Sunday 6 January 2019

శ్రీ కసాపుర హనుమత్ శతకము

శ్రీరామ
శ్రీహనుమతే నమః
శ్రీ కసాపుర హనుమత్ శతకము
(05-05-18 నుండి 14-05-18 వరకు)
                                                    ఛందము : ఆటవెలది

శ్రీద! మోదకారి! చిద్రూప! యసురారి!
విపుల హర్షభరిత! విమలచరిత!
నకసాపురేశ! యినకోటి సంకాశ!            
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  1.

విను కసాపురీశ! విజ్ఞప్తి యొక్కటి
పద్యశతము నిపుడు పలుకబూని
నిలిచియున్నవాడ! నీ సేవకై దేవ!
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  2.

పండితుండగాను మెండైన శబ్దముల్
నియమజాల మేమి నేర్వనట్టి
వాడ పూర్తిచేయు భారంబు నీదయా!
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  3.

ఆదిలోన మ్రొక్కి యావిఘ్ననాథుని
పిదప తలచువాడ వేంకటేశు
నటులె శారదాంబ నాదైవతంబులన్
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  4.

అంత నన్నయాదులగు కవీంద్రుల నెల్ల
తలచి పద్యశతము పలుకు పనికి
సాహసించుచుంటి సత్త్వంబు గూర్చుమా
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  5.

అందమైన జన్మ మందించి యున్నట్టి
తల్లిదండ్రుల నిల నెల్లవేళ
మ్రొక్కువాడ హనుమ మోదంబు గూర్చుమా
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  6.

గురుజనాళి భవ్య చరణంబులకు మ్రొక్కి
పద్యరచన కిప్పు డుద్యమించు
చున్నవాడ నయ్య నన్నాదుకొనుమయ్య
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  7.

అమలమై వెలుంగు హరివంశమందున
పుట్టి నాడ నన్ను పుడమి వారు
సత్య మూర్తి యండ్రు నిత్య! నీదాసుండ
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  8.

నిలిచి కొలుచువారి నిఖిల కష్టంబులన్
దొలగద్రోచి బ్రోచి యలఘు సుఖము
లందజేతు వెప్పు డందుము సన్నుతుల్
కలుషహా! శరణ్య! కపివరేణ్య! 9.

తలచి పిలువ నిచట పలికెడి దైవమై
యీకసాపురాన నింపుమీర
వివిధ వరములొసగ వెలుగొందుచున్నావు
కలుషహా! శరణ్య! కపివరేణ్య! 10.

భయము చెందనేల? భక్తులీనేలపై
రండు నన్ను జేరు డండయగుదు
ననుచు జీరుచుందు వనిశంబు జనులను
కలుషహా! శరణ్య! కపివరేణ్య! 11.

సన్నుతింతు మయ్య! సద్భక్తి ననునిత్య
మర్చనల్ పొనర్తు మందుకొనుము
మమ్ము గావవయ్య! మారుతాత్మజ! దేవ!
కలుషహా! శరణ్య! కపివరేణ్య! 12.

భక్తితోడ జేరి బహుభంగులను నిన్ను
గొల్చువారి కెపుడుకువలయమున
విను కసాపురీశ! నతరసుఖమిమ్ము
కలుషహా! శరణ్య! కపివరేణ్య! 13.

తల్లి వీవు హనుమ! తండ్రివి గురుడవు
సోదరుండ వికను చూడ నాకు
సఖుడ వింతయేల సర్వంబు నీవయ్య
కలుషహా! శరణ్య! కపివరేణ్య! 14.

రోమరోమమందు రామనామము జూపు
రామభక్త నీదు రమ్యమైన
చరిత తెలియు భాగ్య మరిహంత! యొసగుము
కలుషహా! శరణ్య! కపివరేణ్య! 15.

గుంతకల్లు పురికి కూతవేటున నున్న
నకసాపురాన కరుణజూపి
దాసజనుల బ్రోవ వాసముంటివి నీవు
కలుషహా! శరణ్య! కపివరేణ్య! 16.

