!           ౧౦.

సురగణము కోరినంతట
నిరుపమగతి విషము  నపుడు నిష్ఠాగరిమన్
సరియంచు  ద్రావినాడవు
స్మరహర! నినె గొల్తునయ్య! సతతంబు శివా!           ౧౧

జల మించుక  గొని హర! నీ
తలపై చల్లియును  బిల్వ తరుపత్రాలన్
నిలిపిన వారల కిలలో
నలఘు సుఖంబులను గూర్తు  వనుదినము శివా!  ౧౨

ఆకాశంబున దిరుగుచు
చీకాకులు  మహిని గల్గ చేసెడి వారిన్
పోకార్చి ద్రుంచినాడవు
ప్రాకటముగ నాడు, గొనుము ప్రణతులను శివా!  ౧౩

తల్లివి  నీవై  సతతం
బెల్ల జగంబులను  గాతు వేవిధి జూడన్
ఫుల్లాబ్జనేత్ర! శంకర!
సల్లలితానందసుఖద! సకలస్థ! శివా!                            ౧౪

శిరముం  కంఠము  వదనము
కరచరణాదులును నాదు కన్నులు తనువున్,
పురహర! నిను సేవించుటకే
నిరతము  నిను  గొల్చు బుద్ధి నీవొసగు శివా!       ౧౫

అభిషేకప్రియ! శంకర!
శుభవరదాయక! శుభాంగ! సుందరమూర్తీ!
విభవంబు లొసగు దేవర!
యభయం  బిచ్చుచును  గావు మనుదినము శివా!౧౬.   

అరుసంబున నీనామము
నిరతము  స్మరియించువారి నిఖిలాఘంబుల్
కరుణామయ! నశియించును
ధరపయి ప్రమథాధినాథ! తథ్యంబు శివా!             ౧౭.

 వేదంబులు  నీమహిమను
మోదంబున బల్కుచుండు  మునిసంఘంబుల్
శ్రీదుండని కొనియాడుదు
రాదియు  నంతంబులేని యాద్యుడవు శివా!        ౧౮.

 శివ! శంకర! అభయంకర!
భవబంధవిమోచనోగ్ర! భక్తాధీనా!
ధవళాచలగేహా! 
నవనిధిసౌభాగ్యదాత! నను గావు  శివా!              ౧౯.

నీవెవ్వని  యోగ్యునిగా
భావింతువొ  వాని కిలను  బహు సంపదలన్
దీవించి  యొసగు చుండెద
వేవేళను  సన్నుతింతు  నేనికను శివా!                    ౨౦.

నిన్నే నమ్మితి కావుము
మిన్నేటిని తలను దాల్చి మేదిని లోనన్
మన్నిక సంహారము
సన్నుతముగ చేయు దేవ! సర్వేశ! శివా!              ౨౧.

శివరాత్రిని నిను గొల్చెడి
భువివారల కభయ మొసగి పో పొమ్మనుచున్
జవమున సంఘంబుల
నవతలికిం ద్రోచివేతు వద్భుతము శివా!          ౨౨

నిను నమ్మి పట్టు వీడని
నగుణుడైనట్టి వాని కడు వత్సలతన్
మునిబాలుని  చిరజీవిగ
మును చేసితి వౌర! నాడు ముదమంద శివా!     ౨౩

కరిరాజవరద! శంకర!
కరిముఖసన్మానదాత! కరుణాపూర్ణా!
నిరతానందద! సురవర!
సరియగు భావంబు లొసగ సన్నుతులు శివా!   ౨౪

భోళాశంకర! శుభకర!
కూళల బరిమార్చు నట్టి కోరిక తోడన్
వ్యాళములు దాల్చి యీ భూ
గోళమున న్నిలుచు నిన్ను గొలిచెదను శివా!   ౨౫

బూడిద గాదీ చూర్ణము
పోడిమి సమకూర్చునట్టి పుణ్యప్రదమౌ
సూడిద గావున దాల్చుచు
వేడెద నాయము గాల్చి వేయంగ శివా!          ౨౬

మారేడున మూడాకులు
నీరేజాక్షాప్తమిత్ర! నీ నేత్రమ్ముల్
తీరుగ మూడే కావున
నీరీతిగ వానినందు మీశాన! శివా!                 ౨౭.

