Saturday 13 October 2018

భారతీయం - పైడిమాంబ


భారతీయం - పైడిమాంబ
శా.
శ్రీమంతంబగు భూమి సర్వగతులన్ శ్రేయంబు లందించు స
ద్ధామంబై వెలుగొందు దేశమిది విద్యావైభవోపేతమై
ధీమంతంబను కీర్తిగన్నయది యుద్దీప్తప్రభారాశిగా
నామౌన్నత్యము గాంచె భారతము సన్మానార్హమై యంతటన్.                  1.
శా.
వేదస్థానముగా గణింపబడుచున్ విజ్ఞానసంపత్తితో
మోదంబందరి కందజేయు పనిలో ముఖ్యత్వముం బొందుచున్
నాదబ్రహ్మముగా సమస్తజగతిన్ నవ్యాచ్ఛసత్కీర్తి యీ
నాదేశంబు వహించియుండె నిరతానందాబ్ధిలో దేలుచున్.                               2.
చం.
మునులకు పుట్టినిల్లు, బహుమూల్య సుఖంబుల కాటపట్టు, జీ
వనమును మాధురీవిభవభాగ్యయుతంబుగ మార్చగల్గు పా
వననభావజాలముల పాదు, సమస్త సురేంద్రసం సం
జనిత మహత్వదీప్తిగల స్థానము భారతభూమి చూడగన్.                                3.
ఉ.
సత్యము, ధర్మవర్తనము, సన్నుతి గాంచగలట్టి శబ్దముల్,
నిత్యసుఖంబుపొందగల నిర్మలభావపరంపరావళుల్
కృత్యములందు ఠీవియును, గేహములందు పవిత్రతాస్థితుల్,
ప్రత్యహ మీశ్వరార్చనలు భారత దీప్తికి మూలమంత్రముల్.                            4.
శా.
ఎన్నోభాషలు, నెన్నియో మతము, లింకెన్నెన్నొ వేషంబులున్,
మన్నించందగు భోజ్యభేదములు, సమ్మానార్హసంస్కారముల్,
మున్నీనేలను జూడనట్టి గతు లీభూమిన్ గనన్ వచ్చు నా
యన్నింటన్ నసంస్కృతీవిభవదీవ్యద్వ్యాప్తి  యొప్పారెడిన్                     5.
సీ.
పర్వంబు లీనేల సర్వోత్తమంబులై
గర్వకారణములై పర్వియుండె
ధర్మంబు లిచ్చోట కర్మంబు లన్నిటన్
నిర్మలత్వము చాట నిలిచియుండె,
సంస్కారమును జూపు సంస్కృతీగంధాలు
వ్యాప్తంబులై యుండె దీప్తులలర
ఉన్నతాదర్శాలు మన్నించు వచనాలు
నిత్యంబులై యుండె సత్యమిచట
తే.గీ.
విశ్వమందున్న దేశాలు విభవమందు
భరతభూమికి సరికావు, సురుచిరమగు
భారతీయత బహుగర్వకారణంబు
తలప పూర్వజన్మలతపః ఫలము భవము.                                                         6.
చం.
అనుపమ సంస్కృతీవిభవ మందిన భూమిగ నాంధ్రదేశ మీ
నమగు భారతావనిని గాంచె యశంబుల, నుత్తరాంధ్ర త
ద్ఘనతకు గారణంబులగు స్థానములన్ ప్రముఖంబు, దానిలో
కననగు ధార్మికత్వమున కాంతులనీను విశేషకృత్యముల్.                                    7.
తే.గీ.
విజయనగరాని కిలవేల్పు ప్రజలు కోరు
సౌఖ్యసంపద లత్యంత సత్త్వదీప్తి
గురియ జేయుచు వాత్సల్య భరిత యౌచు
వాసిగాంచిన జగదంబ పైడిమాంబ.                                                                    8.
ఉ.
ఆయమ కన్నతల్లియయి, యందర కండగ నన్నివేళలన్
శ్రీయుతమైన జీవనము, చిన్మయ సౌఖ్యములందజేసి, య
త్యాయతకీర్తు లీస్థలికి నద్భుతరీతిని గూర్చుచుండు, నా
ప్యాయత పంచుచుండు నతు లామెకు చేసెద పైడిమాంబకున్.                              9.
చం.
సిరిమానుత్సవభూమి నీ నగరిలో క్షేమార్థులై యందరున్
నిరతానందదయైన యంబ నెపుడున్ నిష్ఠాగరిష్ఠాత్ములై
"వరసంతోషము పైడితల్లి! యిడుమా, భాగ్యంబు లందించుమా
కరుణం జూపుమటంచు గొల్తురు గదా కల్యాణదన్ భక్తితోన్.                      10.
చం.
పరమ దయార్ద్రచిత్తయగు పైడిమ భక్తజనాల ప్రార్థనం
బురుతర వత్సలత్వమున నొప్పుగ నంది నిరంతరమ్ముగా
స్థిరమగు హర్షముం గలుగజేయుచు క్షేమము లందు రీతి స
ద్వరము లొసంగి గాచు బహుభంగుల తల్లులతల్లి గావునన్.                       11.
శా.
నీవీప్రాంతసమస్త పౌరగణమున్  నిత్యానురాగంబుతో
దేవీ! పైడిమ! రక్షసేతువుగదా! దేదీప్యమానోజ్జ్వలా!
భావంబందు వసించి బ్రోవదగు నో భాగ్యప్రదాత్రీ! భవత్
సేవన్ నిత్యనిమగ్నులై నిలిచి స్వస్తింగోరు త్వద్భక్తులన్.                    12.
సీ.
విజయనగరమందు విస్తృతం బగురీతి
హర్షసంతతు లెప్పు డలము నట్లు
ఉత్తరాంధ్రములోన నున్నతం బై వెల్గు
సద్యశో విభవంబు సాగునట్లు
యావదాంధ్రమునందు దేవి! నీకృప చేత
నిత్యసౌఖ్యంబులు నిండు నట్లు
భారతావనిలోన సారవంతములైన
విజయదీపిక లెల్ల  వెలుగు నట్లు
ఆ.వె.
సకల జనుల కిందు నకలంక భాగ్యంబు
లందుచుండునట్టు లనవరతము
పైడిమాంబ! కృపను ప్రసరింప చేయుమా
భయము గూల్చు నీకు జయము తల్లి!                                                    13.

No comments:

Post a Comment