ఈకసాపురస్థు లెన్ని జన్మలలోన
చేసినారొ పుణ్య మాసుకృతికి
సంభవించె నీదు సహవాసభాగ్యంబు
కలుషహా! శరణ్య! కపివరేణ్య! 17.

రామదాసు వౌట కామితంబులయందు
నాసజేసి చేరు దాసజనుల
యంతరంగ మరసి యందించెదవు శక్తి
కలుషహా! శరణ్య! కపివరేణ్య! 18.

నిన్నుబోలు వరదు లెన్నంగ భువిలోన
నొక్కరైన లేరు నిక్కమయ్య!
యనుదినంబు గొల్తు ననుకంప జూపుమా
కలుషహా! శరణ్య! కపివరేణ్య! 19.

వాయుపుత్ర! హనుమ! జ్ఞేయంబు నీశక్తి
సకలజగతిలోన సంతతంబు
సజ్జనాళి బ్రోవ సంకోచ మేలనో
కలుషహా! శరణ్య! కపివరేణ్య! 20.

హే కసాపురేశ! హే భక్తపాలకా!
నీకు ప్రణతులయ్య! నిర్మలాంగ!
అనుచరాళిబ్రోవ నాలసించెదవేల?
కలుషహా! శరణ్య! కపివరేణ్య! 21.

తమలపాకులంది క్రమత నీసేవకై
చట్రమందు గూర్చి సంతసమున
చేరవచ్చుచుండు వారిని గావుమా
కలుషహా! శరణ్య! కపివరేణ్య! 22.

నాల్గు దెసలనుండి నమ్మి రక్షకుడంచు
శ్రమకు వెరవకుండ నమలినహృది
నరుగుదెంచువారి కగుమయ్య త్రాతవు
కలుషహా! శరణ్య! కపివరేణ్య! 23.

రోగనాశనంబు కాగలదిందంచు
నీసమక్షమందు నిలుచుకొరకు
నేగుదెంచు జనుల కీవయ్య ధైర్యంబు
కలుషహా! శరణ్య! కపివరేణ్య! 24.

సోదరుండ వౌట నాదరంబున నన్ను
చేర బిలువు మయ్య స్థిరత నెపుడు
రామనామజపము రమ్ము చేసెద మంచు
కలుషహా! శరణ్య! కపివరేణ్య! 25.

అతులమైన తేజ మత్యున్నతత్వంబు
విపులమానసంబు విమలభావ
మన్యదైవతముల నగుపించగా బోవు
కలుషహా! శరణ్య! కపివరేణ్య! 26.

రామభక్త!హనుమ! రమణీయగుణధామ!
అంజనాతనూజ! ఆంజనేయ!
వరకసాపురీశ! వందనం బందుమా
కలుషహా! శరణ్య! కపివరేణ్య! 27.

నెట్టికంటి హనుమ! నిన్ను గొల్చినవారి
నాదుకొనెడి కార్యమందు నీవు
సంశయింప వనుట సత్యోక్తి సత్యంబు
కలుషహా! శరణ్య! కపివరేణ్య! 28.

ధర్మమార్గమందు మర్మంబు లెంచక
సంచరించునట్టి సన్మతి నిల
జనుల కీయవయ్య జయ కసాపురదేవ!
కలుషహా! శరణ్య! కపివరేణ్య! 29.

సజ్జనాళి నరసి ముజ్జగంబులలోన
సత్త్వయుక్తి జూపి సంతసంబు
నిత్య మొసగుమయ్య నెట్టికంటిప్రభూ!
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  30.

ధరణిలోన జనులు తమధర్మమును వీడి
యన్యమందగోరుటనుచితంబు
వెరపు గూర్చుమయ్య! మరలింప రావయ్య!
కలుషహా! శరణ్య! కపివరేణ్య!   31.

అనుచితంబులైన యాశలు కల్పించి
మతము మార్చ జూపు మందమతుల
నిలిపి హుంకరించు మిల కసాపురదేవ!
కలుషహా! శరణ్య! కపివరేణ్య!   32.