పండ్రెండు  పేర్ల నందుచు
గుండ్రాతిగ రూపు దాల్చి గొలిచిన యెడలన్
తండ్రీ! వరముల నిత్తువు
పుండ్రాభశరీర! నిన్ను పూజింతు శివా!             ౨౮.

మాయ చేసినాడవొ
భూమి న్నినుగాక యొరుని పొంద నటంచున్
నీమంబున నా శైలజ
స్వామీ! గాటంపు తపము సల్పినది శివా!     ౨౯.

శిరమున సురనిమ్నగ నిక
సరసంబుగ తనువునందు శైలజ నటులే
యురగంబులు కంఠంబున
సురుచిరగతి దాల్చినావు శోభనము శివా!     ౩౦.

నీకొసగిన నాల్గాకులు
మాకిచ్చెద వెల్లసిరుల ముము గావంగా
శ్రీకంఠ! చేరియుండెద
వేకాలం బెదలలోన నీశాన! శివా!                 ౩౧.

సోమేశుడ వొకచోటను
భీమేశుడ వొక్కచోట విశ్వేశుడవై
కామేశ! నిలిచి యుందువు
భూమిన్ మము బ్రోచు కొఱకు పురవైరి! శివా! ౩౨.

జాగేల మమ్ము గావగ
రోగావృత మయ్యె జగతి రుద్ర! మహేశా!
ఆగణనాయకు నైనను
మా గాసి యణంగద్రొక్కు మనరాదె శివా!     ౩౩

స్వార్థంబు  పెరిగి పోయెను
తీర్థంబుల కలుషితంబు స్థిరమయి యుండెన్
వ్యర్థంబగు కలహంబు
నర్థాలకు తావులయ్యె నరయంగ శివా!            ౩౪.

పరభాషలు పరమతములు
పరసంస్కృతు లన్నిచేరి భారతభువిపై
నిరతము నాట్యం బాడుచు
నురుతరముగ భీతి గొల్పుచుండినవి శివా!      ౩౫.

అలసత్వమొ జనములలో
కలియుగ కారణమొ మేటి కలుషంబులకున్
తెలియదు భారతవర్షం
బలఘు యశంబులను పొంద నగునేమి శివా!   ౩౬.

జీవితము బుడగ వంటిది
భావన చేయంగ దరమె పడు సమయంబున్
చావిట చేరక మునుపే
నీవే రక్షకుడవౌట నినుదలతు శివా!                ౩౭

మంగళమయ మా రూపము
మంగళకరయైన సర్వమంగళ సతియున్
మంగళము తలపు గావున
మంగళములు గూర్చవయ్య మహిలోన శివా! ౩౮

సత్యము మృగ్యం బయ్యెను
నిత్యంబును జనులలోన నిష్ఠ యణంగెన్
కృత్యంబుల మాలిన్యం
బత్యంతము హెచ్చిపోయె యంతటను శివా!   ౩౯.

ఈశ్వర! కరుణా సాగర!
శాశ్వత సుఖదాత! శర్వ! సాంబ గిరీశా!
విశ్వవ్యాప్తా! రుద్రా!
నశ్వరమౌ భవమునుండి నను గావు శివా!       ౪౦.

మృత్యుంజయ! విశ్వేశ్వర!
నిత్యానందప్రదాత! నిఖిలేశ! హరా!
అత్యుగ్రపాప సంహర!
భృత్యామయహర్త! నతులు భీమేశ! శివా!        ౪౧

త్రిపురంబుల నొకవ్రేటున
నపుడార్చితి వయ్య లోక మానందింపన్
విపరీతముగా బెరిగిన
యపరాధము లణచబూన వలుకేల శివా!         ౪౨.

ఈశానా! పరమేశా!
హేశంకర! భయవిదూర! హేభూతేశా!
కాశీనాథా! కల్మష
నాశంకర! సర్పభూష!నతులందు శివా!           ౪౩.

సోదరులకు వలె నందరు
వేదోక్త సుఖంబులంది విమలాత్మకులై
మోదము గోల్పోకుండుట
కేదేని విధంబు దెల్పు మీశాన శివా!               ౪౪.

