Wednesday 17 October 2018

స్వాతంత్ర్యము-ప్రజాస్వామ్యము


స్వాతంత్ర్యము-ప్రజాస్వామ్యము
మ.
అవురా! భారతవాసి! నీదుచరితం బత్యున్నతంబౌచు నీ
యవనిన్ వెల్గుచునుండె సత్యముగదా! యన్యత్ర నిన్ బోలు వా
రెవరున్ లేరు, ప్రయత్నపూర్వకముగా నెందేనియున్ గాంచినన్
శ్రవణానందకరంబు నీయశము హే సత్త్వాఢ్య! వీక్షించుమా!                                       1.
మ.
మనమందున్న సమస్త భావగములన్ మాన్యుండ నేనంచు నీ
వనయం బెంచుచు నిచ్చవచ్చిన గతిన్ హాస్యంబు గాదోయి భూ
జను లేరీతిని గుందుచుండిన నిటన్ స్వాతంత్ర్య మిందుండుటన్
నమంచున్ బలుకంగ జూతువు భవత్ కార్యంబు చేకూరగన్.                                  2.
శా.
నీయిష్టంబగురీతి కర్మములలో నిత్యంబు నీ సౌఖ్యమే
ధ్యేయం బంచు దలంచుచున్ పరుల యస్తిత్వంబునుం గూల్చగా
న్యాయంబున్ బరిమార్చ చేకొనెడి నీ నవ్యప్రయత్నంబు త్వత్
స్వాయత్త ప్రతిభావిశేషము ప్రజాస్వామ్యమ్ము నందుండుటన్.                               3.
మ.
అవినీతిం గొని సంమందు సతతం బత్యంత మోదంబుతో
జవసత్త్వంబులు ధారపోసి నిరతస్వార్థంబు చూపించుచున్
నవసౌఖ్యంబులు గాంచుచుండుట యనన్ న్యాయంబు నీకౌనులే
స్తవనీయా! వసియించుచుంటివిగదా! స్వాతంత్ర్యదేశంబునన్.                              4.
శా.
సమ్మెల్ సేయుట, నిత్య మెల్లగతులన్ శక్తిన్ బ్రదర్శించుటల్,
దమ్మంబంచు దలంచి సాంఘిక మహత్ సంపత్తులన్ గూల్చుటల్,
నమ్మం జూపుచు మోసగించుటయె సమ్మానంబుగా నెంచుటల్
సమ్మోదాత్మకమౌను నీకివి ప్రజాస్వామ్యమ్మునందుండుటన్.                              5.
చం.
మతముల్ మార్చుట స్వల్పతుచ్ఛ సుఖసన్మానంబులన్ గోరుచున్,
చతురత్వంబున వైర మొండొరులకున్  సంధించుటల్, పూని స
న్మతి చూపించక స్త్రీల,వృద్ధ జనులన్ బాధించున ట్లాడుటల్
శతశాతమ్మును సవ్యమార్గమె ప్రజాస్వామ్యమ్ము నీదౌటచేన్.                                    6.
మ.
ధరలాకాశము నంటజేయుటయు, శ్రద్ధాసక్తులన్ పౌరులన్
కరుణాలేశము లేక సర్వగతులన్ గష్టంబులన్ ద్రోయుటల్,
నిరతానందము గోరి దీనజనులన్ నిస్త్రాణులన్ జేయుటల్
వరకార్యంబులు నీకు నైనవి ప్రజాస్వామ్య ప్రభావంబుచేన్.                                       7.
మ.
కులధర్మంబులు వీడుచుండుట, యసత్క్రూరత్వభావంబులన్
కలలోనైనను వీడకుండుట, బృహత్కాంక్షన్ పరౌన్నత్యముల్
తొలగంద్రోయగ జూచుచుండుటయు, సంతోషమ్ముతో నంతటన్
ఛలమున్ నింపుట కేక కారణముపో స్వాతంత్ర్యమన్నింటిలోన్.                                 8.
శా.
స్వాతంత్ర్యమ్మున కర్థమీగతి ప్రజాస్వామ్యమ్మునన్ మారి యీ
జాతిన్ దుఃఖ మహాబ్ధి ముంచెను గదా! సంస్కార మీ మానవ
వ్రాతంబందు జనింపజేసి జగతిన్ రక్షించగా రమ్ము హే
ధ్యాతృక్షేమకరా! సమస్త సుఖదా! దండంబు సర్వేశ్వరా!                                           9.

No comments:

Post a Comment