దీక్షతోడ జేయు దివ్యవ్రతంబులన్
దండ్రి వగుట మాకు త్రాత వగుట
నెట్టికంటిహనుమ! నీవంద గోరెద
కలుషహా! శరణ్య! కపివరేణ్య!   33.

మాన మొసగునట్టి జ్ఞానప్రదుండవు
గాన గొలుచునట్టి మానవులకు
సత్త్వమొసగునట్టి సద్బుద్ధి నిమ్మయా
కలుషహా! శరణ్య! కపివరేణ్య!   34.

వేయి పేరులంది విశ్వవిఖ్యాతితో
వెలుగుచున్న నీవు విశ్వమునకు
నెట్టికంటి హనుమ! నియతిని జూపుమా
కలుషహా! శరణ్య! కపివరేణ్య!   35.

నీకు భక్తితోడ నిత్యార్చనల్  సేయ
నియతిబూని కెడను నిలుచువారి
కిహము పరము సత్య మెంతేని సుఖదమౌ
కలుషహా! శరణ్య! కపివరేణ్య!   36.

సేవ చేయ బూని దేవ నీచెంతకు
కోరి చేరి వారి నోరి! యనుచు
హుంకరించ వలదు శంకరాంశజ! దేవ!
కలుషహా! శరణ్య! కపివరేణ్య!   37.

అంజనాసుగర్భసంజాత! హనుమంత!
యంజలింతు పాపభంజనంబు
చేయ వేడుచుంటి శ్రీనెట్టికంటీశ!
కలుషహా! శరణ్య! కపివరేణ్య!   38.

సాధుసంగమంబు సన్మార్గగమనంబు
సంసేవ నిత్య సత్యయుక్తి
శ్రీకసాపురీశ! నాకు నందించుమా
కలుషహా! శరణ్య! కపివరేణ్య!   39.

విను కసాపురేశ!వేదోక్త విధిగాని
ప్రస్తుతించునట్టి ఫణితిగాని
నేర్వనైతి నయ్య నీకంజలించెద
కలుషహా! శరణ్య! కపివరేణ్య!   40.

సౌఖ్యదూరమైన సంసార జలధిలో
మునిగియుండినట్టి మనుజులకిల
నెట్టికంటి హనుమ! నీసేవ తరణంబు
కలుషహా! శరణ్య! కపివరేణ్య!   41.

స్వప్నమందు జేరి సద్యోగమును గాంచు
పథము జూప బూని భక్తులకును
బోధ చేయుచుండు వాధులన్ గూల్చంగ
కలుషహా! శరణ్య! కపివరేణ్య!   42.

ఆగ్రహించకయ్య! ఆంజనేయస్వామి!
శ్రేష్ఠగతిని పూజసేయు విధులు
నేర్వనట్టివాడ నెట్టికంటిప్రభూ
కలుషహా! శరణ్య! కపివరేణ్య!   43.

రామ జపము చేత రాజిల్లుచున్నావు
చిరము పుడమిపైన వరగుణాఢ్య!
కరుణజూపుమయ్య! సురుచిరానందదా!
కలుషహా! శరణ్య! కపివరేణ్య!   44.

సర్వభారకుండ వుర్విని రక్షించు
దక్షుడీ వటంచు లక్షణముగ
నిన్ను దలచువారి నన్నింట గావుమా
కలుషహా! శరణ్య! కపివరేణ్య!   45.
 
తమలపాకు దెచ్చి క్రమత నీనామంబు
లన్ని చెప్పుచుండి యమిత భక్తి
గొల్చుచుందుమయ్య కూర్మి జూపించుమా
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  46.

రామచంద్రమూర్తి రాజిత సత్కీర్తి
నిన్ను బ్రోచునట్లు నెట్టికంటి
హనుమ! కావుమయ్య యనిశంబు భక్తులన్
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  47.