క్షణిక సుఖంబుల కోసం
బణుమాత్రము చూడనట్టి యత్యుత్తమమౌ
గుణమును నాకీవేళను
ప్రణతులు గొని యీయవయ్య పరమేశ శివా!  ౪౫.

ద్వాదశ జ్యోతిర్లింగము
లాదట భూభాగమంత నగణిత లింగా
లోదేవ! నింపి యుంటివి
కాదే యుచితంబు మమ్ము గావగను శివా!     ౪౬

కాశీవిశ్వేశ్వరుడవు
నాశించిన సత్ఫలంబు లందించెద వీ
దేశమును బ్రోచువాడవు
ధీశక్తి యొసంగు మయ్య దినదినము శివా!     ౪౭.

పొమ్మంచు గెంట జూచిన
నెమ్మనమున నిన్నెదలతు, నీచరణములన్
నమ్మెద నారక్షకు లిక
నిమ్మహి నీకన్న నన్యు లెవరయ్య శివా!            ౪౮.

ఫలసిద్ధికి కారకులీ
యిలపైనను తామటంచు నిచ్ఛావాక్కుల్
పలికెదరు మూఢజనములు
తలపక నిను బొంద గలరె తత్ఫలము శివా!      ౪౯.

నిరతము నిన్నే దలచుచు
వరగుణముల నిమ్మటంచు ప్రత్యహ మడుగన్
కరుణామయ! స్వార్థంబా?
సరికాదా? చెప్పుమయ్య సర్వేశ! శివా!             ౫౦

కులధర్మము  నశియించుచు
నిలలో పాశ్చాత్యరీతు లెంతయు బెరిగెన్
బలహీనం బై పోవుచు
నలసెను హిందూత్వమిచట యనుచితము శివా! ౫౧

నీనామ జపము చేసెద
నీనందికి ముదము గూర్చి నిను మెప్పింతున్
నీనారీమణి గొలిచెద
నేనెప్పుడు బ్రోవుమయ్య నిటలాక్ష! శివా!         ౫౨.

జయమగు బోళాశంకర!
జయమగు భక్తార్తినాశ! జయము పినాకీ!
జయమగు  భవభయతారక!
జయమగు నీ కెల్లవేళ జయమగును శివా!        ౫౩.

జగదాధారుడ వీవని
నిగమము స్తుతియించుచుండు, నీ నామంబే
ఖగవాహనుండు, సురలును
భగవంతుడ కావుమనుచు బలుకుదురు శివా!   ౫౪.

జననీ జనకుల యందున
నతరమగు గౌరవంబు కడు ప్రేమంబున్
మనుజులలో కల్పించగ
ధనదాత్మసఖా! నమశ్శతములందు శివా!        ౫౫.

నందీశ్వరవరదాయక!
బృందారక భాగ్యదాత! విశ్వవిధాతా!
వందితసకలామర! హర!
వందే కరుణాంతరంగ! పరమేశ! శివా!             ౫౬

అకలంక భావగరిమయు
ప్రకటిత సద్వినయదీప్తి పావనచరితల్
సకలంబును ప్రేమించుట
లొక మార్గము నిన్ను జేరుచుండుటకు శివా!     ౫౭

హే చంద్రశేఖరా! మృడ!
నీచరితము పావనంబు నీదాస్యము మా
కాచరణీయము కావున
యోచింపక నిన్నెగొల్చు చుండెదను శివా!       ౫౮.

సమయోచిత వర్తనమును,
సుమధుర సద్వాక్యపటిమ శర్వా! నాకున్
విమలంబౌ భావంబులు
నమలిన సద్వినయదీప్తి యందించు శివా!      ౫౯.

ఏకాదశ రుద్రంబులు
నీకర్పించెదను దేవ! నిష్ఠాగరిమన్
చేకొని వాత్సల్యంబున
చీకాకులు ద్రుంచి యొసగు క్షేమంబు శివా!     ౬౦

శివరాత్రి రాత్రి వేళల
భవదీయార్చనము సేతు, భాగ్యము గోరన్
భవబంధము వీడుటకై
భవహర! సద్భక్తి నీయ బ్రార్థింతు శివా!          ౬౧.