పలుకులందు నట్లె భావంబునందును
కడగి చేయునట్టి కర్మలందు
నిండె స్వార్థమిలను నెట్టికంటి ప్రభూ!
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  48.

వాయుపుత్ర! రక్ష! ధీయుతాశ్రితపక్ష!
సర్వకార్యదక్ష! సత్యదీక్ష
యందు సత్వమిమ్ము వందనంబులు నీకు
కలుషహా! శరణ్య! కపివరేణ్య!   49.

రుద్రవీర్యజాత! సద్రూప! యరిహంత
చతురవాక్య హనుమ! నుతులు గొనుమ!
హే కసాపురస్థ! నీకు దండములయ్య
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  50.

ఉపచారములు:
ధ్యానము:
పవనతనయ! హనుమ! బహుశాస్త్ర కోవిద!
నెట్టికంటి దేవ! నిర్మలాంగ!
యనుచు నిన్నుదలతు మనుకంప జూపుమా
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  51.

ఆవాహనము:
హే కసాపురీశ! నీకుపూజలు చేయ
దలచినాడ నిచట నిలువు మయ్య
యనుచు భక్తితోడ నాహ్వాన మొసగెద
కలుషహా! శరణ్య! కపివరేణ్య!   52.

ఆసనము:
రత్నఖచితమైన నూత్న వేదిక నీకు
చేసి యుంచినాము శీఘ్రగామి!
హేకసాపురీశ! రా కాలు మోపుమా!
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  53.

పాద్యము:
దూరభూమి యనక చేరియుండిన నీకు
భక్తితోడ నిపుడు పాద్య మిదిగొ
స్వీకరించు మయ్య శ్రీకసాపురిదేవ!
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  54.

అర్ఘ్యము:
అర్ఘ్య మందుమయ్య హరివరా! మారుతీ!
కొనుమటంచు నిలిచి కోరుచుంటి
మాలసించనేల యతివత్సలా స్వామి!
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  55.

ఆచమనీయము:
అనిలతనయ! జలము లాచమించెదవంచు
తెచ్చినాము మమ్ము మెచ్చి యిపుడు
నెట్టికంటి హనుమ! నీవందుకొనుమయ్య
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  56.

స్నానము:
వివిధ నదులనుండి విమలమౌ జలమును
పలుటంబులందు పట్టి తెచ్చి
నార మందుమయ్య స్నానార్థ మివ్వాని
కలుషహా! శరణ్య! కపివరేణ్య!   57.

వస్త్రము:
భక్తి రంగరించి పట్టువస్త్రంబులన్
నేసి తెచ్చినాము నెట్టికంటి
సామి వీటినంది క్షేమంబు గూర్చుమా
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  58.

యజ్ఞోపవీతము:
అమలమై వెలుంగు యజ్ఞోపవీతంబు
నిదిగొ తెచ్చినార మిపుడు నీకు
దీనినంది మాకు జ్ఞానంబు పంచుమా
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  59.

గంధము:
సిరులొసంగునట్టి శ్రీగంధమును నీదు
తనువుపైన నలదు తరుణమంచు
వేచియుంటిమయ్య! వినుదీని కొనుమయ్య
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  60.

సింధూరము:
భంధుజనుడవౌట సింధూరమును నీకు
కుంకుమంబు తోడ కూర్మిమీర
చేర్చి తెచ్చినాము చేకొను మోదేవ!
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  61.

అక్షతలు, పుష్పాలు:
లక్షసంఖ్యలందు నక్షతల్ పుష్పముల్
తమలపాకుగములు తగునటంచు
నర్పణంబు చేతు మందుమా హనుమయ్య
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  62. 

నామార్చన:
శతసహస్రనామ సంయుతుండవు గాన
పేరబేర బిలిచి వినయమునను
నతులొనర్తుమయ్య సతతము కావుమా
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  63.

ధూపము:
బహుసుగంధజాల భరితమైయున్నట్టి
ధూప మంది నీవు పాపములను
పారద్రోలు చుండి మారక్ష సేయుమా
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  64.

దీపము:
ఆవునెయ్యితోడ నతులిత సద్భక్తి
రసము బోసి దీప రాజమునిట
వెలుగజేసి నాము స్వీకరించుము దేవ!
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  65.

నైవేద్యము:
ప్పు పాయసంబు లప్పముల్ భక్ష్యముల్
చేర్చి యన్నమునకు శ్రీకసాపు
రీశ! తెచ్చినార మిదియంద గోరెద
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  66.

తాంబూలము:
ఆకు పోకలందు నీకు కర్పూరంబు
కూర్చి యిచ్చుచుంటి కొనుము దేవ!
కరుణ జూపి నన్ను గావ తాంబూలంబు
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  67.

దక్షిణ:
సర్వదుండ వౌట నుర్వి నీకొసగంగ
తగిన దేమి కలదు జగదధీశ!
కొనుము పుష్పమొండు నదక్షిణంబుగా
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  68.

నీరాజనము:
మంగళంబు నీకు మారుతీ! యనియంచు
ప్పురంబుతోడ నముగాను
నెట్టికంటి దేవ! నీరాజనం బిత్తు
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  69.

మంత్రపుష్పము:
జయము జయము నీకు జయమయ్య పావనీ!
జయము జయ మటంచు భయము గూల్చ
మంత్రపుష్పమిత్తు మారుతి! కొనుమయ్య
కలుషహా! శరణ్య! కపివరేణ్య!   70.

ప్రదక్షిణనమస్కారాలు:
ఇపుడు, బూర్వమందు నెన్నియో పాపాలు
చేసియుంటి వాని త్రోసి బ్రోవు
మయ్య! వందనంబు లట్లె ప్రదక్షిణల్
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  71.

నీకు సేవ లిట్లు నిత్యంబు చేయుచు
వానివెనుక క్రమత వాయుపుత్ర!
అందజేతునయ్య ఆచమనీయంబు
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  72.

పనులలోన గాని వాక్కులందున గాని
దొసగులున్న యెడల నసదృశుడగు
వత్సలుండవౌట  వరద! రక్షింపుమా
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  73.

దైవదర్శనంబు దానంబు ధర్మంబు
మాట లిలను నేటి మానవులకు
నటన యయ్యె వీరి నెటుల పాలింతువో
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  74.

విశ్వరూపి వౌట విస్తృతసంభార
మేడనుండి తెచ్చి యీయగలను
భక్తితోడ చేతు ప్రణతులు కొనుమయ్య
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  75.

నిన్ను గాంచినంత నెట్టికంటిప్రభూ
మనములోని భీతి మాయ మగుచు
కూడుచుండు సతము కొండంత ధైర్యంబు
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  76.

సత్యనిష్ఠ బూని సన్మార్గగాములై
బ్రతుక దలచుచుండు వారి కిలను
కలియుగాన బాధ కలుగంగ కతమేమి?
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  77.

సాధుజనులు చేయు సంచార మార్గాన
కంటకంబు లట్టు లంటి యుండు
వారి తొలగద్రోయ వలయు నో యసురారి!
కలుషహా! శరణ్య! కపివరేణ్య!   78.


భ్రాతృభయముచేత వ్యాకుల చిత్తుడై
యుండ రామమూర్తి యండ జూపి
సుఖము గూర్చినావు సుగ్రీవునకు నాడు
కలుషహా! శరణ్య! కపివరేణ్య!   79.

దరథేశ సుతుల దరి జేరి ప్రణమిల్లి
మాటలాడు తరిని మాన్య! నీదు
చతురతా గుణంబు స్పష్టంబు వంద్యంబు
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  80.

శివుని యంశ గలిగి శ్రీరామ సేవలో
ధన్యజీవి వగుట యన్యుల నిల
నరయు డనుట కాదె హరిహరాద్వైతంబు
కలుషహా! శరణ్య! కపివరేణ్య!   81.