         (ఓంనమశ్శివాయ)
ఓం కారము నీరూపము
  సంకటహర మంత్ర మదియె సతతము దానిన్
  శంకాలేశము నందక
  పంకేరుహనేత్రమిత్ర! పలికెదను శివా!               ౬౨.

ను  నీదాసుని బ్రోచెడి
  పని నీకనివార్యమైన బాధ్యత గాదా?
  ధన మిమ్మని యడిగితినా?
  యనుపమ సద్భావ మీయ వదియేల శివా!        ౬౩.

దనారి! నందివాహా!
  సదయా! కైలాసవాస! సర్పాభరణా!
  కదనభయంకర! రుద్రా!
  విదళిత సర్వోగ్రదైత్య! వీరేంద్ర! శివా!              ౬౪.

శివమన మంగళమౌ గద,
  శివయన (నీసతికి బేరు) పార్వతికి బేరు శివుడన నీవున్
  శివశివ శివశివ యనియెద
  నవగుణముల గూల్చి చూపు మనుకంప శివా!    ౬౫.

వారని వీరని జూడక
  చేరినచో ప్రేమజూపి క్షేమము లెపుడున్
  కారుణ్యపూర్ణ! యిడు నీ
  తీరది యన్యత్ర లేని తేజంబు శివా!                  ౬౬.

జనముల నెన్ని చేసిన
  భజియించిన భక్తితోడ పలుదైవములన్
  నిజమిది నిను దలవనిచో
 ప్రజ కేడ సుఖంబు భువిని పరమేశ! శివా!          7.

శిరమున గంగను దాల్చితి
వరయవు జలహీనయైన జగతిని ప్రజకున్
నిరతము కలిగెడి యిడుములు
కరుణామయ! యాదుకొనవె గతినీవె శివా!       ౬౮.

శిర మొసగితి వా గంగకు
గరళంబున కొసగినావు కంఠము జూడన్
తరుణికి కాయం బొసగిన
నిరుపముడగు త్యాగివంచు నిన్నందు శివా!     ౬౯.

కరుణాదృక్కులు నాపై
ధర నెప్పుడు బంపవయ్య ధన్యుడ నగుదున్
సరిలేరు నీకటంచును
నురుతర సద్భక్తి గొల్చు చుండెదను శివా!       ౭౦.

ప్రమథాధిప శ్రీకంఠా!
కమనీయగుణాఢ్య రుద్ర! కామితఫలదా!
సమతాపూర్ణా! శంకర!
మమతను జూపించుమయ్య మాపయిని శివా! ౭౧.

ముక్కంటీ నీసము లిం
కొక్కరు నీ  భూమిపైన నుండుట కలయే
గ్రక్కున శరణం బీవని
మ్రొక్కెద రక్షకుడ వీవె మునివంద్య! శివా!       ౭౨.

పిలిచిన పలుక వదేలా?
అలుకకు కతమేమిటయ్య అలికాక్ష! నినున్
దలచుటలో లోపంబా?
కలికాలము చూపదగును కనికరము శివా!      ౭౩.

గురుభక్తి సన్నగిల్లిన
దరయంగా ఛాత్రులందు నఖిల జగానన్
మరుగున బడె శుశ్రూషయు
స్థిరమతి లోకమున కెట్లు చేకురును శివా!       ౭౪.

తనువున సగ మొక సతికిడి
యనువున శిరమొక్క యతివ కందించవె నీ
వనుపముడవు మహిళల కిల
ననుచితముల నాపవేల? యనుదినము శివా!  ౭౫.

మోసములకు స్థానంబై
వాసిని గోల్పోవుచుండె భరతావని యా
వాసము తానై యున్నది
కాసుల యాశలకు దేవ! కనవయ్య శివా!           ౭౬.

పర్వతరాజ కుమారిక
సర్వేశా! దయను జూప సమ్మతి నిడదా?
ఉర్వీతలమం దేలనొ
పర్విన యవినీతి నణచు పనిగొనవు శివా!          ౭౭.

ఎటు చూచిన దుష్కృత్యము
లెటు విన్న నసత్యవాక్కు లేమని యనినన్
కటుతరమౌ వచనంబులు
నిటలాక్ష! జగంబులోన నిత్యమును శివా!          ౭౮.