నెట్టికంటి హనుమ! గట్టి యత్నము చేసి
ధర్మమార్గమంది నిర్మలమగు
భావ మొదవునట్లు పాలించుమా నన్ను
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  82.

నిన్ను నమ్మినాడ నీకంటె నన్యులౌ
వారి జేర బోను ధారుణిపయి
దారిజూపి కావుమా రుద్రవీర్యజా!
కలుషహా! శరణ్య! కపివరేణ్య!   83.

లంక కేగ నబ్ధి లంఘించు పనిలోన
సీత నరయు నపుడు పాతకులను
సంహరించ నీదు సత్త్వంబు కననయ్యె
కలుషహా! శరణ్య! కపివరేణ్య!   84.

సూక్ష్మరూపధారి! లక్ష్మణప్రాణంబు
గావ గిరిని దెచ్చు కార్య మవుర!
నెట్టికంటి హనుమ! నీకె సాధ్యంబయ్యె
కలుషహా! శరణ్య! కపివరేణ్య!   85.

లంకగూల్చి నిలిచి లంకేశు నెదిరించి
యసురకోటి ద్రుంచి యనలమునకు
పురినొసంగు నీదు చరితమద్భుతమయ్య
కలుషహా! శరణ్య! కపివరేణ్య!   86.

నకసాపురీశ! నను బ్రేమతోగావ
శీఘ్రగతిని రావ! క్షేమ మీవ
శాశ్వతుండవీవ! విశ్వరక్షణభావ!
కలుషహా! శరణ్య! కపివరేణ్య!   87.

దైత్యవీరతతుల నత్యవలీలగా
క్షణములోన యముని సదనమునకు
పంపియున్న నీకు పావనీ జయమందు
కలుషహా! శరణ్య! కపివరేణ్య!   88.

లంకలోన రామ కింకరుండను నేను
రావణాది వేల రక్కసులకు
నన్ను బట్ట దరమె యన్న వీరుండవో
కలుషహా! శరణ్య! కపివరేణ్య!   89.

సీత సంశయింప నీతను వాకాశ
మంత బెంచి నిలిచి యనుపమమగు
స్వీయ శక్తి చూపవే కసాపురవాస!
కలుషహా! శరణ్య! కపివరేణ్య!   90.

నీసమక్షమందు నిలిచియుండిన చాలు
నెట్టికంటి హనుమ!నిఖిలము నిల
గెలువగలుగు శక్తి యలఘుధైర్యం బబ్బు
కలుషహా! శరణ్య! కపివరేణ్య!   91.

జగము లెల్ల మోయు సత్త్వముండియు రామ
దాసువౌట గనగ తావకమగు
వినయదీప్తి హనుమ! విశదమై వెలుగొందు
కలుషహా! శరణ్య! కపివరేణ్య!   92.

శోకతప్తయై యశోకవనమునందు 
నున్న సీత జేరి సన్నుతముగ
ధైర్యమొసగినట్టి కార్యదక్షుడవీవు
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  93.


గదను దాల్చి నీవు మదమత్తులను గూల్చ
హుంకరింరించువేళ సంకటహర!
నమ్మినాను దేవ! నాయండ వీవని
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  94.

కలియుగంబులోన నిలలోన పెరిగిన
స్వార్థబుద్ధి నణచ స్వామి నీవ
నెట్టికంటి దేవ! నిజము దక్షుడవయ్య
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  95.

శీఘ్రగామి వౌట సేవింతు నిత్యంబు
నాదు చిత్తమందు నాటుకొన్న
భావమౌఢ్య మణచ త్వరపడి రావయ్య
కలుషహా! శరణ్య! కప్వరేణ్య!    96.

సాటివారిపైన సద్బుద్ధితో ప్రేమ
కలిగియుండునట్టి నతరమగు
చిత్తశుద్ధి నన్ను చేరంగ జూడుమా
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  97.

నెట్టికంటి హనుమ! నిన్ను దర్శించెడి
భాగ్య మొసగుచుండి యోగ్యమైన
జీవనంబు గూర్చి చేయూత నిమ్మయా!
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  98.