జననీజనకుల సేవకు
తన సంతతి జూచు కొరకు తథ్యం బిలలో
జనునకు సమయము లేదని
యనయంబును బల్కుచుండు టనుచితము శివా!  
                                                               ౭౯.
మరియాద లేని యాదర
మరయగ సద్భక్తి లేరి హరిహర సేవల్
పరహితము గోరకుండని
నరు వర్తన నింద్య మంచు నమ్మెదను శివా!        ౮౦.

తానే సర్వజ్ఞుం డని
ధీనిధులను ధిక్కరించి తిరిగెడి వానిన్
జ్ఞాన విహీనునిగా జను
లీనేలం జూడవలయు నెల్లెడల శివా!                  ౮౧

జగదధినాయక! శంభో!
నిగమస్తుత! కృత్తివాస! నిఖిలావాసా!
అగజాప్రాణాధీశా!
భగవన్! హే విశ్వరూప! ప్రమథేశ! శివా!             ౮౨

నిను చర్మాంబరు జూచుచు
ననయము సంతోష సౌఖ్య మందెడి కనులే
కనులని బలుకగ వలయును
నతాపము దీరు నిన్ను గనుచుండ శివా!      ౮౩.

నిత్యానందం బందుచు
నత్యుత్సవ మంచు దలచి యనవరతంబున్
సత్యంబౌ నీచరితం
బత్యంతము విన్న దొలగు రాశి శివా!       ౮౪.

నీ యాలోచన సేయగ
శ్రేయంబులు గలుగుచుండు సిరిసంపద
త్యాయత మగు సద్యశమును
స్వాయత్తం బౌ నటన్న సత్యంబు శివా!         ౮౫.

యోగులకు యోగి వభవా!
భోగీంద్రాభరణ! వినుము  భూవాసులకున్
రోగహరం బగువిధి
ద్యోగం బందించ వయ్య తుహినాభ! శివా!      ౮౬.

శశిశేఖర! శిపివిష్టా!
దశదిశలం దలమియున్న దానవ శక్తిన్
భృశ మణచివేసి యది నీ
వశమగు నట్లుగను జూడ బ్రార్థింతు శివా!        ౮౭.

నిను సేవించెడి శక్తిని
గొనకొని యర్చించునట్టి గురుతర భక్తిన్
మనసారగ జనులందరి
ననుదినమును బిల్చు భావ మందించు శివా!   ౮౮.

నీపాదార్చన వీడను
పాపము  లొనరించువాడ బహుభంగులుగా
కోపించక నామీదను
చూపుము కనికరము సర్వసుఖదాత! శివా!      ౮౯

తలిదండ్రుల సంసేవన
మిలలో సర్వార్థదాయి యేకాలమునన్
పలురకముల యత్నించియు
వలయును తత్కార్య మెల్ల వారలకు శివా!  ౯౦.

స్త్రీ సృష్టికి మూలం బిక
స్త్రీ సంతస మందజేయు  శ్రేయము గూర్చున్
స్త్రీ సద్యత్నము జూపును
స్త్రీ సర్వుల మేలు గోరు తేజంబు శివా! ౯౧.

అతివకు కీడొనరించిన
క్షితిపయి సుఖ మంద గలరె, చేరునె సిరు లా
హితమతిని గౌరవించగ
నతులిత వైభవము లబ్బు నందరకు శివా! ౯౨.

హర! మృత్యుంజయ! శంకర!
హరిణాక్ష! శ్మశానవాసి! యాద్యా! ధన్వీ!
పరమా! సర్వజ్ఞా! భవ!
సురరక్షక! సర్వచారి! స్తుతులందు శివా! ౯౩

లింగాకారముతో
త్సంగము భక్తాళి కొసగ సర్వత్ర భువిన్
రంగారు చోట్ల నుండిన
శృంగీశా! ప్రణతు లిడుదు చేకొనుము శివా!  ౯౪.

జేజే  కైలాసాధిప!
జేజే  భువనాధినాథ! జేజే  రుద్రా!
జేజే  సకలశుభంకర!
జేజే  సురరాజివంద్య! జేజేలు శివా!  ౯౫.

తలపులలో పిలుపులలో
పలుకులలో చేరి చూపు వలపులలోనన్
నెలతలలో పురుషులలో
కలుషంబే కానవచ్చు కలియుగము శివా!  ౯౬

ధనమే మూలం బాయెను
మనుషుల కీ జగతిలోన మమతా సమతల్
కనిపించని స్థితి నున్నవి
విను మో కైలాసవాస! విశదముగ శివా!            ౯౭.

పరివార సభ్యులందున
సరియగు సద్భావయుక్తి సాగిన యెడలన్
నిరతము సంతోషంబులు
ధరపై గాంచంగ వచ్చు దైత్య ఘ్న! శివా!          ౯౮.

సోదరతతితో సతము వి
భేదించుచు పలుకువాడు  పెను కష్టములన్
మేదిని పొందును సత్యము
మోదము కలుగుటయు కల్ల పురహంత! శివా!   ౯౯.

నీనామమె మంత్రంబై
మానసమున జేరియుండ మా కీజగతిన్
జ్ఞానప్రద! చిద్రూపా!
మానం బందంగ శంక మరియేల శివా!           ౧౦౦.

పరహితము కోరువారికి
సురుచిర సౌఖ్యంబు లబ్బు సుందర యశముల్
ధరపై కలుగంగాగల
వరయగ నేకాల మైన ననుదినము శివా!         ౧౦౧.

సతిపై విశ్వాసం బిల
పతి కుండగవలయు జూడ పతిపై సతికిన్
సతతం బుండిన సాగును
జతగా సంసార మెపుడు సత్యంబు శివా!        ౧౦౨

వినయంబును, సచ్ఛీలము
ఘనతరమై వెలుగునట్టి కారుణ్యంబున్
మనుజుడు తాల్చంగా వలె
ననుపమయశ మందుకొనగ ననియెదను శివా! ౧౦౩.

అనయము సత్కార్యములే
మనుజునకుం జేయదగును మహి నెల్లపుడున్
జనహితము కోరుచుండుట
నతను కలిగించునట్టి కర్మంబు శివా!  ౧౦౪

కలికాలము కల్మషముల
నిలయం బని పలుకువారు నిరతము తా మీ
యిలపై చేయుచు నుండెడి
తలపులు స్మరియించ రెపుడు తామేల శివా! ౧౦౫.

గురుజనులను సేవించగ
ధరణిని సుఖమొదవుచుండు ధర్మము లందున్
వరమగు దీనిని దాల్చుట
పురుషున కావశ్యకంబుపో యందు శివా! ౧౦౬.

తనకీ జగతి నసాధ్యం
బనునది లేదంచు సతము బహుగర్వితుడై
యనయము మదిలో దలచెడి
జనునకు మృతి నందకునికి సాధ్యంబె శివా!  ౧౦౭.

మణిభూషితుడై యున్నను
గుణహీనుడు పొందబోడు కువలయ మందున్
ప్రణతులు సత్యము  జనులను
గుణములె దాల్చంగ నెపుడు కోరెదను శివా!  ౧౦౮.

ఏకాగ్రత ప్రతిపనిలో
నేకాలం  బుండవలయు నిల నందరకున్
శోకావేశ మణంగును
చీకాకులు తొలగు దాన శీఘ్రంబు శివా!   ౧౦౯.

దైవతములు ధరపైనను
జీవన నిర్ణేత లగుట స్థిర సద్భక్తిన్
భావన నిర్మలమగు విధి
సేవించగ వలయు నెందు చిద్రూప! శివా!  ౧౧౦.

ఛందంబుల గతి దెలియని
మందుడ  నాచేత నిన్ని మహితోక్తులనున్
సుందరముగ బలికించితి
వందుము శతవందనంబు  లనియెదను శివా! ౧౧౧

శతరుద్రీయముగా నిది
క్షితి జదివిన కాంక్షదీర్చి చిన్మయ రూపా!
యతులిత యశ మవ్వారికి
వెతదీర్చి యొసంగు మంచు విజ్ఞప్తి శివా!      ౧౧౨.

హ.వేం.స.నా.మూర్తి.

No comments:

Post a Comment