ఆంజనేయ! చిత్త మపసవ్యమార్గాన
కేగకుండ నన్ను వేగముగను
కావ రమ్ము నీదు సేవకుండను గాన
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  99.

నెట్టికంటి దేవ! నీపాదపద్మముల్
మదిని నిల్పి సతము ముదమునందు
భంగి భావ మొదవు భాగ్యంబు నాకిమ్ము
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  100.

దుష్టమతుల కెడను దుర్మార్గగులునైన
వారిచెంత చేరు వాంఛ నాకు
నంటకుండ నెట్టి కంటీశ కావుమా
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  101.

ధనము కాదు నాకు నత లోకములోన
నందునట్లు చూచు టసలె గాదు
నెట్టికంటి దేవ! నీభక్తి నొసగుమా!
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  102.

దేశమందు భక్తి లేశమైనను లేక
ధనము మ్రింగు వారి ననుమతింతు
వేల చెప్పుమయ్య పాలకపదమందు?
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  103.

కనులు మూసి దుష్టకర్మలు చేయుచు
ఎవ్వ రెరుగరనెడి యీజనంబు
లెన్నబోవరౌర నిన్ను సర్వజ్ఞుగా
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  104.

మంచి మాటలాడి యంచితం బగు ప్రేమ
సాటి జనుల యందు సర్వగతుల
పంచగల్గు శక్తి పవనజా! నాకిమ్ము
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  105.

తమసుఖంబు గోరి తడబడ కన్యుల
విషయమందు కఠిన ధిషణులగుచు
సంచరింతు రిలను సర్వజ్ఞ! మానవుల్
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  106.

ధనమె ముఖ్యమయ్యె మనుజుల కీవేళ
బంధుభావ భరిత బంధనములు
భారమయ్యె దీని కారణం బేమయ్య?
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  107.

మలినమంటె జనుల మానసంబులలోన
సమత మమత నరయు సరణి లేదు
హే కసాపురీశ! యిది గాంచవేమయ్య?
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  108.


వాయుపుత్ర! హనుమ! నీయాజ్ఞ నడిపించి
సభ్యతాసుమాలు సర్వజగతి
పరిమళింపజేసి భక్తులం గావుమా
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  109.

సాధుజనులయందు సర్వకాలములందు
నిలిచి యభయ మొసగి నెట్టికంటి
హనుమ! యాదుకొనుమ! ఆంజనేయస్వామి!
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  110.

జగతిలోన సతము సన్నుతాచారంబు
లంది జనులలోన నమలిన మగు
భావ పరిమళంబు వ్యాపింప జేయుమా!
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  111.

సర్వకాలములను సస్యానుకూలమౌ
వృష్టి కల్గుచుండి పుష్టిద మగు
పవన మందజూపు పవమాననందనా!
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  112.

సత్యనిష్ఠబూని నిత్యంబు చరియించు
వారి నెల్ల గతుల బాధలేక
హర్షమందు రీతి యాశీర్వదించుమా
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  113.

కన్నవారి కెల్ల కాలంబు తోడౌచు
సాకుచుండు వారి కో కసాపు
రీశ! సర్వశక్తు లీయంగ గోరెదన్
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  114.

వందనంబులయ్య! వందారు జనబృంద
మందిరాంజనేయ! వందనీయ!
యందుమయ్య వాయునందనా వందనల్
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  115.

నింద సేయబోకు నిన్ను గొల్చుటలోన
దొసగు లుండెనేని కసిగ నన్ను
నాగ్రహించబోకు మయ్య నీభక్తుండ
కలుషహా! శరణ్య! కపివరేణ్య!  116.

ధన్యవాదమందు నన్యమేమియు నీయ
శక్తి లేనివాడ శతకమిట్టు
లిల కసాపురీశ! పలికించినావయ్య!
కలుషహా! శరణ్య! కపివరేణ్య!   117.

హ.వేం.స.నా.మూర్తి.


No comments:

Post a Comment